ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజెపి జోరు
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి దూసుకుపోతుంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ముమ్మర ప్రచారంతో ప్రజలను ఆకట్టుకొంటోంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం బిజెపి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి మల్కం కొమరయ్య, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా పట్టభద్రులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవాలన్నా, అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నా పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే సమర్థత ఉన్న బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 27న ఈ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో బిజెపి తెలంగాణ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని ఉధృతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కుమార్ ఫిబ్రవరి 8న బిజెపి ఆధ్వర్యంలో కరీంనగర్ రాంనగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు ‘‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’’ నిర్వహించారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. ఈ యాత్రకు బండి సంజయ్ తోపాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకరమణా రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఉమ్మడి మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బిజెపి అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలోని బీసీలో పోటీ చేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింలు గెలిచారన్నారు. మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండటం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పాలంటే బిజెపి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 9న నల్గొండలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యశాలకు హాజరైన బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ కు ఓటు వెయ్యమని ఎవరైనా వస్తే, హామీల అమలు ఏమైందని ప్రశ్నించాలన్నారు. ఉపాధ్యాయుల, పట్టభద్రుల హక్కుల కోసం, వారి డిమాండ్ల పరిష్కారం కోసం నాడు, నేడు, భవిష్యత్తులో కూడా కొట్లాడేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ‘‘ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. స్కూళ్లలో చాక్ పీసులకు కూడా పైసల్లేని దౌర్భాగ్యం తెలంగాణలో ఉంది. విద్యాశాఖకు ఇప్పటికీ మంత్రిలేని పరిస్థితి ఉంది. తెలంగాణలో విద్యావ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బంధీ అయింది. విద్యా కమిషన్ లో నక్సల్స్ భావజాలం ఉన్న వాళ్లకు చోటు కల్పించారు. గన్నుల పాలన కావాలా? పెన్నుల పాలన కావాలా? ఆలోచించుకోవాలి.’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. బిజెపి అభ్యర్థులకు మద్దతుగా ఆయా నియోజకవర్గాల్లోని బిజెపి నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు.

