నేటి రాజకీయాలు వాజ్‌పేయి ఆదర్శాలకు విరుద్ధం
భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా, ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించిన తీరు నేటికీ ఆదర్శమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. దురదృష్టవశాత్తు నేడు తెలంగాణలో చట్టసభల పరిస్థితి ఆ స్థాయికి ఎంతో దూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీల్లో బూతులు, విద్వేషకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు కూడా బూతులు నేర్చుకునేలా పరిస్థితులు తయారయ్యాయని, కుటుంబంతో కలిసి టీవీ చూడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటువంటి పరిణామాలు అటల్ జీ చూపిన రాజకీయ ఆదర్శాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. మార్చి 1న ఖమ్మంలో అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన “అటల్ జీకి అక్షర నీరాజనం” కార్యక్రమంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణ, అప్పాల ప్రసాద్, దేవకి వాసుదేవ రావు, కోటేశ్వశ్వర్ రావు, కామినేని శ్రీనివాస్, కొడపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ”అటల్ జీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక కవి, ఒక వక్త, ఒక సంస్కారవంతమైన ప్రజాస్వామ్య నాయకుడు. ఆయన వ్యక్తిత్వం, ఆలోచనలు, మాటలు.. అన్నీ యువతను, దేశ ప్రజలను ప్రభావితం చేశాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి వల్ల ప్రభావితమై దేశ రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. సమాజం కోసం, దేశం కోసం పని చేయాలనే ఆలోచనతో అనేక మంది యువత రాజకీయాల్లోకి రావడానికి ఆయన ఒక ప్రేరణగా నిలిచారు. ఆయన వాగ్ధాటి, ప్రసంగ శైలి ఆనాడు అనేక మంది యువతను గొప్పగా ప్రభావితం చేసింది. ఆ రోజుల్లో అటల్ జీ ప్రసంగం దూరదర్శన్‌లో లైవ్‌గా వస్తే దేశమంతా ఎంతో ఆసక్తిగా చూసేది. ఆయన మాట్లాడితే దేశం మొత్తం వినేది. ప్రజలంతా ఆయనను ఆదరించారు, విశ్వసించారు, అందుకే ఆయన దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
వెంకయ్య నాయుడు వంటి నాయకులు గొప్ప పార్లమెంటరీ నాయకులుగా గుర్తింపు పొందారంటే, దానికి మూలకారణం అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి నాయకుల స్ఫూర్తే. నేను ఎమ్మెల్సీగా అయినప్పుడు వారి వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు అన్‌పార్లమెంటరీ భాష వాడొద్దని, ఎవరినీ వ్యక్తిగతంగా దూషించేలా మాట్లాడొద్దని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే విమర్శలు చేయాలని సూచించారు. అవి నాకు మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి. ఆనాడు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో వివరించేందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయినే పంపించారు. ఇది అటల్ జీపై దేశానికి ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనం. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం ఆలోచించే నాయకుడు అటల్ జీ అని ఇది స్పష్టంగా చూపిస్తుంది.
నేను ఏబీవీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, యువమోర్చాలో పనిచేసినప్పుడు అటల్ జీ నుంచి అపారమైన స్ఫూర్తి పొందాను. అప్పట్లో ప్రజల్లో “బిజెపి అంటే వాజ్‌పేయి గారి పార్టీ” అనే భావన బలంగా ఉండేది. వాజ్ పేయి రాసిన పుస్తకాలు, రచనలు, చేసిన ప్రసంగాలు నాలో రాజకీయ అవగాహనను పెంచాయి. ఆయన ఒక గజల్ గాయకుడు కూడా. విమర్శ చేయాల్సిన సందర్భంలో కూడా నవ్వుతూ, సంస్కారంతో విమర్శించడం ఆయన ప్రత్యేకత. ఈరోజు తెలంగాణలో బూతుల సంస్కృతి పోయి, ప్రజాస్వామ్యయుత రాజకీయాలు కొనసాగాలని గట్టిగా కోరుకుంటున్నాను. విమర్శలు తప్పు కాదు, కానీ అవి ప్రజాస్వామ్య పరిమితుల్లో ఉండాలి. ఏ పార్టీకి చెందిన నాయకుడైనా అటల్ బిహారీ వాజ్‌పేయి అడుగుజాడల్లో నడిచేలా తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తే, అదే దేశానికి, ప్రజాస్వామ్యానికి నిజమైన సేవ అవుతుంది.” అని అన్నారు.

