నిరంతరం ప్రజల కోసం తపించిన సుశీల్ కుమార్ మోదీ

సమకాలీన భారతదేశంలో చాలా తక్కువ మంది నాయకులు మాత్రమే పార్టీలకు అతీతంగా మద్దతు, అభిమానం, గౌరవ ప్రశంసలు పొందారు. భారత్ కు గుండెకాయ వంటి బీహార్ నుంచి వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ అటువంటి నాయకుల్లో ఒకరు. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్, ఆ తర్వాత ఏబీవీపీ సభ్యుడు అయిన మోదీ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం సృష్టించిన నేత. విద్యార్థి నాయకుడిగా ఎలా ఉండాలో నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగి, క్రియాశీల రాజకీయాల్లో తన పాత్రను నిర్వర్తించేందుకు బిజెపిలో చేరారు. మా రాష్ట్రం బీహార్ లో బిజెపిని ఒక బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో ఆయన నిర్వహించిన పాత్ర గురించి ఎప్పటికీ రాస్తూనే ఉంటాం, స్మరించుకుంటూనే ఉంటాం.
మిగతా నాయకులతో పోలిస్తే సుశీల్ కుమార్ విశిష్టత ఏమిటి? బీహార్‌లో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, సాధారణ బీహారీల స్వరాన్ని పార్లమెంటు, శాసనసభ, శాసన మండలిలో వినిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డారు. ఇది చేయాలంటే, బిజెపి ఒక బలమైన రాజకీయ శక్తిగా మారడం తప్పనిసరి అని ఆయన భావించారు. ఆయన జీవితం, పట్టుదల, విచక్షణ, బిజెపిని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే నిరంతర తపన…ఇవే ఆయన జీవిత పరమార్థాలు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా సుశీల్ కుమార్ పనిచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న తన పదవీకాలం ముగిసిన సందర్భంగా రాజ్యసభలో చేసిన తన చివరి ప్రసంగంలో తనకు నాలుగు ముఖ్యమైన చట్టసభల్లో తనకు అవకాశం కల్పించిన బిజెపికి తానూ ఎంతగా రుణపడి ఉన్నదీ వివరించారు. లోక్‌సభ, రాజ్యసభ, బీహార్ శాసనసభ, శాసనమండలిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆయన ప్రసంగంలో ఉద్వేగభరితమైన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి జీవితకాలమంతా రాజకీయ కార్యకర్తగా ఉండలేకపోయినా జీవితాంతం సామాజిక కార్యకర్తగా ఉండగలడని చెప్పడం. ఆ విధంగా, ఆయన తన జీవితంలో చివరి రోజు వరకు సామాజిక కార్యకర్తగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ ఎంపీలందరికీ ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ ప్రసంగం ప్రతులను ప్రభుత్వం పంపిణీ చేయాలని, ఎందుకంటే వారికి ప్రస్తుతం టీవీలో మాత్రమే ఈ ప్రసంగం అందుబాటులో ఉంటోందని ఆయన ఈ ప్రసంగంలో కోరారు. సభ్యులలో బడ్జెట్ పట్ల మరింత అవగాహన కలిగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది సుశీల్ కుమార్ మోదీ వ్యక్తిత్వం.
జీఎస్టీ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంలో అసాధారణమైన పటిమను, చాకచక్యాన్ని ప్రదర్శించారు. అది ఆయనకు విస్తృతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. జీఎస్టీ విషయంలో రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాయని అనేక చర్చలు, ఇంటర్వ్యూలలో ఆయన నొక్కి చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు, అమలులో సహకరించవచ్చు, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారాలను కనుగొనవచ్చు అన్నది ఆయన విధానం. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన సంతాప సందేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీని ఆమోదింపచేయడంలో సుశీల్ మోదీ పాత్రను ప్రస్తావించారు. ఏ అంశంలోనైనా లోతుగా అధ్యయనం చేసి బాగా సిద్ధమై ఉండేవారు. విషయాలపై వివరణాత్మక నోట్ లు తయారు చేసుకుని ఉంచుకునేవారు. ఇతరుల నుంచి నేర్చుకోవడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు.
అంతర్జాతీయ సంబంధాల పట్ల అతని అభినివేశం బలంగా ఉండేది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మయన్మార్‌కు వెళ్లిన ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహించారు. భారతదేశం, మయన్మార్ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంత ముఖ్యమైనవో, అలాగే తూర్పు దేశాలకు ప్రాముఖ్యం ఇచ్చే భారత్ విధానాన్ని విస్తరించడానికి గల పలు వినూత్న మార్గాల గురించి ఆయన మాట్లాడారు. ఆయన భారతదేశ పొరుగు ప్రాంతాలను ‘సహజ ఆర్థిక మండలి’గా అభివర్ణించారు. సుశీల్ మోదీ నుండి నేను నేర్చుకున్న అన్ని విషయాలలోకి ‘దేశం ముందు, పార్టీ తరువాత, వ్యక్తిగతం చివరిది’ అనే సూత్రం ఆచరణలో ఎలా ఉండాలనేది ప్రధానమైనది. ఆయన జీవితం గురించిన అవలోకనం నాలాంటి పార్టీ కార్యకర్తలు ప్రజలకు, దేశానికి కృతనిశ్చయంతో మరింత సేవ చేసేందుకు స్ఫూర్తినిస్తుంది.
సుశీల్ కుమార్ మోదీ మృతి
బిజెపి సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ (72) క్యాన్సర్‌తో బాధపడుతూ మే 13న రాత్రి దిల్లీ ఆసుపత్రిలో మృతిచెందారు. మే 14న పట్నాలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ‘సుశీల్ మోదీ అమర్‌రహే’ అన్న అభిమానుల నినాదాలతో శ్మశానవాటిక ప్రతిధ్వనించింది. కుమారులు ఉత్తర్‌కాశ్ మోదీ, అక్షయ్ మోదీ తండ్రి చితికి నిప్పంటించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, బిహార్ డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌధరి, విజయ్‌కుమార్ సిన్హా, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సుశీల్ కుమార్ మోదీ మృతిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతాపాన్ని ప్రకటిస్తూ ప్రజా జీవితంలో చిత్తశుద్ధి, పారదర్శకత గల నేతగా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఓ ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానన్నారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటుగా అభివర్ణించారు.
గురుప్రకాష్,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి

