ప్రజాభీష్టం మేరకే ఉపాధి హామీ చట్టంలో మార్పులు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) గా మార్చడాన్ని కేంద్ర న్యాయ, శాసన వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సమర్థించారు. ఈ మార్పు ఏకపక్షంగా జరిగింది కాదని, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కోర్టులను 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకురావడం, నూతన ఉపాధి హామీ చట్టంపై కాంగ్రెస్ వ్యతిరేకత, ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయ వాతావరణం వంటి పలు అంశాలపై మాట్లాడారు.
ప్ర: న్యాయస్థానాలు రోజంతా (24×7) అందుబాటులో ఉంటాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల పేర్కొన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: ప్రజాస్వామ్యానికి శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ అనే మూడు స్తంభాలు ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థలు తమ ప్రాథమిక విధులను అత్యంత సున్నితత్వంతో నిర్వహించాలి. పనివేళల తర్వాత కూడా కోర్టులు తెరిచి ఉంచడం అనేది ఒక మంచి సంకేతం. దీనివల్ల పౌరులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది, జీవన సౌలభ్యం పెరుగుతుంది. దేశం ‘వికసిత్ భారత్’ దిశగా పయనించడానికి ఇది దోహదపడుతుంది.
ప్ర: కొత్తగా వచ్చిన ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ చట్టాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
జ: ఉపాధి హామీ పథకంపై అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ కాంగ్రెస్ వారు ఎంతమంది క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారో నాకు తెలియదు. మేమైతే ఈ చట్టంలో మార్పుల కోసం ప్రజల నుంచి అభిప్రాయలు తీసుకున్నాం. నా సొంత నియోజకవర్గమైన బికనీర్‌లో కూడా ప్రజలు అనేక మార్పులను కోరారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు ప్రస్తావించారు. అందుకే కొత్త ‘జీ రామ్ జీ’ బిల్లులో మేం తగిన మార్పులు చేశాం. వర్షాకాలంలో గ్రామాల్లోని ఇరుకైన వీధుల్లో నీరు నిలిచిపోతుంది. దీనిని పరిష్కరించే వ్యవస్థను తీసుకురావడం వల్ల నీటి సంరక్షణ జరగడమే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ఇక పేరు మార్పు విషయానికి వస్తే.. ఈ పథకం మొదట ‘జవహర్ రోజ్‌గార్ యోజన’గా ఉండేది, ఆ తర్వాత ‘NREGA’గా, ఆపై ‘MGNREGA’గా మారింది. పరిస్థితులకు అనుగుణంగా పథకాల పేర్లు మారుతుంటాయి, గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఇలాగే జరిగింది. ఈ కొత్త చట్టంతో గ్రామీణ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు భృతి లభిస్తుంది. అవినీతి అంతమవుతుంది. అంతేకాకుండా పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచారు. వ్యవసాయ సీజన్‌లో తగినంతమంది కూలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. కాలక్రమేణా ఈ పథకం మరింత మెరుగుపడుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని స్వాగతించాలి.
ప్ర: ఈ కొత్త చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై మీరేమంటారు?
జ: ఉపాధి హామీపై వారి వైఖరిని అర్థం చేసుకోవడం కష్టం. ప్రజల ప్రయోజనం కోసం, వారి అభిప్రాయాల ఆధారంగానే ఈ సవరణలు జరిగాయి. ఇది అందరి మేలు కోసమే.
ప్ర: వక్ఫ్ సవరణ చట్టాన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వారు దీని అమలును అడ్డుకోగలరా?
జ: వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. ప్రతిపక్షాల నిరసనలకు చట్టబద్ధత లేదు. పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించిన తర్వాత అది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది.
ప్ర: రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై పలుమార్లు దేశాన్ని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఇలా చేయడం సమంజసమేనా?
జ: గత మూడునాలుగేళ్ళుగా ఆయన తీరును పరిశీలిస్తే ఆయన విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశాన్ని విమర్శిస్తుంటారు. అక్కడి విద్యార్థులు, ప్రోఫెసర్లతో కలిసి ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థలపై ఫిర్యాదులు చేస్తుంటారు. విదేశాల్లో మన దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ఆయన స్థాయికి తగదు. ఇటీవల ఆయన ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) పై ఆందోళన వ్యక్తం చేస్తూ బీహార్‌లో దాన్ని ఎన్నికల అంశంగా మార్చారు, కానీ అక్కడ ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికైనా ఆయన అర్థం చేసుకోకపోతే అది ఆయన ఇష్టం.
ప్ర: తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం విఫలమైందా? ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
జ: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. సుపరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయింది. అభివృద్ధి పరంగా చేసింది శూన్యం. అంతా వారసత్వ రాజకీయం నడుస్తోంది. తమిళనాడు ప్రజలు ఈసారి డీఎంకేకు సరైన బుద్ధి చెబుతారు.
ప్ర: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందా?
జ: కచ్చితంగా. ప్రజలు వారికి (డీఎంకేకు) తగిన గుణపాఠం చెబుతారు.
ప్ర: ఇటీవల అమిత్ షా నిర్వహించిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. దీనిని ఎలా చూస్తారు?
జ: తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా హాజరయ్యారు. నేను, పియూష్ గోయల్ కూడా వెళ్ళాం. అది ఒక అద్భుతమైన ర్యాలీ.
ప్ర: 2020 అల్లర్ల నిందితులకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత కొందరు మోదీ, అమిత్ షా వ్యతిరేక నినాదాలు చేశారు. దీనిపై మీ స్పందన?
జ: అత్యున్నత న్యాయస్థానం తీర్పును నేను స్వాగతిస్తున్నాను. అయితే వారు చేసిన నినాదాలు అభ్యంతరకరం. ఇద్దరు నిందితులకు ముస్లింలు కాబట్టే బెయిల్ రాలేదని ప్రచారం చేసే వారు ఒక విషయం తెలుసుకోవాలి.. బెయిల్ పొందిన మిగిలిన ఐదుగురు కూడా ముస్లింలే. కోర్టు తీర్పుపై సంతృప్తి లేకపోతే చట్టపరమైన మార్గాలను అన్వేషించాలి తప్ప ఇలాంటి కథనాలను ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
ప్ర: ఒక వర్గానికి చెందిన వారు కాబట్టే వారికి బెయిల్ రాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
జ: కాంగ్రెస్ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల మీదనే బతుకుతోంది. ఆ సంతుష్టీకరణే వారి విధానంగా మారిపోయింది.

