నెహ్రూ కాంగ్రెస్ వల్లే వందేమాతరం, దేశం ముక్కలు
బ్రిటిష్ జాత్యహంకార సైనిక అధికారి దాడి, వారి జాతీయగీతాన్నే మనపై రుద్దే ప్రయత్నాలను అడ్డుకునేందుకు, భరతజాతిని చైతన్య పర్చేందుకు దేశభక్త కవి, రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం మొదటి చరణాలు నవంబర్ 7, 1875న బంగ దర్శన్ అనే సాహితీ పత్రికలో ప్రచురితమయ్యాయి. వందేమాతరం గీతానికి ముగ్దుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ 1879లో ఈ గీతాన్ని ప్రస్తుతిస్తూ 18 ఏళ్ల వయస్సులోనే కవిత రచించారు. 1777లో దేశ సన్యాసిలు స్వతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి బలైన విషయాల ఆధారంగా బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ పుస్తకాన్ని పూర్తి వందేమాతరం గీతంతో 1882లో ముద్రించారు. ఆనంద్ మఠ్ పుస్తకం ఆదరణ పొందినప్పటికీ, 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని ఆలపించేవరకు ‘వందేమాతరం’కు గుర్తింపు రాలేదు. 1905లో అప్పటి గవర్నర్ జనరల్ కర్జన్ బెంగాల్ విభజనతో వందేమాతరం గీతం దేశభక్త మంత్రంగా బెంగాల్ సహా యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ గీతం ప్రేరణతో జరిగిన ఉద్యమాన్ని చూసి బ్రిటిష్ ప్రభుత్వం వెనక్కుతగ్గి బెంగాల్ విభజనను ఉపసంహరించుకుంది.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతర ఉద్యమం చిరస్థాయిలో నిలిచిపోతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ సహా ప్రతి విప్లవ వీరుడు ఉరికంబాలపై వందేమాతరం నినదించారు. నిజాం నిరంకుశ దారుణాలకు వ్యతిరేకంగా పోరాడిన వావాలాల రామచంద్ర రావు ప్రతి కొరడా దెబ్బకు వందేమాతరం నినదిస్తూ ‘వందేమాతరం రామచంద్ర రావు’గా మారారు. విప్లవ వీరులతో సహా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వందేమాతరం గీతాన్ని ఆలపించేవారు. ఉధృతమవుతున్న స్వతంత్ర్య పోరాటాన్ని, హిందూ-ముస్లిం ఐక్యతను జీర్ణించుకోలేని బ్రిటిష్ ప్రభుత్వం 1906లోనే ముస్లిం మత నాయకులను రెచ్చగొట్టి, ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటయ్యేలా చేసింది.
1857 తొలి భారత స్వతంత్ర సంగ్రామం తర్వాత మరోసారి ఇలాంటి రాకూడదని, అందుకు తమకనుగుణంగా ఒక సంస్థ ఉండాలని, సేఫ్టీ వాల్ సిద్ధాంతంతో అప్పటి గవర్నర్ జనరల్ డఫ్రీన్ రిటైర్డ్ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ. హ్యూమ్ చే కాంగ్రెస్ పార్టీని స్థాపింప చేశాడు. తొలి దశాబ్దంలో కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ బానిస మనస్తత్వాన్ని, మొక్కుబడి సమావేశాలను చూసిన మహోన్నత దేశభక్తుడు బాలగంగాధర్ తిలక్ కప్పల్లాగా సంవత్సరంలో మూడు రోజులు అరిస్తే దేశానికి ఏం మేలు జరగదని విమర్శించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు, అది సాధించి తీరుతాను’ అన్న తిలక్ నినాదం, కృషితో కాంగ్రెస్ సంస్థ జన బాహుళ్యంలోకి వెళ్లింది. కానీ బ్రిటిష్ అడుగులకు మడుగులొత్తే కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు బాలగంగాధర్ తిలక్ ను ఎన్నడూ పార్టీ జాతీయ అధ్యక్షుడిని కానివ్వలేదు. 1939లో రెండోసారి అధ్యక్షుడైన సుభాష్ ఛంద్రబోస్ ను బలవంతంగా అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి, పార్టీ నుంచి వెళ్లగొట్టారు. మొదటి నుంచి బ్రిటిష్ కుట్రల్లో భాగంగా ముస్లిం సంతుష్టీకరణ విధానాన్ని అవలంబిస్తూ వచ్చిన కాంగ్రెస్ పై నెహ్రూ ప్రభావం పెరుగుతూ వచ్చింది.
1923లో జరిగిన కాకినాడ కాంగ్రెస్ సమావేశాల్లో అప్పటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మౌలానా మహమ్మద్ అలీని సమావేశాల స్థలం నుంచి బహిరంగ సభ ప్రాంతం వరకు మేళతాళాలతో తీసుకువచ్చారు. అప్పుడు అభ్యంతరం పెట్టని మౌలానా మహమ్మద్ అలీ, బహిరంగ సభలో ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ విష్ణు దిగంబర పలుస్కర్ వందేమాతరం గీతాన్ని ఆలపించడాన్ని అడ్డుకున్నాడు. వందేమాతరం గీతంలో సంగీతం ఉందని, సంగీతం ఇస్లాంకు వ్యతిరేకమని అభ్యంతరం తెలిపాడు. సభా వేదిక వద్దకు వస్తుండగా వాయించిన మేళతాళాల్లో సంగీతం కనిపించలేదా? వందేమాతరం గీతంలోనే సంగీతం కనిపించిందా? అని ప్రశ్నిస్తూ ఫలుస్కర్ వేదికపై నుంచి వందేమాతరం ఆలపించారు. దానికి నిరసనగా మౌలానా మహమ్మద్ అలీ వేదిక దిగి నిలబడితే, ఏ కాంగ్రెస్ నాయకుడు అభ్యంతరం చెప్పలేదు. కాంగ్రెస్ ముస్లిం సంతుష్టీకరణ విధానాలకు ఆలవాలమైందని గ్రహించిన డాక్టర్ హెడ్గేవార్ 1925లో దేశ సర్వ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. కాకినాడలో మౌలానా మహమ్మద్ అలీ పేరుతో ఉన్న రోడ్డును ఈ ఏడాది ‘వందేమాతరం రోడ్డు’గా పేరు మార్చారు.
