Nitin Gadkari

రానున్న మూడేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టుల నిర్మాణం

Gadkari in Telanganaరానున్న మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్మించనున్నామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు. 2014 ముందు తెలంగాణలో మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే కనీసం 12 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు ఏ మూల నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా 4, 5 గంటల్లోనే చేరుకునేలా రోడ్లు నిర్మించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఒక రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా మే 5న నితిన్ గడ్కరీ పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో, బీహెచ్‌ఈఎల్‌ వద్ద పైవంతెనలను గడ్కరీ ప్రారంభించారు. హైదరాబాద్‌లో రూ.2,169 కోట్లు, కుమురం భీం జిల్లాలో రూ.3900 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కుమురం భీం జిల్లా రెబ్బెన మండలంలో కాగజ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు వద్ద, అంబర్‌పేట మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో గడ్కరీ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

ఆయా సభల్లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా దేశంలోని పేదలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ‘‘దేశానికి స్మార్ట్‌ నగరాలే కాదు, స్మార్ట్‌ విలేజ్‌లూ అవసరం. ఐటీ రంగానికి, ఉద్యోగవకాశాలకు హైదరాబాద్‌ కీలకం. హెలికాప్టర్‌లో వచ్చేటప్పుడు హైదరాబాద్‌ ఇరుకుగా అనిపించింది. మలేసియా సాంకేతికత, డబుల్‌ డెక్కర్‌ ప్లైఓవర్‌లతో స్థలం అవసరం తగ్గుతుంది. స్పెయిన్‌ తరహా విధానాలను అనుసరించాలి. ప్రయాణించేటప్పుడే వాహనాలు ఛార్జింగ్‌ అవ్వాలి. డీజిల్, పెట్రోలు వినియోగం తగ్గాలి. ఎలాంటి పరిస్థితులున్నా 8-10 నెలల్లో ఉప్పల్‌ పైవంతెనను పూర్తి చేస్తాం. పైవంతెనలను గడువుకంటే ముందు పూర్తి చేస్తే రూ.1 లక్ష బహుమతి, ఆలస్యమైతే రూ.1.5 లక్ష జరిమానా విధించే విధానాన్ని తీసుకొచ్చాం.

రూ.1.25లక్షల కోట్ల ప్రాజెక్టులు పూర్తి

2014లో తెలంగాణలో 2511 కి.మీ. మేర జాతీయ రహదారులు ఉండేవి. గత పదేళ్లలో 5 వేల కి.మీ.కు పెరిగాయి. ఇప్పటివరకు రూ.1.25లక్షల కోట్లతో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేశాం. ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లోని ఏ మారుమూల గ్రామం నుంచి అయినా హైదరాబాద్ వరకు రాకపోకలు ఇప్పుడు సులభతరం అయ్యాయి. తెలంగాణలోని జాతీయ రహదారులకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు పలు ప్రాజెక్టులు ఇప్పటికే రూపొందించాం. వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని పనులు జరుగుతున్నాయి. కొత్త గ్రీన్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్లనుంది. 770 కి.మీ. మేర ఈ ఇండోర్-హైదరాబాద్ కారిడార్ నిర్మిస్తున్నాం. తెలంగాణలో ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ కారిడార్ పనులు మొత్తం పూర్తికానున్నాయి. తెలంగాణలో కామారెడ్డి-మెదక్-సంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్ వరకు ఈ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఇండోర్ నుంచి హైదరాబాద్ కు కేవలం 10 గంటల్లోనే చేరుకోవచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ అడుగుతుండే వారు. సూరత్ నుంచి నాసిక్-అహ్మద్ నగర్, సోలాపూర్, కర్నూల్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి వరకు సులువుగా చేరుకునేలా కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ కలలు నిజం అవుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 1,100 కి.మీ. మేర కారిడార్‌ తెలంగాణ మీదుగా వెళ్తుంది. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు 221 కి.మీ. మేర రూ.8 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నాం. హైదరాబాద్-విశాఖపట్నం హైవేను తెలంగాణలో రూ.6,040 కోట్లతో 164 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం దాదాపు 60 కి.మీ. మేర తగ్గనుంది. ఆరు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు. 565 కి.మీ. మేర 16 వేల కోట్ల వ్యయంతో నాగ్‌పూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 30 శాతం పనులు పూర్తయ్యాయి. తెలంగాణలో 401 కి.మీ. మేర రూ.13,300 కోట్లతో ఆసిఫాబాద్-మంచిర్యాల-భూపాలపల్లి-హన్మకొండ-వరంగల్-ఖమ్మం మీదుగా ఈ కారిడార్ వెళ్లనుంది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు 175 కి.మీ. దూరం తగ్గుతుంది. దీంతో విజయవాడకు 6 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అనేక జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులతో తెలంగాణలో పర్యాటకం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను.

