వరద ప్రమాదంపై చలనం లేని రేవంత్ ప్రభుత్వం
వర్షాలు, వరదలతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. వరదలు ప్రారంభం కాగానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, పరిస్థితులను అడిగే వరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎక్కడా తగురీతిన స్పందించినట్లు కనిపించలేదు. వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకొని సహాయ, సహకారాలు అందించడానికి పడవలు, ప్రాణాలు కాపాడే సామాగ్రితో పాటు 7 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం మోహరించింది. అలాగే సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు రెండు హెలికాప్టర్లను కూడా పంపింది. ఐతే రాష్ట్రంలోని విపత్తు పరిస్థితుల గురించి కంట్రోల్‌రూంకి నిబంధనల మేరకు ఎలాంటి అధికారిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం పంపించకపోవడం పట్ల కేంద్ర హోంశాఖ స్పష్టం అసహనం వ్యక్తం చేసింది. పైగా, కేంద్రం తెలంగాణకు పంపిన రెండు హెలికాప్టర్లను హకీంపేటలో ఉంచుకొని ఉపయోగించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. విపత్తు సహాయ కార్యక్రమాల గురించి రోజువారీ పంపించాల్సిన నివేదికలు పంపించక పోగా, రెండు హెలికాప్టర్లను పంపినా ఏం చేస్తున్నారని నిలదీసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ప్రశ్నించింది.
తెలంగాణలో వరదల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సమాచారం అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. వర్షాలపై తొలుత సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి కేంద్రానికి సవివరంగా లేఖ రాయాలని అధికారులను ఆదేశించిన నాలుగైదు రోజుల వరకు ఈ విషయంలో ప్రభుత్వంలో ఎటువంటి కదలిక కనిపించలేదు. రాష్ట్రంలో నోటిఫై చేసిన వరదలు, వైపరీత్యాల సమయంలో అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఖాతాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి రూ.1,345.15 కోట్లు ఉన్నట్లు రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ ద్వారా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిధి కింద కేంద్ర వాటా విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సమాచారం సమర్పించలేదని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద అమలు చేసే పథకాలకు రాష్ట్ర వాటాతో కలిపి అందిన మొత్తం గురించి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏప్రిల్, అక్టోబరులో సమాచారం అందించాలి. 2024-25కి సంబంధించిన తొలివిడత మొత్తం రూ.208.40 కోట్లను ఈ ఏడాది జూన్ 1న ఇవ్వాల్సి ఉంది. ఆ నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. అంతక ముందు విడుదలైన నిధులు, ఆర్జించిన వడ్డీ ఆదాయం, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత విధానంలో సమాచారాన్ని కేంద్ర హోంశాఖకు సమర్పించాలని సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగానికీ పంపాలని కేంద్రం పేర్కొంది. అప్పుడే 2024-25కి సంబంధించి ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధుల్లో కేంద్ర వాటా తొలి విడత మొత్తం విడుదల చేయడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర సీఎస్‌కి తెలిపింది.
వరద నష్టాలు ఎక్కువగా జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపముఖ్యమంత్రితో పాటు కీలక శాఖలు నిర్వహిస్తున్న ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ స్వయంగా ముఖ్యమంత్రి పరిశీలనకు వచ్చే వరకు మంత్రులు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించలేదు. ఎక్కడికి వెళ్లినా వరదలలో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం తగురీతిలో స్పందించడం లేదంటూ ముఖ్యమంత్రి స్వయంగా నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మూడు రోజులుగా తిండీతిప్పల్లేకుండా, వరద నీటిలో బిక్కుబిక్కుమని గడుపుతుంటే తీరిగ్గా వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులపై బాధితులు విరుచుకుపడ్డారు. ‘వరద నీటిలో చిక్కుకొని రెండు రోజులుగా నరకం అనుభవిస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదని, అన్నపానీయాలు లేకుండా మగ్గిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం ముంపునకు గురయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నిందించుకోవడంతోనే గడిపారు. అసలు వరదలకు ఎంతమంది మృతి చెందారో వివరాలను అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా వరదలలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం అందించాలని ప్రకటించిన కాంగ్రెస్ తాను అధికారంలో ఉండగా రూ.5 లక్షలు ప్రకటించి సరిపెట్టుకుంది. ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి ప్రకటించిన రూ.3 లక్షలతో కలిపి ఈ మొత్తం ఇస్తున్నారా? అదనంగా ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తే స్పష్టత లేదు.
భారీ వర్షాలు హైదరాబాద్ ను సైతం ముంచెత్తినా మంత్రులు క్షేత్రస్థాయిలో వచ్చి కనీసం పరిశీలన చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ రూ.1345 కోట్లు ఉన్నప్పటికీ దానిని ముందు ఖర్చు పెట్టకుండా జాతీయ విపత్తుగా ప్రకటించాలని, కేంద్రం సహాయం చేయాలి అంటూ ప్రకటనలకు పరిమితమవుతూ వచ్చారు. చివరకు జరిగిన వరద నష్టాల గురించి వివరంగా నివేదికలను కూడా సిద్ధం చేసి పంపడంలోనూ జాప్యం చేస్తూ వచ్చారు.
కృష్ణ చైతన్య

