తెలంగాణ ప్రభుత్వంలో ‘షాడో మంత్రివర్గం’ పెత్తనం!
ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా రాష్ట్ర సచివాలయం కేంద్రంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో మొత్తం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకొంటూ ఉంటారు. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన అందుకు పూర్తి భిన్నంగా జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలలో కలకలం చెలరేగుతుంది. మంత్రులతో, సీనియర్ అధికారులతో సంబంధం లేకుండా, సచివాలయం ముఖం చూడకుండానే ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో నెలకొన్న ఓ అనధికార కార్యాలయం ‘షాడో మంత్రివర్గం’గా పని చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. మంత్రులు, శాఖల కార్యదర్శుల కన్నా ‘షాడో’లే మొత్తం పాలనా యంత్రాంగంపై ఆధిపత్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పోస్టింగులు, బదిలీలు, పైరవీలు, పంచాయితీలు, సెటిల్మెంట్లు, ప్రాజెక్టులు.. ఇలా ఫైలు ఏదైనా వారి పర్యవేక్షణలోనే జరగాల్సిందే అని చెబుతున్నారు. వాళ్లు ఫోన్ చేసి మాట్లాడితే ముఖ్యనేత నేరుగా మాట్లాడినట్టేనని, వాళ్లు కన్నెర్రజేస్తే ముఖ్యనేతకు ఆగ్రహం వచ్చినట్టేనని ప్రచారం జరుగుతున్నది. షాడో మంత్రుల వ్యవహారంతో మంత్రులు కుతకుతలాడిపోతున్నారని సమాచారం. ఇప్పటికే తమ శాఖల్లో తన నమ్మకస్తులకు పోస్టింగ్‌లు ఇచ్చుకున్నాడని, తమ సిఫార్సులను సైతం పక్కన పడేశాడంటూ ఆరోపిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండానే తమ పరిధిలోని శాఖలకు సంబంధించి నిర్ణయాలు జరిగిపోతున్నాయని మండిపడుతున్నారు. ఇప్పుడు పెత్తనం మొత్తం షాడో మంత్రుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ‘ఇక మేమెందుకు దండుగ?’ అని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట! సచివాలయంకు సమాంతరంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఈ కార్యాలయం కాంగ్రెస్ వర్గాలలో ‘షాడో సీఎంఓ’గా పేరొందింది. మరో భాషలో రాజ్యాంగేతర శక్తుల అడ్డా అని ప్రచారం జరుగుతున్నది.
ఇందులో ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులు తొమ్మిది మంది ఉంటారని సమాచారం. ఒక్కొక్కరు మూడు నాలుగు శాఖలకు షాడో మంత్రులుగా వెనుక ఉండి నడిపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వసూళ్లు, సెటిల్మెంట్లు, రాజీలు, ల్యాండ్ క్లియరెన్స్‌లు, పైరవీలు, పోస్టింగులు ఇలా ఎవరికి పట్టున్న అంశాల ఆధారంగా వాళ్లు శాఖలు పంచుకున్నట్టు సమాచారం. సంబంధిత మంత్రులకు తెలియకుండా, ఆయా శాఖల కార్యదర్శులతో సంబంధం లేకుండా షాడో కార్యాలయంలో చిటికెలో పనులు జరిగిపోతాయని చెప్తున్నారు. పోలీసు శాఖకు షాడో మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత చెప్తే అంత అన్నట్లు పోలీసుశాఖలో చెప్పుకొంటున్నారు. అర్ధరాత్రి అని కూడా చూడకుండా మంత్రుల ఇండ్లలోకి వెళ్లటానికి కూడా వెనుకాడరని చెప్తున్నారు. ఇటీవల సిమెంటు ఫ్యాక్టరీ పంచాయితీలో యజమాని కణతకు గన్ను పెట్టారనే ఆరోపణల మీద అర్ధరాత్రి వేళ మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులను పంపించింది షాడో మంత్రేనని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మంత్రి ఓఎస్డీ సుమంత్‌ను వెతికి పట్టుకోవడం కోసం ఆయనే అప్పటికప్పుడు 20 పోలీసు బృందాలను ఏర్పాటు చేయించినట్టు సమాచారం.
ప్రభుత్వంలో నంబర్ 2గా గుర్తింపు ఉన్న మంత్రి కొడుకు భూకబ్జా వ్యవహారంలో ఆయనే ముందుండి కేసులు నమోదు చేయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సదరు షాడో మంత్రి విద్యాశాఖ వ్యవహారాలు సైతం చక్కబెడుతున్నారని ప్రచారంలో ఉన్నది. మంచాల కొనుగోళ్ల వ్యవహారంలో రూ.వంద కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏ పేరుతో నమ్మిన బంటుగా వ్యవహరించే మరో వ్యక్తికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు తదితర వ్యవహారాలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. అందాల పోటీల సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన హైడ్రాను వసూళ్ల సాధనంగా మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చెరువుల ఆక్రమణల సాకుతో రియల్టర్లను భయపెట్టి, ఇండ్లను కూల్చకుండా ఉండాలంటే రూ.కోట్లు సమర్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నగరం అంతటా అడ్వైర్టెజ్‌మెంట్ కాంట్రాక్టులు, ఫ్లెక్సీల అనుమతుల్లో ఈయన పర్యవేక్షణలోనే దందాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. బహుళ అంతస్తుల భవనాల అనుమతులు, టెండర్ల ప్రక్రియలో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యనేత బంధువొకరు రెవెన్యూ శాఖను చూస్తున్నారు. ఫ్యూచర్ సిటీ, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ప్రచారంలో ఉన్నది. రూ.100 కోట్లకు తక్కువ ఉంటే ఫైల్ దాదాపు వీరు ముట్టుకోరని సమాచారం. ఆదిభట్ల సీలింగ్ భూముల వ్యవహారం నుంచి మొదలుపెట్టి ప్రస్తుతం మంచిరేవుల భూముల విషయంలో జరిగిన పంచాయితీ వరకు వీళ్లే చక్కదిద్దుతున్నట్టు చెబుతున్నారు. ఇటీవలే ముఖ్యనేతకు ఆంతరంగికుడిగా చేరిన మరో నేత భూ వ్యవహారాలు, ఇసుక మాఫియాను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రవీణ్