ఆరున్నర లక్షల గ్రామాలకు రోడ్లు

ముంబైలో మంత్రిగా ఉన్న సమయంలో వర్లీ-బాంద్రా సీలింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యే అదృష్టం నాకు దక్కింది. అప్పుడు నా వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. అదే సమయంలోనే అటల్ బిహారీ వాజ్ పేయి నన్ను పిలిచి.. గ్రామాలను అనుసంధానం చేసేందుకు పథకం తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు. దీంతో 6 నెలల పాటు కష్టపడి నివేదిక అందించాను. 15 రోజుల్లోనే ఎర్రకోట వేదికగా మా నివేదిక ఆధారంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను ప్రకటించారు. దేశంలోని ఆరున్నర లక్షల గ్రామాలకు గాను 6.4 లక్షల గ్రామాల్లో అద్భుతమైన రోడ్లు నిర్మించేందుకు ఈ పథకం నాంది పలికిన విషయం తెలిసిందే. అమెరికా ధనిక దేశం కాబట్టి అమెరికా రోడ్లు బాగోలేవు.. అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా ధనిక దేశం అయిందని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అనేవారు. అందుకే తెలంగాణలోని రోడ్లను మెరుగుపరిచి, ఇక్కడి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించి, వీరు సమృద్ధంగా తయారయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తోంది.

జల సంరక్షణతో గ్రామాలు సమృద్ధం

నా నియోజకవర్గంలో చాలా వరకు రైతుల సంక్షేమం కోసం పని చేస్తుంటాను. ఇప్పుడు రైతు అంటే కేవలం అన్నదాత మాత్రమే కాదు.. విద్యుత్ దాత, ఇంధన దాతగా, పవన విద్యుత్ దాత.. బిట్యుమిన్, హైడ్రోజన్ దాతలుగా మారారు. అలాంటి వారందరినీ పైకి తీసుకువచ్చేందుకు నా చేతనైన సాయం చేస్తుంటాను. విదర్భలో రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు మేం అమృత్ సరోవర్ కింద చెరువులను నిర్మించాం, పంటలకు నీటిని అందించాం. అలా మీరు కూడా తెలంగాణలో నీటిని నిల్వ చేసుకుని, రైతులకు, భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలని కోరుతున్నాను. చెరువులు, కుంటలు, డ్యాంలలో ఉచితంగా పూడిక తీసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. మహారాష్ట్రలోని వాసిం జిల్లా, గడ్చిరోలి జిల్లాలను దత్తత తీసుకున్నాను. ఆయా జిల్లాల్లో రైతులు, యువతకు అనేక రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో కూడా జల సంరక్షణ విషయంలో కృషి చేసి, రైతులకు మేలు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాను. జల సంరక్షణలో ముందుడుగు వేస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గి, గ్రామాలు సమృద్ధంగా, సంపన్నంగా తయారవుతాయి.’’ అని నితిన్ గడ్కరీ అన్నారు.

రోడ్లు ఉంటే ఉపాధి, అభివృద్ధి

జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడికెళ్లినా, తెలంగాణలో ఏ జిల్లాలోకి వెళ్లినా జాతీయ రహదారుల అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇది నరేంద్ర మోదీ నాయకత్వంలో, నితిన్ గడ్కరీ కృషితో సాధ్యమైందని కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో కేవలం 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులే ఉంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వల్ల అది 5,000 కిలోమీటర్లకు పైగా పెరిగిందని, ఇది రహదారుల విస్తరణలో ఒక రికార్డు అని పేర్కొన్నారు. ‘‘రోడ్లు ఉంటే రైతులకు వ్యయ నష్టం తగ్గుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కనెక్టివిటీ పెరగడం వలన సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మౌలిక వసతుల విషయంలో రహదారుల పాత్ర ఎంతో కీలకం. గత పదేళ్లలో మోదీ పాలనలో జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు అన్నీ అభివృద్ధి చెందాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా చెప్పాలంటే- బాంబే హైవే ఫ్లైఓవర్, ఆరంఘార్ ఫ్లైఓవర్, అంబర్ పేట్ ఫ్లైఓవర్ వంటి మల్టీలెవెల్ ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో అంబర్ పేట్ ఫ్లైఓవర్ కోసం ఎంతో కష్టపడి సాధించాం. ఫ్లైఓవర్ కింద సర్వీస్ రోడ్డుల కోసం 6 చోట్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని ఈ భూసేకరణను పూర్తిచేయాలని కోరుతున్నాం. ఇక అంబర్ పేట్ ప్రాంతంలో 21 ప్రభుత్వ పాఠశాలలు, 100కి పైగా కమ్యూనిటీ హాలులు నిర్మించాం. ఎన్టీఆర్ హయాంలో రోడ్డు విస్తరణలు మొదలైనప్పటికీ, కొన్ని స్థానిక ఇబ్బందుల వల్ల అవి నిలిచిపోయాయి. అంబర్ పేట్ ఫ్లైఓవర్‌కి సంబంధించి రెండు చోట్ల స్టీల్ బ్రిడ్జిల రూపంలో పరిష్కారం కనుగొన్నాం. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి ఎన్నో సమస్యలు ఎదురైనా, ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేశాం.

