Happy Poor

తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన భారత్

ర్థికవేత్తలు సుర్జిత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్‌లు ‘భారత్‌లో సమ్మిళిత వృద్ధిపై నాలుగు వాస్తవాలు’ అనే అంశంపై జరిపిన అధ్యయనంలో భారత్‌లో పేదరిక ధోరణులపై సంచలన విశ్లేషణ వెలువరించారు. 2022-23, 2023-24 సంవత్సరాల ‘గృహ వినియోగ వ్యయ సర్వే’ (హెచ్సీఈఎస్) ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనం, భారతదేశం తీవ్రమైన పేదరికాన్ని విజయవంతంగా నిర్మూలించిందని, గత దశాబ్దంలో పేదరిక స్థాయిలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది.

తీవ్ర పేదరిక నిర్మూలన: 2023-24లో భారత్ తీవ్ర పేదరికం రేటు 1 శాతం కంటే తక్కువకు పడిపోయిందని సర్వేల సమాచారం సూచిస్తోంది. 2011-12 గణాంకాల ప్రకారం జనాభాలో 12.2 శాతం మంది పేదలు కాగా, 2023-24లో కేవలం 1 శాతం మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ప్రపంచ బ్యాంకు 1.9 డాలర్ల పీపీపీ (పర్చేజ్ పవర్ పారిటీ- కొనుగోలు శక్తి సమానత్వం), 2.15 డాలర్ల పీపీపీ దారిద్య్ర రేఖలు పేదల సంఖ్యలో ఈ గణనీయమైన తగ్గింపును ధృవీకరిస్తున్నాయి. ఇది భారతదేశ ఆర్థిక పురోగతిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

తగ్గుతున్న అసమానతలు: ప్రజల్లో నెలకొని ఉన్న అభిప్రాయాలకు భిన్నంగా గత పన్నెండేళ్లలో భారతదేశంలో అసమానతల తగ్గాయని అధ్యయనం కనుగొంది. ఆదాయ అసమానతలను కొలిచే గిని గుణకం 2011-12లో 37.5 నుంచి 2023-24లో 29.1కి పడిపోయింది. ఈ అసమానతల క్షీణత అధిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలలో చాలా అరుదుగా సంభవించే పరిణామం. అసమానతలు పెరగడానికి బదులు తగ్గుతున్న కొన్ని దేశాలలో భారతదేశం ఇప్పుడు ఒకటి. భూటాన్, డొమినికన్ రిపబ్లిక్ మాత్రమే భారీ క్షీణతను చూశాయి, కానీ రెండు దేశాలు చాలా తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. సాధారణంగా, ఆర్థిక వృద్ధి అధిక అసమానతలకు దారితీస్తుంది. ఇక్కడ ధనవంతులు ధనవంతులు అవుతారు, పేదలు పేదలుగా మిగిలిపోతారు. అయితే, ఆర్థిక అంతరం పెరగడానికి బదులుగా తగ్గుతున్న భారత్ ఇందుకు మినహాయింపని స్పష్టమవుతోంది

పేదల్లో పెరుగుతున్న వినియోగం: భారత జనాభాలో అట్టడుగున ఉన్న మూడంచెల వారు వినియోగ స్థాయిల్లో అనూహ్యమైన వృద్ధిని చూశారు. నెలవారీ తలసరి వినియోగ వ్యయాలు, ముఖ్యంగా ఆహారం, గృహ వినియోగ వస్తువులు, మన్నికైన వస్తువుల్లో (మిక్సీలు వంటి దీర్ఘకాలం మన్నే వినియోగ వస్తువులు) గణనీయమైన పెరుగుదల ఉందని అధ్యయనం నివేదించింది. 2022-23, 2023-24 మధ్య, నిరుపేదలలో ఆహార వ్యయం 10.7 శాతం పెరిగింది. మన్నికైన వస్తువులపై (గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటివి) ఖర్చు 24.2 శాతం పెరిగింది. మొత్తం మీద అట్టడుగున ఉన్న 30 శాతం ప్రజల నెలవారీ తలసరి వినియోగం 11.9 శాతం పెరిగింది. సంక్షేమ కార్యక్రమాలు, పెరుగుతున్న ఆదాయాలు, ఆర్థిక వృద్ధి దేశంలోని నిరుపేద కుటుంబాలు మెరుగైన ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు దోహదపడ్డాయని ఇది సూచిస్తుంది.

