నరేంద్ర మోదీ వరుస విజయాల రహస్యం
నరేంద్ర మోదీ మళ్లీ గెలిచారు. ఆయన భారత ప్రధాన మంత్రిగా వరుసగా మూడవసారి విజయం సాధించారు. క్రికెట్ భాషలో చెప్పాలంటే హ్యాట్రిక్. అలా చేయడం ద్వారా ఆయన భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎన్నికల రికార్డును సమం చేశారు.
మోదీ ఎందుకు గెలుస్తూనే ఉన్నారు? దీనికి అనేకమంది అనేక కారణాలు చెబుతారు. కానీ అవన్నీ నిజమైన కారణాలు కాదు. ఎందుకంటే ఆయన హేతుబద్ధమైన కారణాల కంటే భావోద్వేగపరమైన కారణాల వల్ల గెలుస్తున్నారని నా అభిప్రాయం. అయన ప్రజలను అనుభూతి చెందేలా చేస్తారు. ‘మాకు గుర్తింపు లభించింది, మేం దీన్ని అనుభూతి చెందుతున్నాం. మాకూ పరిగణన ఉంది’ అని ప్రజలు భావించేలా ఆయన చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన వారిని గర్వించేలా చేస్తారు. ఎర్రకోట ప్రాకారాల నుండి ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యాల లేమి గురించి మాట్లాడినప్పుడు ఆయన గ్రామీణ ప్రాంతాల్లోని కోట్ల మంది మహిళల చెప్పుకోలేని సమస్యను అర్థం చేసుకున్నట్లు మనకు అనిపించింది. తమ సమస్యలు తెలిసిన వారు ఒకరు ఉన్నారనే భావనను ఆయన వారిలో కల్పించారు. 1960వ దశకంలో ఐఏఎస్ అధికారిగా భారతదేశంలోని మారుమూల గ్రామాలలో సేవ చేస్తున్నప్పుడు ఈ సమస్య తీవ్రతను తెలుసుకున్నాను.
పంచాయతీరాజ్ రాజకీయాలు గ్రామాల్లో గొడవలకు కారణమవుతున్నాయని తెలుసుకున్న ఆయన ఏకగ్రీవంగా పంచాయతీ పాలక వర్గాలను ఎన్నుకున్న గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారు. అహ్మదాబాద్ జిల్లా అభివృద్ధి అధికారిగా దీని గురించి ముందే ఆలోచించకపోవడం నాకు సిగ్గనిపించింది. లండన్‌లో తన భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నించినప్పుడు అయన భాగవతం నుంచి ఒక శ్లోకాన్ని ఉటంకించినప్పుడు, అయన మన హిందూ వారసత్వం గురించి మనం గర్వపడేలా చేశారు: “నేను స్వర్గాన్ని, రాజ్యాన్ని లేదా మోక్షాన్ని కూడా కోరను. నేను అన్వేషిస్తున్నదల్లా బాధపడేవారి బాధలను అంతం చేయడమే.”
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఋగ్వేదంలోని ముగింపు శ్లోకాలను ఉటంకిస్తూ, “మీరు కలిసి మాట్లాడవచ్చు, కలిసి నడవొచ్చు” అని ఆయన చెప్పిన మాటలు కూడా అదే గర్వాన్ని మనలో నింపాయి. అజ్మీర్ లోని మొయినుద్దీన్ చిస్తీ మందిరానికి చాదర్ (పవిత్ర వస్త్రం)ను సమర్పించినప్పుడు ఆయన మన ఇస్లామిక్ వారసత్వాన్ని గురించి, సెయింట్ జేవియర్ పండుగ రోజున గోవా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు మన క్రైస్తవ వారసత్వం గురించి గర్వపడేలా చేశారు. అమెరికా అధ్యక్షుడిని ఉద్దేశించి హిందీలో ప్రసంగించినప్పుడు ఆయన మన భాషా వారసత్వం గురించి గర్వించేలా చేశారు. తమిళంలో తమిళనాడు ప్రజలతో, కర్నాటకలో కన్నడంలో, ఆంధ్ర ప్రజలతో తెలుగులో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే పని చేశారు.
రామాలయాన్ని ధ్వంసం చేసిన చోటే జనవరి 22, 2024న రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆయన మన సాంస్కృతిక అచంచలత్వం గురించి మనం గర్వపడేలా చేశారు. ఈ సందర్భంగా అన్ని కులాల స్త్రీ పురుషులను ఒక సమష్టి బృందంగా పరిగణించి మనలో సమానత్వ భావనను నింపారు. 2022లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించినప్పుడు, నౌకాదళ చిహ్నమైన వలస పాలన నాటి సెయింట్ జార్జ్ క్రాస్ స్థానంలో ఛత్రపతి శివాజీ రాజముద్రను ప్రవేశపెట్టి మన సైనిక వారసత్వం గురించి మనం గర్వపడేలా చేశారు. ఎవరైనా మనతో మాట్లాడిన వాటిని లేదా మనకు ఇచ్చిన ఉపన్యాసాలను లేదా మన గురించి చేసిన వ్యాఖ్యలను మనం మరచిపోవచ్చు, కానీ ఎవరైనా మనలో కలిగించిన, ప్రేరేపించిన అనుభూతులను మనం ఎప్పటికీ మరచిపోలేం. ఈ విషయాన్ని ప్రధాని మోదీ మరిచిపోలేదు.
అరవింద్ శర్మ,
బిర్క్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్

