సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి ప్రతీక యూపీఎస్
23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 24 గంటల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కూడా యూపీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. సహకారాత్మక సమాఖ్య వాదానికి ప్రోత్సాహం నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి. రాష్ట్రాలకు నిధుల బదిలీని 32 నుంచి 42 శాతానికి పెంచడం, పెట్టుబడి వ్యయాల పెంపునకు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కల్పించడం, తమ ద్రవ్య పరిస్థితుల విషయంలో పారదర్శకంగా ఉండేటట్లు రాష్ట్రాలను ప్రోత్సహించడంతో పాటు యూపీఎస్ వ్యవస్థలో మార్పులు సహకారాత్మక సమాఖ్యవాదం దిశలో ఒక సానుకూలమైన పరిణామం.
యుపీఎస్ ప్రయోజనాల గురించి ఇప్పటికే చాలామంది వివరించారు. ఈ విధానంలో ఒక ఉద్యోగి తన సర్వీసు చివరి 12 నెలల కాలంలో తీసుకున్న మౌలిక వేతనంలో కనీసం 50 శాతం పెన్షన్ గా అందుకుంటారు. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఎంతో లోతుగా ఆలోచించి ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) లోని రెండు ముఖ్యాంశాలకు ఈ కొత్త విధానం ఎటువంటి భంగం కలిగించదు. ఉద్యోగి తన జీతంలో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తారు. అలాగే ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఉద్యోగులకు పెన్షన్ చెల్లించేందుకు కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడుతుంది.
గత కొన్ని నెలల్లో రాజస్థాన్, ఛత్తీస్ గడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలు 2003కి ముందు అమల్లో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాయి. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రాల్లో ఎన్డీఏయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఇది నిర్లక్ష్యమైన పూరితమైన చర్య. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం వెంటనే పెన్షన్ నిధి కోసం ఎటువంటి మొత్తాన్ని జమ చేయనక్కర్లేదు. ఆ విధంగా దానికి డబ్బులు ఆదా అవుతాయి. అయితే అదే సమయంలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. దానివల్ల రాబోయే సంవత్సరాల్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. కొన్ని రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మరిన్ని రాష్ట్రాలు అదే బాటను ఎంచుకుంటే కలిగే పర్యవసానాల పట్ల అప్రమత్తమైన రిజర్వ్ బ్యాంకు 2023 సెప్టెంబర్ లో ఒక పత్రాన్ని విడుదల చేసింది. “తిరిగి ఓపీఎస్ కు వెళ్లడం వల్ల ద్రవ్య పరిస్థితులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది, ఎందుకంటే జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్) తో పోలిస్తే వాస్తవంలో పెన్షన్ల భారం నాలుగున్నర రెట్లు పెరుగుతుంది,” అని రిజర్వ్ బ్యాంకు తన పత్రంలో హెచ్చరించింది. రాష్ట్రాలు ఓపీఎస్ ను పునరుద్ధరిస్తే అప్పటికి తాత్కాలికంగా వారి పెన్షన్ ఖర్చులు తగ్గవచ్చు గాని ఆ తర్వాత ద్రవ్య పరిస్థితి చాలా గడ్డుగా మారుతుందని బ్యాంకు పేర్కొంది. మహారాష్ట్ర మాదిరిగా మిగిలిన రాష్ట్రాలు కూడా యూపీఎస్ ను అమలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వాటి ఆర్థిక వనరులపై ఒత్తిడి పడకుండా అవి మూలధన మౌలిక వ్యవస్థలపై ఖర్చు చేయడానికి వెసులుబాటు కలుగుతుంది. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు పెరిగి ప్రజల జీవితాలు మెరుగుపడతాయి.
ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య సమతూకం సాధించటం ఒక దీర్ఘకాలిక ప్రక్రియ. మెరుగైన అవకాశాల కోసం ప్రజల్లో గల ఆకాంక్షలను నెరవేర్చడానికి అవసరమైన పరిస్థితులను, వాతావరణాన్ని కల్పించడానికి నిధులు వెచ్చిస్తూనే మరోవైపు పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిధులను కేటాయించాలి. కోవిడ్ తర్వాత రాష్ట్రాలు మూలధన వ్యయాలను పెంచడానికి కేంద్ర ఆర్థిక శాఖ మూలధన వ్యయాల కోసం రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక సహాయాన్ని ఎనిమిది రెట్లు పెంచింది. 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాల కింద మూలధన వ్యయ ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు కేంద్రం రూ.లక్ష కోట్లు బదిలీ చేసింది. రాష్ట్రాల రుణ పరిమితికి అదనంగా ఈ రుణాలను అందజేసింది. ఈ సంవత్సరం బడ్జెట్లో దీన్ని 1.3 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. రాష్ట్రాలు తమ అవసరాల కోసం ఈ కేంద్ర ప్రభుత్వ పథకం నిధులను ఖర్చు చేయకుండా తమ మూలధన వ్యయాలకు ఈ నిధులను జత చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అదే సమయంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్లో పారదర్శకత, సుస్థిరత కోసం రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, ప్రత్యేక సంస్థలు చేసే అప్పులు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అసలు, వడ్డీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులుగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది.
తెలంగాణలో ఇంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ వెలుపల చేసిన ఇటువంటి అప్పులతోనే రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పుడు బడ్జెట్ కి వెలుపల చేసే అప్పులలో పారదర్శకతను తీసుకురావడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ లొసుగును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేయకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలలో అవసరమైన సవరణలు చేయడం, వాటిని మరింత మెరుగ్గా అమలు పరచడానికి మార్పులు చేయడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వం అన్ని భాగస్వామ్య పక్షాలను సంప్రదించడం, వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవడం తన విధానం అని స్పష్టం చేసింది. అయితే యూపీఎస్ పై ప్రతిపక్షాలు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. వారి స్పందన ఒకే విధంగా లేదు. జాతీయ భద్రత, ద్రవ్య విధానం వంటి విస్తృత ప్రభావం గల అంశాల విషయంలో ప్రతిపక్షంలోని జాతీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా, మరింత బాధ్యతాయుతంగా మాట్లాడాలి.
యూపీఎస్ అటు ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వానికి కూడా లాభదాయకమే. దేశ నిర్మాణం కోసం తన జీవితకాల సర్వీసులో డబ్బు జమ చేసిన ప్రభుత్వ ఉద్యోగికి తనకు లభించే పెన్షన్ మొత్తంపై ఈ విధానం ఒక అవగాహన కల్పిస్తుంది. సీపీఎస్ లో ని రెండు ముఖ్యభాగాలైన ఉద్యోగి వాటా, ప్రభుత్వ వాటా ఇందులోనూ కొనసాగుతాయి. అందువల్ల ఈ సంస్కరణ ఒక విధంగా ఇంతకుముందున్న విధానానికి కొనసాగింపు. అయితే దీన్ని పెన్షన్ కి సంబంధించిన అంశంగానే చూడకూడదు. అనుబంధ పథకాల ద్వారా రాష్ట్రాల్లో మూలధన వ్యయాలను పెంచడానికి, రాష్ట్రాల రుణాల్లో పారదర్శకతను పెంపొందించడం ద్వారా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి కేంద్రం చేపట్టిన అనేక చర్యల్లో యూపీఎస్ ను కూడా అంతర్భాగంగా పరిగణించాలి. అందుకే యూపీఎస్ పర్యవసానాలు విస్తృతంగా ఉంటాయి. ఆ కోణం నుంచి చూస్తే ఇది సహకారాత్మక సమాఖ్య వాదం దిశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం.
జి. కిషన్ రెడ్డి,
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

