bulb

ఉచిత విద్యుత్ రాజకీయాలకు సుస్థిర ప్రత్యామ్నాయం

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ప్రజలకు చేసే వాగ్దానాలు అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1 నుంచి 3 కిలోవాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్లను తమ ఇళ్లలోనే ఏర్పాటు చేసుకోవడానికి లబ్ధిదారులకు రూ.30,000 నుంచి రూ.78,000 వరకు రాయితీ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. ప్రజలు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడటాన్ని తగ్గించి దాదాపు 25 సంవత్సరాల పాటు వారికి ఉచిత విద్యుత్తు సరఫరా సౌకర్యం కల్పించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. 

ఇళ్లల్లో సౌర విద్యుత్ వెలుగులు 

ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఒక వినియోగదారుడు రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చుపెట్టి 1 కిలో వాట్ నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరఫలకాలను ఏర్పాటు చేస్తారు. ఈ పెట్టుబడితో నెలకు దాదాపు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీనితో చాలావరకు ఇంటి విద్యుత్ అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం సగటున విద్యుత్ యూనిట్‌కు రూ.8 ఖర్చవుతుంది అనుకుంటే నెలకు రూ.2,400 ఆదా అవుతుంది. పాతికేళ్లలో ఒక కుటుంబానికి దాదాపు రూ.7.2 లక్షల లబ్ధి చేకూరుతుంది. సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేయడానికి పెట్టిన పెట్టుబడి రెండేళ్లలోనే తిరిగి వస్తుంది. సౌర యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని కూడా రాయితీతో కూడిన ఏడు శాతం వడ్డీతో ప్రభుత్వమే అందించే ఏర్పాట్లు చేశారు. 

ఉచిత విద్యుత్ రాజకీయాలకు పరిష్కారం 

ఇటీవల కాలంలో అనేక రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత విద్యుత్తును హామీ ఇస్తున్నాయి. దిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేశాయి. జనాభాలో గణనీయమైన భాగానికి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఉదాహరణకు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 200 యూనిట్లు వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తోంది. 201 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. అయితే ఈ పథకాలకు అయ్యే ఖర్చు రాష్ట్ర బడ్జెట్లపై విపరీతమైన భారం మోపుతోంది. దిల్లీలో మొత్తం బడ్జెట్ రూ.78,800 కోట్లలో రూ.3,250 కోట్లు ఈ విద్యుత్ సబ్సిడీలకే కేటాయించాల్సి వచ్చింది. ఆప్ పాలనలో మూలధన వ్యయాల వృద్ధిరేటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఉన్న 19.6 శాతం నుంచి 9.2 శాతానికి క్షీణించింది. ఫలితంగా దిల్లీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కుంటుపడింది. కొత్త ప్రాజెక్టులు ఏమీ ప్రారంభించటం లేదు. ఉచిత విద్యుత్తు ఇస్తున్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్… ఈ రాష్ట్రాలన్నీ పెరిగిపోతున్న అప్పులతో సతమతమవుతున్నాయి. ఉచిత విద్యుత్తు పథకాలను అమలు చేయడం వాటికి తలకు మించిన భారంగా తయారైంది. కొన్ని సందర్భాల్లో రాష్ట్రాలు ఆర్థిక భారం కారణంగా సబ్సిడీలను తగ్గించడం లేదా ఈ పథకాలను పూర్తిగా వదిలివేయడం జరిగింది. 

ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయం 

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ఉచిత విద్యుత్ పథకాలకు సుస్థిరమైన ప్రత్యామ్నాయం. గృహ వినియోగదారులు ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్తు యూనిట్లతో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహించడం ద్వారా ఈ పథకం ప్రభుత్వ ఆర్థిక వనరులపై దీర్ఘకాలిక భారాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వ సబ్సిడీతో కలిసి ఒక కుటుంబం ఈ పథకంపై పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం రూ.1.5 లక్షలు. కోటి కుటుంబాలు ఈ పథకంలో భాగస్వాములు అయితే 30 గిగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడుతుంది. ఇది భారతదేశపు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ప్రభుత్వం ఏటా ఇచ్చే సబ్సిడీల ఆధారంగా నడిచే సంప్రదాయక ఉచిత విద్యుత్తు పథకాల మాదిరిగా కాకుండా సూర్య ఘర్ యోజన బడ్జెట్‌పై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. 

తమ ఇళ్లల్లో సొంతంగానే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం ద్వారా గృహ వినియోగదారులు ప్రభుత్వం ఏటా ఇచ్చే సబ్సిడీపై ఆధారపడనవసరం లేదు. అంతేగాక వారు దేశంలో కార్బన్ కాలుష్యాన్ని తగ్గించే కృషిలో భాగస్వాములు అవుతున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడం నికర కాలుష్య ఉద్ఘారాలను పూర్తిగా అరికట్టాలన్న భారత్ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు సైతం ఇది దోహదం చేస్తుంది. 

ఆర్థిక, పర్యావరణ ప్రభావం 

ఆర్థిక, పర్యావరణ రంగాలపై సూర్య ఘర్ యోజన విస్తృతమైన ప్రభావం చూపిస్తుంది. మొదటిది, గృహ వినియోగదారులకు ఇది విశ్వసనీయమైన ఉచిత విద్యుత్తు సరఫరాకు 20 ఏళ్లు పాటు హామీ ఇస్తుంది. దీనివల్ల ఇంధనం ఖర్చులు భారీగా ఆదా అవుతాయి. ప్రభుత్వాలపై భారీ సబ్సిడీల భారం కూడా తగ్గుతుంది. దానివల్ల ఆదా అయ్యే నిధులతో అత్యవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు అభివృద్ధి చేయవచ్చు. 

రెండవది, ఈ పథకం పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి లక్ష మందికి పైగా సిబ్బంది అవసరం. దీనికి అందించే శిక్షణ కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన జరగడమే కాకుండా పునరుత్పాదక ఇంధన రంగంలో ఒక నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అభివృద్ధి చెందుతుంది. 

మూడవది, సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడం ద్వారా సూర్య ఘర్ యోజన చమురు, బొగ్గు వంటి సాంప్రదాయక శిలాజ ఇంధనాలపై దేశం ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. వాతావరణ మార్పులపై మన దేశం చేసే పోరాటానికి ఇది మరింత బలం చేకూరుస్తుంది. 

ఇళ్ల కప్పులపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్ యూనిట్లు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే పర్యావరణహితమైన ప్రత్యామ్నాయం. వీటిని విస్తృతంగా ఏర్పాటు చేస్తే కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. సౌర విద్యుత్ పై పెట్టుబడి పెట్టేందుకు గృహ వినియోగదారులను ప్రోత్సహించడం ద్వారా ఈ పథకం రాష్ట్ర బడ్జెట్లపై భారాన్ని తగ్గించడమే కాకుండా భారత్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి కూడా తోడ్పడుతుంది. ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాల ఏర్పాటును విస్తృతంగా ప్రోత్సహిస్తే దేశ ఇంధన రంగంలో సమూలమైన పరివర్తన చోటు చేసుకుంటుంది. గృహాలకు చౌకగా, విశ్వసనీయమైన విద్యుత్తు లభించడమే కాకుండా దేశం కాలుష్యం కోరల నుంచి విముక్తి పొందుతుంది.

అశ్వని మహాజన్