కొత్త దారిద్య్రరేఖ ఆవశ్యకత: భారతదేశంలో పేదరికం ఇంకా ఎక్కువగానే ఉందని చాలామందిలో ఉన్న నమ్మకాన్ని ఈ పరిశోధనలు సవాలు చేస్తున్నాయి. భారత్ అత్యంత పేదరికాన్ని దాదాపు తుడిచిపెట్టిందని, ఇది చాలా తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధించిన విజయం అని పరిశోధకులు పేర్కొన్నారు. భారత్ ప్రస్తుత పేదరిక రేఖలు కాలం చెల్లినవని, పేదరికం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడంలో విఫలమయ్యాయని ఈ విశ్లేషణ రచయితలు వాదించారు. యూరోపియన్ ప్రమాణాల మాదిరిగానే సాపేక్ష దారిద్య్రరేఖ ప్రమాణాన్ని అనుసరించాలని వారు ప్రతిపాదించారు. ఇది మధ్యస్థ ఆదాయంలో 60 శాతం పేదరిక పరిమితిగా పరిగణిస్తుంది.

గృహ వినియోగ సమాచారంపై సందేహాలు 

కొత్త హెచ్సీఈఎస్ 2022-23 సర్వేలో భాగంగా సమాచారాన్ని సేకరించడానికి మూడు సార్లు ఒక్కొక్క కుటుంబాన్ని సర్వే చేసిన వారు సందర్శించారు. ఇందుకు భిన్నంగా హెచ్సీఈఎస్ 2011-12 సర్వే సమయంలో ఒకసారి మాత్రమే ఒక్కొక్క కుటుంబాన్ని సందర్శించారు. అందువల్ల ఈ రెండు సర్వేల సమాచారాన్ని పోల్చలేమని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే భల్లా, భాసిన్ ఈ సమస్యను అధ్యయనం చేసి సమాచారం విషయంలో ఎటువంటి తేడాలు లేవని తేల్చారు. దీనిని ధృవీకరించడానికి వారు సర్వే సమాచారాన్ని జాతీయ ఆర్థిక రికార్డులతో పోల్చారు. 2011-12లో 52.4 శాతం, 2022-23లో 46.9 శాతం, 2023-24లో 47.9 శాతం… ఇలా ఫలితాలు స్థిరంగా ఉన్నాయి. పేదరికం తగ్గడానికి సర్వే విధానంలో మార్పులు కారణం కాదని, ప్రజల జీవన స్థితిగతుల్లో చోటుచేసుకున్న నిజమైన మెరుగుదల కారణమని అని ఇది రుజువు చేస్తోంది.

ప్రస్తుతం, భారత్ టెండూల్కర్ దారిద్య్ర రేఖ (నెలకు ఒక వ్యక్తికి రూ.870), రంగరాజన్ దారిద్య్ర రేఖ (నెలకు ఒక వ్యక్తికి రూ.1,098) ను ఉపయోగిస్తుంది- రెండూ పాత మదింపు విధానం ఆధారంగా నిర్దేశించిన ప్రమాణాలే. యూరప్ మాదిరిగానే ‘సాపేక్ష దారిద్య్ర రేఖ’ను ఉపయోగించాలని పరిశోధకులు ప్రతిపాదించారు. ఇక్కడ సగటు ఆదాయంలో 60 శాతాన్ని పేదరికంగా నిర్వచించారు. ఈ విధానాన్ని భారత్‌లో ఉపయోగిస్తే జనాభాలో 16.5 శాతం మంది పేదలుగా వర్గీకరించబడతారు. సగటు ఆదాయంలో 50 శాతాన్ని ఉపయోగించే మరో పద్ధతి 24.7 శాతం మందిని పేదరికంలోకి నెట్టేస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణమైన కొత్త, మరింత వాస్తవ పేదరిక పరిమితిని ప్రమాణంగా తీసుకోవలసిన అవసరాన్ని ఇది వెల్లడిస్తుంది.

