ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచిన స్పీకర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను అసెంబ్లీ స్పీకర్లు విచారణకు చేపట్టి మూడు నెలల్లోగా నిర్ణయాలు వెలువరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ప్రసాద్ కుమార్ పాటించకపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెసులోకి ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని 2024 మార్చి 18న బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా చర్యలు తీసుకోవాలంటూ 2024 జూలై 16న ఫిర్యాదు చేసారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తే, అందులో ఐదుగురు పార్టీ మారలేదంటూ, వారిపై వచ్చిన పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు. మరి మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లకు ఎందుకు తేల్చలేదు. మూడు నెలల్లోగా తేల్చాల్సిన పిటిషన్లను ఏడాదిన్నరగా పెండింగులో పెట్టడం సుప్రీం కోర్టు తీర్పులను కాలరాయడమే.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్లు రాజ్యాంగ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో సూచించింది. కానీ, స్పీకర్ ప్రసాద్ కుమార్ మాత్రం ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించారు. మొత్తం పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హతా పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్ నాలుగు వారాల్లో విచారించి నిర్ణయం వెలువరించాలని సుప్రీం కోర్టు గత నెల 17న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం స్పీకరు తన ముందున్న పది అనర్హతా పిటిషన్లపై తీర్పు ఇవ్వకుండా అందులో సగం పిటిషన్లనే తేల్చడం ముమ్మాటికీ కోర్టు ధిక్కార చర్యనే.
ఫిరాయింపు చట్టం అమలు విషయంలో అసెంబ్లీ స్పీకర్లు కేవలం ట్రిబ్యునల్ ఛైర్మన్లుగా వ్యవహరిస్తారని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. కానీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా అవమానించారు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెసుతో అంటకాగుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ, స్పీకరుకు మాత్రం ఆధారాలు లభించకపోవడం దురదృష్టకరం. సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. స్పీకర్ నిర్ణయం ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని ఖూనీ చేయడమే.
ఫిరాయింపు నిరోధక చట్టాలను మరింత కఠినతరం చేస్తామని కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిస్తే, వారిపై ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడేలా చట్టాన్ని కఠినతరం చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిస్తే, అందుకు విరుద్దంగా అసెంబ్లీ స్పీకర్ వ్యవహరించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్ ముధుసూదనాచారి ఎలాగైతే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారో, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా ఆనాటి స్పీకర్ మాదిరే వ్యవహరించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో అప్పటి సీఎం కేసిఆర్ మాదిరే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి నిసిగ్గుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, తాను ముఖ్యమంత్రి అయ్యాక స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇంతటి దగుల్బాజీ చర్యలకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలో, చెప్పులతో కొట్టాలో ఆయనే చెప్పాలి.
(ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపై బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటన)
ఏలేటి మహేశ్వర్ రెడ్డి,
బిజెపి శాసనసభ పక్ష నేత

