NRR Pracharam

మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి

Nirmal Pracharamమున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతోంది. వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కమలం సేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ప్రతి చోటా పోటీలో నిలిచింది. కార్పొరేషన్లలో మేయర్, మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠాలను సాధించాలన్న పట్టదలతో కాషాయ శ్రేణులు కదం తొక్కుతున్నాయి.  రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మార్గదర్శనంలో బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాలైన ప్రచార కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

ఈ దఫా మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి టికెట్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కొక్క చోట ముగ్గురు, నలుగురు అభ్యర్థులు బీ-ఫాం కోసం పోటీలో నిలిచారు. అయితే, పార్టీ నాయకత్వం సమగ్ర సంప్రదింపులు జరిపి, సర్వేలు చేపట్టి, సమిష్టి నిర్ణయంతో గెలిచే అభ్యర్థులను ఎంచుకొని టికెట్లను కేటాయించింది. టిక్కెట్లు పొందని కార్యకర్తలు నిరాశ చెందకుండా, జిల్లా, రాష్ట్ర నాయకులు వారితో మాట్లాడి సముచిత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించి శ్రేణులను ఉత్సాహపరిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాలలో ప్రచారం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. ఇక బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలిపించే బాధ్యతను భుజానేసుకున్నారు. ఎలాగైనా బిజెపి అభ్యర్థులను గెలిపించాలన్న కృతనిశ్చయంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశిష్ శేలార్, రాజస్థాన్ బిజెపి మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామీ, జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్, హరియాణా రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలు ఎన్నికల నిర్వహణ కమిటీ పనితీరును పర్యవేక్షించారు. వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరి 2న ”బూటకపు హామీలు – మోసపూరిత వాగ్దానాలు” శీర్షికన కాంగ్రెస్ అరాచక, అవినీతి పాలనపై బిజెపి చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. దీనికి అనుబంధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ స్థానిక వైఫల్యాలతో ప్రత్యేక చార్జ్‌షీట్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 6న ”వికసిత తెలంగాణ సంకల్ప పత్రం” పేరిట పార్టీ మ్యానిఫెస్టోను, దీనికి అనుబంధంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ స్థానికంగా ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేశారు. 

అధికార కాంగ్రెస్ కు బిజెపినే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలు, హామీల ఉల్లంఘనలు ఎండగడుతూనే మరోవైపు రాష్ట్రానికి, ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలను ప్రజల ముందు పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వస్తోన్న విమర్శలను దీటుగా తిప్పికొడుతున్నారు. సోషల్ మీడియాలో బిజెపి ఇన్ఫోగ్రాఫిక్స్, రీల్స్, షార్ట్స్, వీడియోలు, పాటలు వైరల్ గా మారాయి. క్షేత్రస్థాయిలో వస్తోన్న స్పందన చూస్తే ఈసారి గణనీయ సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బిజెపి ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది.

మ్యానిఫెస్టో ప్రధాన హామీలు

  • మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపూ ఉండదు.
  • ఆన్ లైన్, సింగిల్ విండో సిస్టం ద్వారా వారం రోజులలో ఇంటి అనుమతులు.
  • ప్రతి వార్డు/డివిజన్ లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు. 
  • అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్ లను స్మార్ట్ సిటీస్ గా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం. 
  • మున్సిపాలిటీ/కార్పొరేషన్ లను క్లీన్ సిటీ/ గ్రీన్ టౌన్ గా తీర్చిదిద్దుతాం.
  • అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్ లో దోమలు, కోతులు, పందులు, కుక్కల బెడదను నివారిస్తాం.
  • ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు అండర్ పాస్, ఓవర్ హెడ్ బ్రిడ్జిలు నిర్మిస్తాం.
  • అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్లలో 100 % అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ.
  • మున్సిపాలిటీల్లో దేవాలయాల పరిరక్షణ, కబ్జాల నుంచి దేవాలయ భూముల విముక్తి, ప్రతి మున్సిపాలిటీల్లో గోశాలల ఏర్పాటుతో గోవులకు రక్షణ.
  • అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్లలో పోలీస్ శాఖ సహకారంతో షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం.
  •  అన్ని మున్సిపాలిటీ/కార్పొరేషన్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు.
  • మైనర్ మున్సిపాలిటీలో 1, మేజర్ మున్సిపాలిటీలో 2 మల్టీ పర్పస్ పార్కులు.
  • AI సాంకేతికత సహకారంతో అవినీతి రహితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు.
  • 100% ఇంటింటి చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణతో చెత్త రహిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు.

చార్జ్‌షీట్‌ ముఖ్యాంశాలు

  • పెండింగ్ DAలు, PRC నుంచి నగదు రహిత వైద్యం వరకు అన్నింటా ఉద్యోగులకు మోసం
  • రుణమాఫీ కాక, ‘భరోసా’ దక్కక, భూమిపై హక్కులు కోల్పోయి అరిగోస పడుతోన్న అన్నదాత
  • ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించరు.. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయరు.. విద్యారంగంపై నేరపూరిత నిర్లక్ష్యం
  • ఆరోగ్య శ్రీకి పైసలియ్యరు.. ప్రభుత్వాసుపత్రులు కట్టరు.. భ్రష్టుపట్టిన ప్రభుత్వ వైద్యం
  • నెలకు రూ.2500 ఇయ్యలే.. కళ్యాణమస్తు అమలుకాలే.. స్కూటీలివ్వలే.. మహిళలకు మిగిలిందల్లా మోసమే
  • ఇండ్లు ఇయ్యలే.. ఫించను పెరగలే.. లోన్లు రాలే.. పేదల పాలిట భస్మాసుర ‘హస్త’మే
  • సంక్షేమానికి సున్నం కొట్టిన్రు.. ఆటో డ్రైవర్లను ఆగం చేసిన్రు.. కార్మికులపై కక్ష సాధిస్తున్న కాంగ్రెస్
  • కొలువులు రాకపోయే.. ఉపాధి ఉత్తదాయె.. నిరుద్యోగ భృతి భ్రాంతిగా మారె.. యువత ఆశలు ఆవిరి
  • 12 లక్షల సాయం లేదు.. కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు లేవు.. వంచనైన SC, STలకిచ్చిన హామీలు
  • 42 శాతం రిజర్వేషన్లు.. సబ్ ప్లాన్.. కార్పొరేషన్ రుణాలు.. బీసీ డిక్లరేషన్ అమలెక్కడ!
  • MSMEలకు రుణాలు లేవు.. ఇండస్ట్రియల్ కారిడార్లు లేవు.. పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వానికి సోయి లేదు..
  • సంక్షోభంలో తెలంగాణ కొంగుబంగారం.. కాంట్రాక్టుల కోసం మంత్రుల మధ్య వైరం.. సర్కార్ తీరే సింగరేణికి శాపం