మోదీ పాలనలో ఆధ్యాత్మిక స్వేచ్ఛకు కొత్త ఊపిరి
ఇటీవల దుబాయ్ లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాను. ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినందుకు ఆ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సన్మానం పొందిన వ్యక్తి పొరుగున నివసించిన మరో వ్యక్తి ఆ వ్యాపారవేత్త చెవులు కుట్టించుకుని చెవిపోగులు ధరించడం గమనించి దాని గురించి అడిగాడు. ఆ వ్యాపారవేత్త సమాధానం చెప్పడానికి కొంచెం సంకోచించాడు, కానీ చివరికి తానూ తన సాంస్కృతిక మూలాలను గౌరవించడం ప్రారంభించానని, గత కొన్ని సంవత్సరాలుగా చెవిపోగులు ధరించడం మొదలుపెట్టానని చెప్పాడు. చెవిపోగులు వేసుకున్న తన కొడుకును కూడా చూపించాడు. యూఏఈలోని ఓ ప్రముఖ ఎన్నారై నిజాయితీతో చేసిన ఈ ప్రకటనను భారత్ లోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రవాసులైన ప్రేక్షకులు అభినందించారు. 60 ఏళ్ళ వయసులో ఉన్న ఆ పెద్దమనిషి అకస్మాత్తుగా తన సాంస్కృతిక అస్తిత్వం విలువను గ్రహించి దాన్ని బహిరంగంగా ప్రదర్శించడానికి కారణం ఏమిటా అని నేను ఆలోచించాను. ఆయన ఒక్కరే కాదు – అలాంటి వేలమంది మంది ఉన్నత వర్గాలు నేడు తమ మత, సాంస్కృతిక మూలాలను సగర్వంగా ప్రదర్శిస్తున్నారు. అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని భావిస్తున్నారు. సాంస్కృతిక వారసత్వంలోనే కాదు, దాన్ని బహిరంగంగా ప్రదర్శించడంలో కూడా ఇప్పుడు గర్వం ఉంది.
గత దశాబ్ద కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుకోకుండానో, ఉద్దేశపూర్వకంగానో తెచ్చిన అతి పెద్ద మార్పుల్లో ఇదొకటి. ఏడాది క్రితం 2024 జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించినప్పుడు ఇది జరిగింది. భారత్ లోని ఉన్నత వర్గాలకు చెందిన ప్రముఖులందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది వారి సొంత చార్టర్ విమానాలలో వచ్చారు – వాటిలో కొన్నిటిని స్థలం కొరత కారణంగా కోల్ కతాకు దూరంగా ఉన్న ప్రదేశాలలో నిలపవలసి వచ్చింది. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో ఇలాంటి పరిస్థితే ఇప్పుడు చోటు చేసుకోవడం మనం చూడవచ్చు. “మతం అనేది అణచివేయబడిన జీవి నిట్టూర్పు, హృదయం లేని ప్రపంచానికి హృదయం, ఆత్మలేని పరిస్థితుల ఆత్మ. ఇది ప్రజలకు నల్లమందు,” అని 1843లో కారల్ మార్క్స్ రాశాడు. ఒక శతాబ్దం తరువాత, 1955లో, మావో జెడాంగ్ దలైలామాకు ఇదే విషయాన్ని చెప్పాడు, కాని ఆయన ఉద్దేశం ఏమిటంటే, మతం అధికారంలో ఉన్నవారు సమాజాన్ని నియంత్రించేందుకు ఒక సాధనంగా ఉపయోగపడిందని. ఈ రోజు భారతదేశంలో మనం చూస్తున్నదాన్ని ‘నల్లమందు’ అనలేం. వీధిలో ఉన్న వ్యక్తి నుంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వరకు ప్రతి భారతీయుడు నేడు ధార్మిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. పాశ్చాత్య దేశాలలోని సాంప్రదాయిక ఉదారవాదులు మూడు అంశాలను ఉదారవాదాన్ని నిర్వచించే లక్షణాలుగా భావించారు. అవి భయం నుంచి, ఆకలి నుంచి, అణచివేసే సామాజిక నిబంధనల నుండి స్వేచ్ఛ. ఆ ఆధ్యాత్మిక స్వేచ్ఛను, నిజమైన ఉదారవాదాన్ని సనాతన ధర్మాన్ని అనుసరించేవారు అనుభవిస్తారు.
