నేను కార్యకర్తను, నా బాస్ నితిన్ నబీన్! : మోదీ
మూడుసార్లు దేశ ప్రధాని కావడం కన్నా, 50 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమంత్రి అవడం కన్నా, 25 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉండడం కన్నా కూడా బిజెపి కార్యకర్త కావడమే నాకు అన్నింటి కన్నా గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్టీలో తాను ఒక కార్యకర్త అని, నితిన్ నబీన్ తన బాస్ అని స్పష్టం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ గౌరవార్థం జనవరి 20న పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. నితిన్ నబీన్‌కు పూలమాలలు వేసి మోదీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. ”ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బిజెపి రాజ్యాంగం స్ఫూర్తిని, అందులో పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలోని ఒక చిన్న యూనిట్ నుండి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక వరకు వంద శాతం ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగింది. ఈ ఎన్నిక బిజెపిలోని ప్రజాస్వామ్య విశ్వాసాలకు, సంస్థాగత క్రమశిక్షణ, కార్యకర్త కేంద్రీకృత ఆలోచనకు నిదర్శనం. ఈ ప్రక్రియను విజయవంతం చేసిన దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను అభినందిస్తున్నాను.
గత ఒకటిన్నర సంవత్సరాలుగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ జీ శత జయంతిని, సంఘ్ 100వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇవి దేశం కోసం జీవించాలనే సంకల్పాన్ని బలోపేతం చేసే ప్రేరణలు. మన నాయకత్వం సంప్రదాయంపై నడుస్తుంది, అనుభవంతో సుసంపన్నమైంది, దేశానికి సేవ చేసే స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అని, మూడోసారి ప్రధాని అయ్యారని, 50 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన 25 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉన్నారని, ప్రజలు అనుకుంటారు. కానీ నా జీవితంలో అతిపెద్ద విషయం నేను బిజెపి కార్యకర్త కావడం. ఇది నాకు అన్నింటి కన్నా గర్వకారణం. పార్టీ విషయానికి వస్తే, నేను ఒక కార్యకర్త, నితిన్ నబీన్ నా బాస్!
బిజెపి ఒక సంస్కృతి, ఒక కుటుంబం. మనకు అధ్యక్షులు మారతారు, కానీ ఆదర్శాలు మారవు. నాయకత్వం మారుతుంది, కానీ దిశ మారదు. మనకు – మన కంటే పార్టీనే ప్రాధాన్యం, పార్టీ కంటే దేశమే ప్రాధాన్యం. ఇది ప్రతి బిజెపి కార్యకర్త సంస్కృతి, జీవిత మంత్రం. ఈ స్ఫూర్తితో మనం గత 11 సంవత్సరాలలో అనేక సవాళ్లను అధిగమించాం. జమ్ము, కశ్మీర్ లో ఆర్టికల్ 370 గోడను కూల్చివేయాలన్నా, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించాలన్నా.. ఒకప్పుడు అసాధ్యంగా భావించే వారు, నేడు అవి వాస్తవం అయ్యాయి.
నితిన్ నబీన్ మన అధ్యక్షుడు, బిజెపిని నడిపించడమే కాదు, ఎన్డీయేతో సమన్వయం చేసుకునే బాధ్యత కూడా చూసుకోవాలి. బిజెపి యువ మోర్చా బాధ్యత అయినా, రాష్ట్ర ఇంచార్జి అయినా, నితిన్ తాను చేపట్టిన బాధ్యతను నెరవేర్చారు. ఇది 21వ శతాబ్దం, మొదటి 25 సంవత్సరాలు వేగంగా పూర్తయ్యాయి, రాబోయే 25 సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాల్సిన కాలం ఇది. ఈ కాలం ప్రారంభంలో బిజెపి వారసత్వాన్ని నితిన్ ముందుకు తీసుకెళ్తారు. నేటి యువత భాషలో నితిన్ మిలీనియల్. అతను చిన్నతనంలో రేడియో నుండి సమాచారం పొందిన తరానికి చెందినవాడు, ఈ రోజు అతను ఏఐతో కూడా పని చేస్తున్నాడు. ఇది మన పార్టీలోని ప్రతి కార్యకర్తకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
జనసంఘ్ ఏర్పడి ఈ సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తయింది. భారతదేశం తన నరనరాల్లో ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్న దేశం అని ప్రపంచానికి చెప్పాలి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఉంది. బిజెపికి జాతీయ స్వభావం, జాతీయ స్ఫూర్తి ఉంది. మన మూలాలు లోతుగా ఉన్నాయి. 1984లో కాంగ్రెస్‌కు 400కు పైగా సీట్లు వచ్చాయి, కానీ నేడు 100 సీట్ల కోసం తహతహలాడుతోంది. కాంగ్రెస్ తన పతనాన్ని ఎప్పుడూ సమీక్షించదు, పతనానికి గల కారణాలను విశ్లేషిస్తే కాంగ్రెస్‌ను ఆక్రమించిన ఆ కుటుంబంపై ప్రశ్నలు వస్తాయి. పతనానికి అసలైన కారణం కనుగొనే ధైర్యం కూడా వారు చేయలేరు.
