Modi

ప్రజా జీవితంలో 23 వసంతాలు పూర్తిచేసుకున్న మోదీ

Modi at 23ముఖ్యమంత్రిగా గాని, ప్రధానమంత్రిగా గాని నరేంద్ర మోదీ అక్టోబర్ 7 నాటికి ప్రభుత్వ అధినేతగా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పదవిలో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ప్రధానమంత్రిగా రెండు పదవీకాలాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో పదవీకాలాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రిగా ఆయన ప్రారంభించిన అనేక జాతీయ పథకాలకు, కార్యక్రమాలకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే పునాదులు పడ్డాయి. ఆర్థిక సంస్కరణల నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఆయన ‘గుజరాత్ నమూనా’ ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా అమలైన పలు కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచింది. భారత ప్రధానమంత్రిగా మోదీ అభివృద్ధి (వికాస్) మీద దృష్టి కేంద్రీకరిస్తూనే వారసత్వాన్ని (విరాసత్) పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు.

జాతీయ కార్యక్రమాలకు ఆదర్శం గుజరాత్ నమూనా

సుజలాం సుఫలాం, జల అభియాన్ కింద జల వనరుల పరిరక్షణ, జ్యోతి గ్రామ్ యోజన ద్వారా అందరికీ విద్యుత్తు సరఫరా, నిర్మల్ గుజరాత్ ద్వారా పారిశుద్ధ్యం మెరుగుదల వంటి కార్యక్రమాలను మోదీ నాయకత్వంలో గుజరాత్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ఆ తర్వాత జాతీయ స్థాయిలో విస్తరించి జల్ జీవన్ మిషన్, సౌభాగ్య పథకం, స్వచ్ఛభారత్ మిషన్ రూపంలో అమలు జరుగుతున్నాయి.

ప్రజా భాగస్వామ్యం, ప్రజానుకూల పాలన

మోదీ భావజాలంలో ఒక ముఖ్యమైన అంశం ప్రజల భాగస్వామ్యం. ఇదే ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంగా రూపాంతరం చెందింది. అంటే సమ్మిళిత అభివృద్ధికి సమష్టి కృషి. సమాజంలో అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూ వారి జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో ఈ నమూనా పట్ల మోదీ ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది.

అభివృద్ధి, వారసత్వాల మధ్య సమతౌల్యం

మోదీ పాలన ఆధునీకరణకు ప్రాధాన్యమిస్తూనే సాంస్కృతిక పరిరక్షణకు కృషి చేస్తోంది. కాశీ విశ్వనాథ కారిడార్, రామ్ మందిర్ నిర్మాణం, విదేశాల నుంచి 640కు పైగా పురాతన వస్తువులను వెనక్కి రప్పించడం, అభివృద్ధిని, వారసత్వ పరిరక్షణను మేళవించాలన్న మోదీ ప్రభుత్వ విధానానికి నిదర్శనాలు.

ఇంటింటికి నీరు: జలజీవన్ మిషన్

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పాలన స్ఫూర్తితో అమలు జరిగిన ఒక కీలకమైన కార్యక్రమం జల్ జీవన్ మిషన్. గుజరాత్ లో అమలు చేసిన సుజలాం, సుఫలాం జల్ అభియాన్ విజయం స్ఫూర్తితో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2024 ఆగస్టు నాటికి ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల గ్రామీణ కుటుంబాలకు నీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం ప్రజలకు మౌలికమైన నీటి వసతి కల్పించడంతోపాటు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు అడ్డకట్ట వేసి ప్రజారోగ్యానికి కూడా విశేషంగా తోడ్పడింది.

అందరికీ విద్యుత్ వెలుగులు: సౌభాగ్య పథకం

గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి 24 గంటలు విద్యుత్ సదుపాయం కల్పించాలని మోదీ నిర్ణయించారు. ఆ రాష్ట్రంలో దాన్ని విజయవంతంగా అమలు చేశారు. ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని సౌభాగ్య పథకం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 2.86 కోట్ల కుటుంబాల్లో విద్యుత్ వెలుగులు నింపి కోట్ల మంది ప్రజల జీవన నాణ్యతను గణనీయంగా పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ పంపుసెట్ల వినియోగాన్ని తగ్గించి కాలుష్య ఇంధన వినియోగాన్ని తగ్గించింది.

ఆకలిపై పోరాటం: పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన

కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోట్ల మంది పేదలకు జీవనాధారంగా మారింది. దాని మూలాలు గుజరాత్ లోని గరీబ్ కళ్యాణ్ మేలాలో ఉన్నాయి. ఈ పథకం కింద అక్కడ అల్పాదాయ వర్గాల కుటుంబాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేసేవారు. ఈనాడు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 80 కోట్ల మందికి పైగా లబ్ధిదారుల ఆకలి తీరుస్తూ దేశంలో ఆహార భద్రతకు విశేషంగా దోహదం చేస్తోంది.