ముస్లిం లీగ్ నేత జిన్నా అభ్యంతరాన్ని స్వీకరిస్తూ జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతం ఆత్మ అయిన ముఖ్య మూడు చరణాలను తొలగించాలని కాంగ్రెస్ నాయకులను బలవంతపెట్టి, వందేమాతరం గీతాన్ని ముక్కలు చేసి, తన దేశద్రోహ బుద్ధిని చాటుకున్నాడు. నెహ్రూ ముస్లిం సంతుష్టీకరణ విధానం వేసిన బీజం 1947లో దేశ విభజనకు దారి తీసిలా చేసింది. దేశ విభజనకు ముఖ్య కారకులు బ్రిటిష్ ప్రభుత్వం, ముస్లిం లీగ్, కాంగ్రెస్.
ఏదైనా ముఖ్య విషయాలకు, సంఘటనలకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటారు. దురదృష్టం కొద్దీ 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీలో ముఖ్య ప్రతిపక్ష నేతలతో సహా యావత్ దేశభక్తులను జైళ్లలో పెట్టడంతో నవంబర్ 7, 1975న వందేమాతరం శతాబ్ది ఉత్సవాలు జరపుకోలేని దుస్థితిలో దేశం ఉండిపోయింది. తదనంతరం దేశ రాజకీయాల్లో వచ్చిన పెను మార్పులతో, జనసంఘ్ నుంచి బిజెపిగా రూపాంతంరం చెంది, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మారింది. ఈ శతాబ్దం ఆరంభంలోనే వాజ్ పేయి నేతృత్వంతో 6 సంవత్సరాలు అధికారంలో ఉండి కొన్ని మౌలిక మార్పులు తీసుకొచ్చారు. తదనంతరం ఒక దశాబ్ద కాలం దేశద్రోహ కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలు, మహిళల భద్రత అత్యంత ఘోరంగా దిగజారింది. గుజరాత్ లో 12 ఏళ్ల సమర్థ పాలనతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన మోదీ ప్రధాని అభ్యర్థిగా బిజెపికి లభించడంతో దేశ రాజకీయాల్లో, దేశభక్త, ఐక్యతా యుగం పునరుజ్జీవం పొందింది. 5 శతాబ్దాల రామజన్మభూమి ఉద్యమానికి పరిష్కారం దొరికి, యావత్ దేశ ప్రజలు గర్వించే విధంగా అద్భుత రామాలయ నిర్మాణం జరిగింది. దేశ ఐక్యతకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు లాంటి నిర్ణయాలతో పటిష్ట అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచం గర్వించే స్థాయికి చేరి, దేశం, ధర్మం గురించి ఆలోచనలు దేశ ప్రజల్లో ప్రజ్వరిల్లాయి.
ఈ నవంబర్ 7తో వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తికావడంతో ఒక సంవత్సరం పాటు వందేమాతరం గీతం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పార్లమెంటులో డిసెంబర్ 7, 8 తేదీల్లో జరిగిన సమగ్ర చర్చలో ఎన్డీఏ పక్షం దేశం కోసం, భారతీయ సంస్కృతి కోసం మాట్లాడితే, విపక్ష కాంగ్రెస్ తదితర పార్టీలు నీచ నికృష్ట ఓటుబ్యాంకు రాజకీయాలను ప్రదర్శించాయి. ఈ చర్చలో పాల్గొన్న మోదీ, ఇతర బిజెపి సభ్యులు వందేమాతరం గీతానికి నెహ్రూ చేసిన ద్రోహాన్ని సవివరంగా తెలిపారు. చాలామంది భారతీయులకు మొన్నటి వరకు వందేమాతరం గీతంలో ఇన్ని చరణాలు ఉన్నాయని, ఇందులో ముఖ్య భాగం ఖండింతమైందని తెలియదంటే కాంగ్రెస్ ఏవిధంగా దగా చేస్తూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా సంపూర్ణ వందేమాతరం గీతం వింటోన్న, ఆలపిస్తోన్న ఆర్ఎస్ఎస్, వాటి అనుబంధ సంస్థల్లో పనిచేసే కార్యకర్తలకు ఈ ఉత్సవాలు ఆనందాన్ని పంచుతున్నాయి. వందేమాతరం ఉత్సవాల సంవత్సరాన్ని దేశ ప్రజలు, సంతోషంగా, గర్వంగా జరుపుకోవాలని బిజెపి భావిస్తోంది. ఈ వందేమాతరం దేశభక్త గీతం మాత్రమే కాదు, జాతి ఐక్యతా మంత్రం అని మోదీ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఇతంటి గొప్పదైన వందేమాతరం గీతాన్ని, భారతదేశాన్ని ముక్కలు చేసిన దేశద్రోహ సంస్థగా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.