గత ఒకటిన్నర, రెండేళ్లలో బిజెపిపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడింది. అసెంబ్లీ అయినా, స్థానిక సంస్థ అయినా, బిజెపి స్ట్రైక్ రేట్ అపూర్వం. ఈ సమయంలో దేశంలోని 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వాటిలో 4 ఎన్నికల్లో బిజెపి-ఎన్డీయే విజయం సాధించాయి. పార్లమెంట్, శాసనసభల్లోనే కాకుండా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బిజెపి ప్రజలకు మొదటి ఎంపికగా ఉంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల్లో బిజెపి నంబర్ వన్ పార్టీగా అవతరించింది. మొత్తం 29 నగరాల్లో 25 పెద్ద నగరాల ప్రజలు బిజెపి-ఎన్డీయేను ఎన్నుకున్నారు. గెలిచిన మొత్తం కౌన్సిలర్లలో 50 శాతం మంది బిజెపి వాళ్లే. కేరళలో బిజెపికి 100 మంది కౌన్సిలర్లు ఉన్నారు. తిరువనంతపురం ప్రజలు 45 ఏళ్ల తర్వాత మేయర్ ఎన్నికల్లో వామపక్షాల నుంచి అధికారాన్ని బిజెపికి అప్పగించారు.
ప్రస్తుతం దేశం ముందున్న అతి పెద్ద సవాలు చొరబాటుదారులే. ప్రపంచంలోని దేశాలు తమ దేశంలో చొరబాటుదారులపై దర్యాప్తు చేసి వారిని పట్టుకుని బహిష్కరిస్తున్నాయి. భారతదేశం కూడా చొరబాటుదారులు పేదలు, యువత హక్కులను దోచుకోవడానికి అనుమతించదు. చొరబాటుదారులు దేశ భద్రతకు పెద్ద ముప్పు, వారిని గుర్తించి వారి దేశానికి తిరిగి పంపడం చాలా ముఖ్యం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను కాపాడుతున్న రాజకీయ పార్టీలను ప్రజల ముందు బహిర్గతం చేయాలి. మరో ప్రధాన సవాలు అర్బన్ నక్సల్స్. అర్బన్ నక్సల్స్ పరిధి అంతర్జాతీయంగా మారుతోంది. వాటిని కూడా తొలగించాలి.
బంధుప్రీతి దేశానికి పెద్ద శాపం. కాంగ్రెస్‌లో ఒకరి తర్వాత మరొకరు వారి కుటుంబ సభ్యులు మాత్రమే అధ్యక్షులు అవుతారు. వారికి పార్టీ కార్యకర్తలతో సంబంధం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. బంధుప్రీతి రాజకీయాలు దేశ యువత రాజకీయాల్లోకి రావడానికి దారులు మూస్తాయి. అందుకే లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన క్షణం. మన జాతీయ అధ్యక్షుడు మనందరికీ మార్గనిర్దేశం చేయబోతున్నారు, ఆయన ప్రతి మాట మనకు ముందుకు వెళ్లే మార్గం. వారి మార్గదర్శకత్వం మన మూలధనం.” అని అన్నారు.