స్వచ్ఛ భారత్ మిషన్: పారిశుధ్యంలో పరివర్తన

నరేంద్ర మోదీ నిర్మల్ గుజరాత్ కార్యక్రమం 2014లో ప్రారంభించిన స్వచ్ఛభారత మిషన్ కు స్ఫూర్తి. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పారిశుధ్యం ముఖచిత్రాన్నే మార్చివేసింది. దేశవ్యాప్తంగా గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి. ఇంటింటికీ మరుగుదొడ్డి సౌకర్యం కల్పించడం ద్వారా మహిళలు, బాలికల ఆత్మగౌరవాన్ని కాపాడారు. దీని ఫలితంగా ప్రజారోగ్యం మెరుగుపడింది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు తగ్గడంతో ఏటా వేల సంఖ్యలో శిశు మరణాల నివారణ జరిగింది.

మహిళలు, రైతుల సాధికారత

నమో డ్రోన్ దీదీ, పీఎం సమ్మాన్ నిధి మహిళలను, రైతుల సాధికారతకు నరేంద్ర మోదీ చేపట్టిన చర్యల్లో కొన్ని. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన ‘కృషి మహోత్సవం’ ‘మిషన్ మంగళం’ ఆధారంగా మోదీ డ్రోన్ దీదీ, పీఎం సమ్మాన్ నిధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు అధునాతన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించి మహిళా వ్యాపారులకు సూక్ష్మ రుణాల రూపంలో మద్దతు అందించి స్టాండప్ ఇండియా వంటి జాతీయ స్థాయి కార్యక్రమాలకు అవసరమైన క్షేత్రస్థాయి వ్యవస్థలను నిర్మించాయి.

‘సుస్థిర అభివృద్ధి’ శక్తిగా భారత్

సుస్థిర అభివృద్ధి రంగంలో మోదీ భారత్ ను ఒక కీలకమైన శక్తిగా అంతర్జాతీయ వేదికలపై నిలిపారు. వాతావరణ మార్పు నివారణపై జరిగిన కాప్-26 అంతర్జాతీయ సదస్సులో ఆయన ‘లైఫ్’ (పర్యావరణ కోసం జీవన విధానం) ఉద్యమాన్ని ప్రారంభించారు. సమాజాలు పర్యావరణ హిత జీవన విధానాలను అనుసరించి వాతావరణ మార్పులను నిరోధించాలని ఆయన పిలుపునిచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భారత్ కీలక పాత్ర వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ పట్ల భారత్ నిబద్ధతను ఈ చర్యలు వెల్లడిస్తున్నాయి.

వికసిత్ భారత్

భారత్ ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది మోదీ దార్శనికత. అప్పటికి భారత స్వాతంత్రం సంపాదించి వందేళ్లు పూర్తవుతాయి. ఆయన వికసిత భారత్ దార్శనికతలో మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్థానాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలు భాగంగా ఉంటాయి. భారత్ పురోగమిస్తున్న తరుణంలో, అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు ముందుకు సాగుతున్న సమయంలో నిరంతర సంస్కరణలు, ఆవిష్కరణలు, సమ్మిళిత పరిపాలన ఆవశ్యకం. వాటికి నరేంద్ర మోదీకి మించిన భరోసా మరొకటి లేదు.

వికసిత్ భారత్ ను సాధించే వరకు విశ్రాంతి లేదు

సమష్టి లక్ష్యమైన వికసిత్‌ భారత్‌ను సాధించే వరకూ విశ్రమించబోనని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. “ఇందుకోసం అలుపు లేకుండా పని చేస్తాను. మరింత బలంతో ముందుకు సాగుతాను’ అని అధికార పదవుల్లో 23 ఇళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్టులు పెట్టారు.

‘నేను ప్రభుత్వాధినేతగా 23 ఏళ్లు పూర్తి చేసుకోవడానికి శుభాశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 2001 అక్టోబరు 7వ తేదీన నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. నాలాంటి కార్యకర్తకు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను అప్పగించడం మా పార్టీ బిజెపి గొప్పదనం. నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి గుజరాత్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. కచ్‌ భూకంపం, సూపర్‌ సైక్లోన్, కరవు, దశాబ్దాల కాంగ్రెస్‌ లూటీ పాలన, మతతత్వం, కులతత్వం వంటి సమస్యలున్నాయి. వాటన్నింటినీ అధిగమించి జనశక్తితో గుజరాత్‌ను పునర్నిర్మించాం. అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేర్చాం. గుజరాత్‌లో సంప్రదాయేతర రంగమైన వ్యవసాయంలోనూ విజయం సాధించాం. నా 13ఏళ్ల పాలనలో గుజరాత్‌ సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌కు ఉదాహరణగా నిలిచింది’ అని ప్రధాని పేర్కొన్నారు.

‘2014లో దేశ ప్రజలు బిజెపిని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి నన్ను ప్రధానిని చేశారు. 30ఏళ్లలో పూర్తి మెజారిటీ సాధించడం చరిత్రాత్మకం. గత దశాబ్ద కాలంలో దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను పరిష్కరించాం. 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించాం. ప్రపంచంలో భారత్‌ ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన విజయాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

నాగార్జున