విధానంపై ప్రభావం 

దేశంలో మెరుగుపడుతున్న ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే కొత్త దారిద్య్ర రేఖ అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. రచయితలు రెండు ప్రత్యామ్నాయ ప్రమాణాలను ప్రతిపాదించారు:

  • వినియోగంలో అట్టడుగున ఉన్న 33వ శాతం జనాభా ఆధారంగా దారిద్య్ర రేఖ.
  • సగటు ఆదాయంలో 60 శాతం ఆధారంగా యూరోపియన్ తరహా సాపేక్ష పేదరిక ప్రమాణం.

ఇదిగాక భల్లా, భాసిన్ పేదరిక కొలమానాలను సవరించడంలో నీతి ఆయోగ్ చురుకుగా పాల్గొనాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎందుకంటే గత దశాబ్దంలో చాలా పేదరిక పరిశోధనలను ప్రభుత్వ సంస్థలు కాకుండా స్వతంత్ర నిపుణులు చేశారు.

పేదరికంపై చర్చ స్వభావంలో మార్పు 

ఈ అధ్యయనం పేదరిక స్థాయిలను చర్చించడం నుంచి దృష్టిని పేదరిక నిర్మూలనకు దోహదం చేసిన విధానాలను అర్థం చేసుకోవడం వైపు మళ్ళిస్తుంది. భల్లా తదితరులు (2022), రాయ్ అండ్ వాన్‌డెర్ వీడ్ (2025) గతంలో చేసిన పరిశోధనలను ఈ ఫలితాలు ధృవీకరిస్తాయి. గత దశాబ్దంలో భారతదేశ పేదరికం గణనీయంగా తగ్గిందనే నిర్ధారణను ఇది బలపరుస్తుంది. దీనికితోడు, పేదరికాన్ని నిర్మూలించినందున ఇక మధ్యతరగతిని బలోపేతం చేయడం, సుస్థిర ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. సమ్మిళిత వృద్ధిని సాధించడానికి లక్షిత సంక్షేమ పథకాలు, పెరిగిన వినియోగ సామర్థ్యం వంటి భారత్ అనుసరించిన ఆర్థిక వ్యూహాలు కీలకమని అధ్యయనం సూచిస్తుంది.

పేదరిక నిర్మూలనలో విజయం

ఈ అధ్యయనం భారతదేశంలో పేదరికం, అసమానతలు పెరుగుతున్నాయనే సాధారణ కథనాన్ని సవాలు చేస్తుంది. ఇందుకు భిన్నంగా తీవ్రమైన పేదరికం దాదాపు కనుమరుగైందని, పేదలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, అసమానతలు తగ్గుతున్నాయని ఇది బలమైన సాక్ష్యాలను అందిస్తుంది. పేదరికం, అసమానతలను తగ్గించడంలో భారత్ సాధించిన విజయం దేశంలో ఆర్థిక అసమానతలపై ఎంతోకాలంగా ఉన్న అంచనాలను సవాలు చేస్తోంది. భల్లా, భాసిన్‌ల అధ్యయనం పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే పద్ధతులను పునస్సమీక్షించాల్సిన అవసరాన్ని, ఆధునిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అధికారిక దారిద్య్ర రేఖలను సవరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. భారత్‌లో ఆర్థిక పరివర్తన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధనలు విధాన నిర్ణేతలకు, ఆర్థికవేత్తలకు చాలా ఉపయోగపడతాయి.

శశాంక్ కుమార్ ద్వివేది