రోడ్, రైల్వే, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ

తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించారు. ఎక్స్‌ప్రెస్‌ వేలు, అండర్‌పాస్ ల నిర్మాణంతో రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేశారు. రహదారుల అభివృద్ధితో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి, చమురు వినియోగం తగ్గింది. రోడ్, రైల్వే, ఎయిర్, పోర్ట్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోంది. ఆదిలాబాద్, జహీరాబాద్‌లలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 7 మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకటి తెలంగాణకు కేటాయించారు. కాజీపేటలో రూ.800 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ మంజూరు చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.12,000 కోట్లతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. రూ.442 కోట్లతో రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రూ.6,332 కోట్ల వ్యయంతో రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించారు. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన పాత్ర వహించింది. రూ.31,220 కోట్లతో రైల్వే లైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టుల అమలు కొనసాగుతోంది. రూ.1,25,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, రూ.86,492 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి కేంద్రం ఆమోదం తెలిపింది.

 దేశవ్యాప్తంగా 83 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదే. పేదల కోసం సంవత్సరానికి రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్య సేవల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని అన్ని గ్రామపంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా నిధులు అందిస్తున్నది. పొదుపు సంఘాల యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో 2014లో ఎంఎస్పీ రూ.1300గా ఉండగా, ప్రస్తుతం రూ.2,300కి పెంచారు. గతంలో దేశంలో ఎరువుల కొరత ఉండగా, ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో రైతులకు అవసరానికి తగ్గట్టు ఎరువుల సరఫరా నిరంతరంగా జరుగుతోంది.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.

నాగుపాములా రాజీవ్ రహదారి

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ హైదరాబాద్-కరీంనగర్-మంచిర్యాల రాజీవ్ రహదారి నాగుపాములా అధ్వానంగా ఉందని, నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ మేరకు నితిన్ గడ్కరీ హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ చూపాలని సూచించారు.

‘‘ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఒకప్పుడు వెనుకబడిన జిల్లా. రోడ్లు, రహదారుల వ్యవస్థ ఘోరంగా ఉండేది. కరీంనగర్ నుండి ఇక్కడికి గంటన్నరలోపే వచ్చాను. తెలంగాణలో ఎక్కడికైనా సరే… పొద్దున్నే పోయి పని చూసుకుని మళ్లీ సాయంత్రానికి ఇంటికి రాగలుగుతున్నాం. ఒక్కసారి పదేళ్ల క్రితానికి, ఇప్పటికీ ఉన్న తేడాను గుర్తు చేసుకోండి. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు. గత పాలకులు వెనుకబడేసిన జిల్లా. మోదీ ప్రభుత్వం వచ్చాక శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గత 10 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రానికే జాతీయ రహదారుల(నేషనల్ హైవేస్) అభివృద్ధి కోసం రూ.1,25,485 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ పట్ల మోదీకి, గడ్కరీకి ఎంత ప్రేమ ఉందో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? 1947 నుండి 2014 వరకు (గత 67 ఏళ్లలో) 2500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. కానీ మోదీ హయాంలో గడ్కరీ పుణ్యమా అని పదేళ్లలో 5200 కిలోమీటర్లకు పెరిగాయి. అంటే రెట్టింపు స్థాయిలో నేషనల్ హైవేస్ విస్తరించాయి. అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టుల అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. దేశ అభివృద్ధిలో తెలంగాణ ప్రత్యేకించి హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోందంటే మౌలిక సదుపాయల కల్పన వల్లే సాధ్యమైంది. గడ్కరీ వద్దకు ఏ ప్రతిపాదన తీసుకెళ్లినా కాదు, లేదు అనుకుండా పనులు చేసి పంపిస్తారు. ఇక్కడున్న మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. రాష్ట్ర అభివృద్ధికి మేం సహకరిస్తాం. హైదరాబాద్ నుండి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి నాగుపాములా ఉంది. క్వాలిటీ లేకుండా పనులు చేశారు. ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడండి. ఆ సమస్యను పరిష్కరిస్తే రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.’’ అని బండి సంజయ్ కుమార్ అన్నారు.