పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చేలా కాంగ్రెస్ వ్యవహారం
భారత్, పాక్ యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి అంశంలో పాకిస్తాన్‌కు బుద్ధిచెప్పేందుకు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఆపాలని ఏ ప్రపంచ నేత కూడా భారత్‌ను అడగలేదని నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా ప్రకటించారు. మూడు దేశాలు తప్ప మొత్తం ప్రపంచ దేశాలన్నీ భారత్‌కే మద్దతు పలికాయని చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం.. ఎంతో పరాక్రమం చూపిన మన సైనికులకు మద్దతుగా నిలవకుండా. పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చేలా సందేహాలు వ్యక్తం చేశాయని మండిపడ్డారు. ‘ఆపరేషన్ సిందూర్’పై జూలై 29న లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెప్పారు. సుమారు రెండు గంటల పాటు ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించామని చెప్పడంతోపాటు కాంగ్రెస్‌పై విమర్శల తూటాలు ఎక్కుపెట్టారు. చివరగా పాకిస్తాన్‌కూ హెచ్చరికలు జారీ చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడారని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘మే 9న రాత్రి నాతో మాట్లాడేందుకు జేడీ వాన్స్ మూడు, నాలుగు సార్లు కాల్ చేశారు. సైనికాధికారులతో సమావేశాలతో బిజీగా ఉన్నాను. చివరికి కాల్ మాట్లాడాను. పాకిస్తాన్ భారీ దాడి చేయబోతోందని జేడీ వాన్స్ నన్ను హెచ్చరించారు. పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ అంతకు మించి బదులిస్తుందని.. వారు బుల్లెట్లు వాడితే మేం శతఘ్నులతో బదులిస్తామని ఆయనకు స్పష్టం చేశాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ఏ నేత కూడా భారత్‌ను అడగలేదు. ఐక్యరాజ్య సమితిలో కేవలం మూడు దేశాలు మాత్రమే పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడాయి. మిగతా అన్ని ప్రపంచ దేశాల నుంచి భారత్‌కే మద్దతు లభించింది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ మన దేశ సైనికులకు మద్దతుగా నిలవలేదు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని గుప్పించిన అవివేకమైన ఆరోపణలు.. సైన్యం నైతిక విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి’’ అని మోదీ మండిపడ్డారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఆయుధాలు, రక్షణ వ్యవస్థల్లో డొల్లతనం ఏమిటో, భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, క్షిపణుల ప్రతాపం ఏమిటో ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా కేవలం 22 నిమిషాల్లో పాకిస్తాన్ భూభాగంలో లోపలి ప్రాంతాల్లో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. మరునాడు భారత్‌పై దాడికి పాల్పడితే.. పాకిస్తాన్‌పై క్షిపణుల వర్షం కురిపించాం. భారత్ దాడులతో పాకిస్తాన్‌లోని ఎయిర్‌బేస్‌లు ఎంతగా దెబ్బతిన్నాయంటే.. ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. పాకిస్తాన్‌కు పరిస్థితి ఏమిటో అర్థమైపోయి.. అణ్వస్త్ర దాడులంటూ బెదిరింపులకు దిగింది. కానీ ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా.. ఆపరేషన్ సిందూర్ మొదలు సింధు నది (సింధు జలాల ఒప్పందం) వరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్‌కు తెలుసు. ఎలాంటి దాడి చేసినా మరింత భారీ స్థాయిలో ప్రతిదాడి ఉంటుందని అర్థమైంది. అందుకే ఏమీ చేయలేకుండా ఉండిపోయింది’’ అని మోదీ చెప్పారు. ‘చాలా దెబ్బతీశారు. ఇక చాలు (బహుత్ మారా. బస్ కరో)’ అంటూ పాకిస్తాన్ డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్) కాళ్లబేరానికి వచ్చారని పేర్కొన్నారు. ‘ఒకవేళ మీరు ఏమైనా చేయదలిస్తే.. ఫలితం చాలా దారుణంగా ఉంటుంది’ అని హెచ్చరించామని తెలిపారు. దేశంలో ఇంతకుముందూ ఉగ్రదాడులు జరిగాయని, ఏం చేసినా తమకేమీ కాదని వాటి సూత్రధారులు ధైర్యంగా ఉండేవారని.. కానీ ఇప్పుడు భారత్ వెంటాడుతుందని వారికి అర్థమైందని చెప్పారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి ప్రతినిధులుగా మారిపోయాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. భారత్ అన్ని అంశాల్లో స్వయం సమృద్ధి సాధిస్తే.. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ మీదే ఆధారపడిందని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ పాడిన పాటే కాంగ్రెస్ పాడుతుండటాన్ని, పాకిస్తాన్‌కు రిమోట్ కంట్రోల్‌లా మారిపోవడాన్ని చూసి దేశమంతా విస్తుపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతున్న సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చూసీచూడనట్టు వదిలేసిందని.. ఉగ్రవాద నిరోధక చట్టాలను నిర్వీర్యం చేసిందని మోదీ ఆరోపించారు. గాంధీ కుటుంబం ఒత్తిడితో పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడవద్దని కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇక కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, మనీశ్ తివారీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాలకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లిన బృందాల్లోని కొందరు నేతలు పార్లమెంటులో మాట్లాడకుండా కాంగ్రెస్ నిలువరించిందని విమర్శించారు.
పహల్గాం ఘటన మన దేశంలో అల్లర్లు రేపేందుకు జరిగిన కుట్ర అని, దాన్ని మన దేశ ఐక్యత విఫలం చేసిందని మోదీ చెప్పారు. ఉగ్రవాదుల ప్రధాన స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేశామని, అందుకే ఈ పార్లమెంటు సమావేశాలను విజయోత్సవాలని చెబుతున్నానని తెలిపారు. ‘‘నేను భారత్ తరఫున నిలబడి ఉన్నాను. దీనిని అర్థం చేసుకోలేని వారికి వారి ముఖం చూసుకునేలా అద్దాన్ని చూపడానికి నిలబడ్డాను. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి ఊహించలేని రీతిలో బుద్ధి చెబుతామని నేను ముందే చెప్పాను. మన సైనికదళాల సామర్థ్యంపై పూర్తి నమ్మకం పెట్టుకున్నాం. దీటుగా స్పందించేలా స్వేచ్ఛను ఇచ్చాం. మనవాళ్లు ఇచ్చిన సమాధానం చూసి.. ఉగ్రవాదులు, వారి వెనుకున్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు..’’ అని ప్రధాని పేర్కొన్నారు.
పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పార్లమెంటు సమావేశాల సమయంలోనే హతం చేయడం ఏమిటంటూ కాంగ్రెస్, ఇతర పక్షాలు చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘‘అసలు వాళ్లకు ఏమైంది? బాగా నిరాశ చెందినట్టున్నారు. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఏమయ్యారని వారే అడిగారు. మోదీ ఓడిపోయాడంటూ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మేం ఉగ్రవాదులను హతం చేస్తే ఏడుస్తున్నారు. ఉగ్రవాదులను అంతం చేయడానికి తేదీలు చూడాలా? ఈ తీరును చూసి దేశమంతా నవ్వుతోంది’’ అని పేర్కొన్నారు. ఆక్రమిత కశ్మీర్‌ను వెనక్కి తీసుకురావడం లేదేమని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని.. అసలు దేశ విభజనకు అంగీకరించినదెవరని, కశ్మీర్‌ను ఆక్రమించుకునే అవకాశం ఎవరిచ్చారని మోదీ ప్రశ్నించారు. పాక్‌తో సింధూ నది ఒప్పందం ఎవరు చేసుకున్నారని నిలదీశారు. నది మనది, నీళ్లు పాకిస్తాన్‌కు అనేలా చేశారని, నాటి తప్పులకు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు సింధు ఒప్పందం నిలిపివేత వంటి చర్యలతో వాటిని సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు.

