స్వయంసమృద్ధ భారత్‌ను సాకారం చేసే కార్మిక సంస్కరణలు
దశాబ్దాలుగా భారత్ బలహీనమైన ఆర్థిక వృద్ధి, వేళ్లూనుకున్న అవినీతి, ఉద్యోగ కల్పన, కార్మికుల సంక్షేమంపై నిబద్ధత లేమితో కొట్టుమిట్టాడింది. రాజకీయ ప్రేరేపిత ఘెరావ్ లు, బంద్‌లు పారిశ్రామిక కార్యకలాపాలను అడ్డుకుంటూ, పెట్టుబడులను నిలిపివేసి వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. గత ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేసి, వారి వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో విఫలం కావడం శోచనీయం. ఈ జడత్వాన్ని తొలగించడానికి జాతీయ నాయకత్వంలో మౌలిక మార్పు అవసరమైంది. ఎర్రకోట బురుజుల నుండి ప్రధాని నరేంద్ర మోదీ ‘శ్రమేవ జయతే’ అని ఉద్ఘాటిస్తూ, భారత అభివృద్ధి ప్రస్థానంలో కార్మికుల గౌరవమే కేంద్రబిందువు కావాలని ప్రకటించారు. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, విధాన రూపకల్పనలో కార్మికులకు పెద్దపీట వేసే కొత్త జాతీయ స్పృహకు నాంది పలికింది.
ఈ మార్పు ఎప్పుడో జరగాల్సింది. భారత్‌లోని మెజారిటీ కార్మిక చట్టాలు 1920-1950ల నాటి వలసవాద దృక్పథంతో రూపొందినవే. కానీ పని చేసే ప్రపంచం సమూలంగా మారింది. గిగ్, ప్లాట్‌ఫారమ్ (యాప్-ఆధారిత) ఆర్థిక వ్యవస్థలు, డిజిటలైజేషన్, ఆధునిక సంస్థలు అంతర్జాతీయ కార్మిక వ్యవస్థలను మార్చేశాయి. అయితే, భారత కార్మిక చట్టాలు మాత్రం కాలంతో పాటు మారకుండా అలాగే స్తంభించిపోయాయి. ప్రధాని మోదీ తన ‘పంచ్ ప్రాణ్ ‘ (ఐదు ప్రతిజ్ఞలు) ద్వారా వలసవాద మనస్తత్వాన్ని వీడి, భవిష్యత్తుకు అనుగుణమైన విధానాలను అవలంబించాలని పిలుపునిచ్చారు. పాత చట్టాలు కొనసాగడానికి కారణం అవి పని చేస్తున్నాయని కాదు, వాటిని ఆధునికీకరించే రాజకీయ సంకల్పం గత ప్రభుత్వాలకు లేకపోవడమే.
నేడు మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తిరుగులేని స్థాయికి చేరింది. అయితే, ఈ చారిత్రక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే నియంత్రణ కోసం తయారైన వలస చట్టాల నుంచి భారత్ విముక్తి పొందాలి. అందుకే భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన, సామాజిక భద్రత కోసం సమగ్ర సంస్కరణలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలోనే 29 విడివిడి కార్మిక చట్టాలను క్రోడీకరించి నాలుగు స్పష్టమైన లేబర్ కోడ్‌లుగా – వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత-ఆరోగ్యం-పని పరిస్థితుల- కోడ్‌లుగా మోదీ ప్రభుత్వం మార్చింది. నవంబర్ 21న ఈ కోడ్‌లు అమలులోకి వచ్చాయి. ఇవి కార్మికులకు, ఆర్థిక వృద్ధికి మేలు చేసే ఆధునిక చట్రాన్ని నిర్మిస్తున్నాయి. 2019-20లో పార్లమెంటు వీటిని ఆమోదించినప్పటి నుంచి పలు రాష్ట్రాలు, కార్మిక సంఘాలు వీటిని స్వాగతించాయి. ఉదాహరణకు మహిళలకు రాత్రి వేళల్లో భద్రతతో కూడిన పని సౌకర్యం కల్పించిన రాష్ట్రాల్లో మహిళా ఉపాధి 13 శాతం పెరిగింది.
కార్మికులు, పరిశ్రమల అధిపతులతో నా చర్చల్లో ఒకే విషయం స్పష్టమైంది – పని ప్రదేశంలో పారదర్శకత, గౌరవం ఉండాలని. ఈ సూత్రమే మా సంస్కరణలకు పునాది. ఈ కోడ్‌లు కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూనే యజమానుల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటాయి. గిగ్ వర్కర్లు, ఆడియో-విజువల్ (దృశ్య శ్రవణ రంగాల్లోని) కార్మికులకు గుర్తింపునివ్వడం, 40 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు, దేశవ్యాప్తంగా సమాన కనీస వేతనం వంటివి ఇందులో ముఖ్యమైనవి. నియామక పత్రాలు, పే-స్లిప్పులు తప్పనిసరి చేయడం ద్వారా కార్మికులకు భద్రత లభిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా నిర్దిష్ట కాల ఉద్యోగం (ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్) ను ప్రవేశపెట్టాం. దీనివల్ల నిర్ణీత కాల వ్యవధిలో పనిచేసే వారికి కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సామాజిక భద్రత లభిస్తాయి. ఏడాది సర్వీసు పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీకి కూడా వీరు అర్హులవుతారు. అదనపు సమయం (ఓవర్ టైం) పనిచేస్తే రెట్టింపు వేతనం చెల్లించాలనే నిబంధనను కూడా చేర్చాం.
నారీ శక్తి ఈ సంస్కరణల్లో ప్రధాన భాగం. గనులు, భారీ యంత్రాల విభాగాల్లో మహిళల భాగస్వామ్యానికి మార్గం సుగమం చేశాం. మరోవైపు, సింగిల్ రిజిస్ట్రేషన్, లైసెన్స్ విధానం ద్వారా యజమానులపై భారం తగ్గించాం. ఇది పరిశ్రమల విస్తరణకు, తద్వారా స్థానిక ఉపాధికి తోడ్పడుతుంది. భారత్‌లో సామాజిక భద్రత పరిధి 2015లో 19 శాతం ఉండగా, 2025 నాటికి 64.3 శాతానికి చేరింది. దీనిని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), ISSAలు అభినందించాయి. ఈ కోడ్‌లపై వస్తున్న విమర్శలు అవగాహన లేమితో లేదా రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నవే తప్ప వాస్తవం కాదు. పాత, పారదర్శకతలేని వ్యవస్థలపై ఆధారపడిన వారు ఇప్పుడు పారదర్శకత చూసి అసౌకర్యానికి గురవుతున్నారు. ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ నిర్మాణంలో ఈ కార్మిక కోడ్‌లు ఒక చారిత్రక మైలురాయి. ఇవి కార్మికుడి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారిని దేశాభివృద్ధికి చోదక శక్తులుగా మారుస్తాయి.
మన్సుఖ్ మాండవీయ,
కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి

