ముస్లింల ప్రాపకం కోసమే కాంగ్రెస్ కులగణన
కులగణన దేశానికి రోల్ మోడల్‌గా, రోడ్ మ్యాప్‌గా మారుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారని, తీరా లెక్కలు చూస్తూ ముస్లింల ప్రాపకం కోసమే కులగణను చేపట్టినట్లుగా స్పష్టంగా కనపడుతోందని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. ఇదేనా దేశానికి రోల్ మోడల్ అని ప్రశ్నించారు. ఇది బీసీల హక్కులను కాలరాసే కుట్రగా అభివర్ణించారు. గతంలో బీసీల వాటాను 51 శాతం నుంచి 46 శాతానికి తగ్గించిన కాంగ్రెస్, ఇప్పుడు ముస్లింలను ఓబీసీల్లో చేర్చే ప్రయత్నం చేస్తోందన్నారు. 12 శాతం ఉన్న ముస్లిం జనాభాలో 10 శాతం ఓబీసీల్లో చేర్చి ఓబీసీల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఇది బీసీల పొట్టగొట్టి హక్కులను కాలరాయడమేనని తెలిపారు.
సంఘ సంస్కర్త, సామాజిక రుగ్మతలు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, బాలికా విద్య, స్త్రీ హక్కులు, వితంతు పునర్వివాహానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఏప్రిల్ 11న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతం రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో, ఓబీసీ రిజర్వేషన్ల అంశం పేరుతో కులగణన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంటిపోరు, హైకమాండ్ పోరు తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో కులగణన చేపట్టారు. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ మొసలికన్నీరు కారుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేకుండా, 9వ షెడ్యూల్ వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసేందుకు ఆర్టికల్ 243(D) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ 9వ షెడ్యూల్‌ను తీసుకొచ్చి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. శాసనసభలో చేసిన చట్టాన్ని గవర్నర్ ఆమోదించిన వెంటనే జీవో అమలు చేయొచ్చు. కానీ 9వ షెడ్యూల్‌లో పొందుపరిస్తే గానీ రిజర్వేషన్ల అమలు చేయరాదనే భావనను ప్రజల్లో కల్పిస్తోంది. భారత సుప్రీంకోర్టు ఇందిరా సహానీ తీర్పు (1992) ప్రకారం రాష్ట్రాలు 50 శాతం గరిష్ట పరిమితిని పాటించాలని నిబంధన ఉంది. తమిళనాడు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చారని చెబుతున్నారు. కానీ ఇది సుప్రీంకోర్టు విధించిన 50% రిజర్వేషన్ల హద్దును మించిపోతుంది. ఇది కోర్టులో సవాలు ఎదుర్కొంటోంది. రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలిసీ కూడా కోర్టు వివాదంలోని అంశాన్ని సాకుగా తీసుకొని “9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయి” అనే వాదనతో ప్రజల్ని మభ్యపెడుతోంది. కేంద్రంపై నెపం నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టికల్ 243(D) ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో శాస్త్రీయ పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీన్ని వెంటనే అమలు చేయాలి.
మహాత్మా జ్యోతిబా పూలే విద్యకు మించిన సంపద లేదని, మహిళలు చదువుకుంటేనే సమాజంలో రాణించగలుగుతారని, వితంతువులకు పునర్వివాహం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు – బేటీ బచావో బేటీ పదావో, విద్యా సమగ్ర అభివృద్ధి – ఇవన్నీ ఫులే ఆశయాలే. కేంద్రంలో మొదటిసారిగా 27 మంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చి, కేంద్ర విద్యాసంస్థల్లో 27 శాతం రిజర్వేషన్లు, కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలల్లో, సైనిక్ స్కూళ్లలో, న్యాయ విశ్వవిద్యాలయాలతో పాటు నీట్ మాధ్యమాల్లో జరిగే పరీక్షల్లోనూ 27 శాతం రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం కల్పిస్తోంది. వెంచర్ క్యాపిటల్ ఫండ్ ద్వారా బీసీలను పారిశ్రామికవేత్తలను తయారుచేసేలా ఇతోధికంగా బ్యాంకుల రుణ సదుపాయం కల్పిస్తోంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనతో 18 రకాల వృత్తులవారికి సాయం అందిస్తోంది.’’ అని అన్నారు.