రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేని ‘ప్రజా పాలన’
తెలంగాణలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, మహిళలపై హింస, గృహ హింస, ఇతర నేరాల కేసులు వేలల్లో నమోదవుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. మహిళలు సురక్షితంగా లేని పరిస్థితిలో “ప్రజా పాలన” అని ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మార్చి 6న హైదరాబాద్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దిల్లీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, ఇతర మోర్చా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ”ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని మహిళలకు అపార గౌరవం, అవకాశాలు లభిస్తున్నాయి. ”నారీ శక్తి” అనే భావన కేవలం బిజెపి నినాదమే కాదు.. దేశ నిర్మాణానికి సంబంధించిన ఒక జాతీయ మిషన్. ఒకప్పుడు దేశంలో ఆడబిడ్డ పుట్టడాన్ని నిర్లక్ష్యంగా చూసే పరిస్థితులు ఉండేవి. ఆడ శిశువులను గర్భంలోనే హతమార్చే దారుణ పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యమరీతిలో ప్రారంభించిన బేటీ బచావో, బేటీ పఢావో పథకం సమాజంలో పెద్ద మార్పు వచ్చింది. నేడు ఆడబిడ్డలను కాపాడడమే కాకుండా వారికి విద్య, సాధికారత కల్పించే దిశగా దేశం ముందుకు సాగుతోంది.
మోదీ ప్రభుత్వం మహిళల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకువచ్చే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని పేద మహిళల వంటగదుల్లో పొగల బదులు ఇప్పుడు వెలుగులు మెరిసిపోతున్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో కోట్లాది కుటుంబాలు ఎల్‌పీజీ సౌకర్యం పొందాయి. గ్యాస్ వాడకంతో గృహ వాయు కాలుష్యం తగ్గి, మహిళల ఆరోగ్యం మెరుగుపడింది. వంటగదిలోనే కాదు, జీవనశైలిలోనూ ‘ఉజ్వల’ మార్పు కనిపిస్తోంది. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY)’ దే. కోట్లాది మంది పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కల్పిస్తూ, మహిళల పేరుతో ఇంటి హక్కు, తక్కువ వడ్డీతో రుణాలు, అధిక సబ్సిడీ కల్పిస్తూ సొంతింటి కలను సాకారం చేశారు. మోదీ ప్రభుత్వంలో మహిళలకు వివిధ రంగాల్లో అనేక అవకాశాలు లభిస్తున్నాయి. నేడు మహిళలు బస్సులు నడుపుతున్నారు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు, సంస్థలకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి రంగంలో వారు ముందుండి దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
దేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముని భారత రాష్ట్రపతిగా బిజెపి మద్దతుతో ఎన్నుకున్నారు. ఇది సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన మహిళలను సాధికారత కల్పించాలనే బిజెపి సంకల్పానికి నిదర్శనం. నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్మలా సీతారామన్ భారతదేశ తొలి మహిళా రక్షణ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళల రాజకీయ సాధికారతకు బాటలు వేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం “నారీ శక్తి వందన్ అధినియమ్” (మహిళా రిజర్వేషన్ బిల్లు – 2023). పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ చట్టం దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండగా, కొత్త పార్లమెంట్ భవనంలో తొలి రోజే దీనిని ఆమోదింపజేసి మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతపై తన నిబద్ధతను చాటిచెప్పింది.
జాతీయ భద్రతా రంగంలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలక ఆపరేషన్లలో మహిళా అధికారులు బాధ్యతలు నిర్వర్తించడం భారతదేశ ఆడబిడ్డలు దేశ రక్షణలో కూడా ముందుంటారని స్పష్టమవుతోంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లో లాడ్లీ లక్ష్మీ యోజన వంటి పథకాల ద్వారా ఆడబిడ్డలకు విద్యా, ఆర్థిక సహాయం అందిస్తూ వారిని సాధికారత వైపు నడిపిస్తున్నాయి. చదువుకున్న మహిళలు, యువ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చింది.
మహిళల నేతృత్వం అభివృద్ధి: బన్సూరి స్వరాజ్
బన్సూరి స్వరాజ్ ప్రసంగిస్తూ.. ”వికసిత భారత్ గురించి మాట్లాడినప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మహిళా సాధికారత గురించి మాత్రమే మాట్లాడరు. ఆయన నాయకత్వంలో దేశం మహిళా సాధికారత నుండి మహిళల నేతృత్వం అభివృద్ధి వైపు ముందుకు సాగుతోంది. మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి సాధించేందుకు మోదీ మూడు ప్రధాన స్థంభాలను నిర్మించారు.
మొదటి స్తంభం — గౌరవం (Dignity)
బేటీ బచావో, బేటీ పడావో ద్వారా అమ్మాయిలకు జన్మ హక్కును, విద్య హక్కును రక్షించారు.
రెండవ స్తంభం — అవకాశాలు (Opportunity)
ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఇచ్చిన రుణాల్లో 70 శాతం పైగా మన దేశంలోని మహిళలే పొందారు.
మూడవ స్తంభం — ఆర్థిక సాధికారత
స్టార్టప్ ఇండియా ద్వారా భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదిగింది. అదే సమయంలో స్వయం సహాయక సంఘాల మహిళా వ్యాపారులకు కూడా ప్రత్యేక పథకాలు అమలు అవుతున్నాయి. స్వయం సహాయక సంఘాలు దేశంలో ఒక సామాజిక విప్లవంగా మారాయి. ప్రధాని మోదీ ప్రకటించిన మూడు కోట్ల “లఖ్ పతి దిదీలు” లక్ష్యం ఇప్పటికే చేరుకుంది. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేయాలంటే మహిళలు నాలుగు లక్ష్యాలు- స్వయం సమృద్ధి, డిజిటల్ సాక్షరత, ఆర్థిక సాధికారత, రాజకీయ భాగస్వామ్యం సాధించాలి. కొంతమంది యువత “రాజకీయాలు మురికికూపంలా ఉంటాయి” అంటారు. అది నిజమే! అయితే ఆ మురికిని శుభ్రం చేయడం ఎవరి బాధ్యత? ఈ దేశం మీదే. భారతదేశ భవిష్యత్తు నిర్మాణకర్తలు మీరే. అందుకే ప్రతి మహిళ ఒక సామాజిక విప్లవం, ఒక రాజకీయ విప్లవం, ఒక ఆర్థిక విప్లవం. నారీశక్తి బలంతోనే వికసిత భారత్ సాధ్యమవుతుంది.” అని అన్నారు.