కుంభమేళా వంటి హిందూ ధార్మిక, సాంస్కృతిక ఆచారాలు ఆ స్వేచ్ఛకు ప్రతీక. కొద్ది రోజుల క్రితం మేళాలో జరిగిన విషాదం అత్యంత దురదృష్టకరం. ప్రాణనష్టం జరిగినప్పుడు విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసింది. ప్రమాదం జరిగిన రోజు నేను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి లక్నోలో ఉన్నాను. ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆయన అధికారులను పిలిచి మందలించడం, పవిత్ర స్నానాలు వాయిదా వేసి ముందుగా సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇవ్వాలని ప్రయాగ్ రాజ్ లోని సాధువులకు విజ్ఞప్తి చేయడం నేను చూశాను. ప్రధాని మోదీ కూడా అనేకసార్లు ఫోన్ చేసి యాత్రికుల భద్రతపై ఆరా తీశారు. కుంభమేళా సమయంలో వచ్చే ఐదు పవిత్ర దినాల్లోనూ ప్రజలు తమ మతపరమైన పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్లేందుకు వీలుగా వీఐపీ కదలికలను అనుమతించడం లేదని ముఖ్యమంత్రి నాకు చెప్పారు. కుంభమేళా సందర్శనకు ఆ రోజులను ఎంచుకోవద్దని ఆయన దిల్లీలోని అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని కోరారు. ఇంత జరిగినా విషాదం చోటు చేసుకుంది.
స్వాతంత్య్రం అనంతరం ప్రయాగ్ రాజ్ లో 1954లో తొలి కుంభమేళా జరిగినప్పుడు భారత లౌకికవాదానికి ‘పితామహుడైన’ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయినా తొక్కిసలాట జరిగి దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటనతో చలించిపోయిన నెహ్రూ మేళాలో వీఐపీలను అనుమతించరాదని పట్టుబట్టారు. అయితే నెహ్రూ మేళాను గానీ, హిందూ సంప్రదాయంలోని అటువంటి ఆచారాలను గానీ పూర్తిగా తిరస్కరించలేదు. రోమై రోల మాటలను ఉటంకిస్తూ, “ఒక ఆలోచన మతం నుంచి ఉద్భవించిందా లేదా అనే అంశాన్ని నిర్ణయించేది ఒక ఆలోచన గుణమే గాని దాని మూలం కాదు. అది ఏ త్యాగానికైనా సిద్దపడి చిత్తశుద్ధితో నిర్భయంగా సత్యాన్వేషణ వైపు మళ్లితే, దాన్ని నేను ధార్మికం అంటాను. సందేహవాదం కూడా దూకుడుగా ముందుకు సాగినప్పుడు, అది బలహీనతకు కాకుండా బలానికి వ్యక్తీకరణ అయినప్పుడు, ధార్మిక మహాసైన్యం ప్రయాణంలో అది భాగమవుతుంది.” “రోమై రోలా షరతులను నేను నెరవేరుస్తానని నేను అనుకోలేను, కానీ ఈ షరతుల ప్రకారం నేను ధార్మిక మహాసైన్యం వినయపూర్వక అనుచరుడిగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాను,” అని నెహ్రూ అన్నారు. నెహ్రూ ఒక సందేహవాది. గాంధీ పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నించిన తన నిజమైన ఆత్మకు, ఆయన నమ్మిన తప్పుడు యూరోపియన్ భావనలకు మధ్య నలిగిపోయాడు. ఆ సందేహ వాదాన్ని తరతరాల ఉన్నత వర్గాల భారతీయులపై రుద్దారు. దానిని మోదీ చెరిపేసేందుకు ప్రయత్నించి విజయం సాధించారు. నెహ్రూ ప్రస్తుత వారసుల రాజకీయాల్లో ఈ సందేహతత్వం కనిపిస్తుంది. కానీ మల్లికార్జున ఖర్గే వంటి నాయకులకు కూడా ఇది ఒక నమ్మకంగా మారినట్లు కనిపిస్తోంది. అందుకే వారు భారతీయుల విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు, పవిత్ర స్నానం వంటి ఆచారాలను విమర్శిస్తున్నారు. కోట్లమంది భారతీయులకు మాత్రం ఇప్పుడు అలాంటి సందేహాలు లేవు. అందుకే ఎన్ని విషాదాలు ఎదురైనా మేళాలో పాల్గొనే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది.
ఏడు దశాబ్దాల క్రితం నెహ్రూ వెళ్లినప్పుడు మేళాలో 40 లక్షల మంది ఉన్నారు. అప్పటి నుంచి భారతదేశ జనాభా నాలుగు రెట్లు పెరిగింది, కానీ మేళాకు ఈ సంవత్సరం 100 రెట్లు ఎక్కువ సందర్శకులు వస్తారని భావిస్తున్నారు. ఆ కోట్లమందికి ఇది రాజకీయ యాత్ర కాదు, మేల్కొన్న ఆత్మ చేసే ఆధ్యాత్మిక ప్రయాణం. బానిసత్వ కళ్లద్దాలు పెట్టుకుంటే ఇది ఎప్పటికీ అర్ధంకాదు.
రామ్ మాధవ్,
బిజెపి నాయకులు

