ucc

ఉమ్మడి పౌరస్మృతి అనివార్యతను ఉద్ఘాటించిన అంబేద్కర్

వారసత్వ చట్టాల్లో సమానత్వాన్ని తీసుకురావడానికి వివక్షా పూరితమైన వ్యక్తిగత మత చట్టాలను కొట్టివేస్తూ గందరగోళాన్ని సృష్టించడం కంటే ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని అమలు చేయడం అత్యంత సమర్థమైన పరిష్కారమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం చేసిన ఈ ప్రతిపాదన, రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నాడు రాజ్యాంగ పరిషత్తులో వెల్లడించిన అభిప్రాయాలకు అద్దం పడుతోంది. రాజ్యాంగంలోని అధికరణ 35 (తర్వాతి కాలంలో అధికరణ 44) పై చర్చ జరుగుతున్నప్పుడు, “భారతదేశ భూభాగమంతటా పౌరులందరికీ ఒకే విధమైన పౌరస్మృతిని అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి” అనే ఆదేశిక సూత్రంపై అంబేద్కర్ కీలక ప్రసంగం చేశారు.

‌‌‌వ్యతిరేకత, సవరణ ప్రతిపాదనలు

నవంబర్ 23, 1948న రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, వ్యక్తిగత మత చట్టాలను అనుసరించడం ఒక వర్గానికి ప్రాథమిక హక్కు అని వాదిస్తూ, అధికరణం 35కు ఒక సవరణను ప్రతిపాదించారు. “చట్టం ద్వారా హామీ పొందిన ఏ వర్గం వ్యక్తిగత మత చట్టాన్నైనా, ఆ వర్గం ముందస్తు అనుమతి లేకుండా మార్చకూడదు” అని ఆయన కోరారు. మరో సభ్యుడు మహబూబ్ అలీ బేగ్ కూడా ఇదే విధమైన సవరణను ప్రతిపాదించారు. కేఎం మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్లతో పాటు అంబేద్కర్ కూడా ఈ సవరణలను తీవ్రంగా వ్యతిరేకించారు.

‌‌అంబేద్కర్ వాదన 

“మన దేశంలో మానవ సంబంధాలకు సంబంధించిన దాదాపు అన్ని అంశాలలో ఇప్పటికే ఏకరీతి చట్టాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వర్తించే శిక్షాస్మృతి (IPC), నేర స్మృతి (CRPC) వంటి పూర్తిస్థాయి క్రిమినల్ కోడ్‌లు ఉన్నాయి. ఆస్తి బదలాయింపు చట్టం వంటివి దేశమంతటా అమలులో ఉన్నాయి,” అని అంబేద్కర్ గుర్తుచేశారు. వివాహం, వారసత్వం మాత్రమే ఇప్పటివరకు సివిల్ చట్టం పరిధిలోకి రాలేదని, ఆ మార్పు తీసుకురావడమే అధికరణం 35 ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. భారతదేశంలోని ముస్లిం వ్యక్తిగత మత చట్టం ఎల్లప్పుడూ ఒకేలా, మార్పులేనిదిగా ఉండేదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. వాయువ్య సరిహద్దు ప్రాంతం నుంచి బొంబాయి వరకు అనేక ప్రాంతాలలో ముస్లింలు కొన్నిసార్లు హిందూ వారసత్వ పద్ధతులనే అనుసరించేవారని, 1937లో బ్రిటిష్ ప్రభుత్వం షరియా (ముస్లిం) చట్టాన్ని తప్పనిసరి చేసే వరకు ఇదే పరిస్థితి ఉండేదని ఆయన ఉదహరించారు. ఉత్తర మలబార్‌లో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ‘మరుమక్కతాయం’ అనే మాతృస్వామ్య చట్టాన్ని అనుసరించేవారని ఆయన పేర్కొన్నారు. “కాబట్టి, ముస్లిం మత చట్టం అనేది ప్రాచీన కాలం నుంచి వారు అనుసరిస్తున్న మార్పులేని చట్టం అని కచ్చితమైన ప్రకటన చేయడంలో అర్థం లేదు,” అని అంబేద్కర్ వాదించారు.

సంయమనం, భరోసా

అయితే, ఉమ్మడి పౌర స్మృతిని బలపరిచే ఇతరుల కంటే అంబేద్కర్ కొంత మెతక వైఖరిని ప్రదర్శించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే ఈ స్మృతిని అందరిపై బలవంతంగా రుద్దుతారనే భయాలను ఆయన తొలగించే ప్రయత్నం చేశారు. అధికరణ 35 అనేది ఒక ఆదేశిక సూత్రం మాత్రమేనని, అది వెంటనే అమల్లోకి వచ్చే చట్టం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభ దశలో దీనిని స్వచ్ఛందంగా ఉంచవచ్చని ఆయన సూచించారు. “భవిష్యత్తులో పార్లమెంటు ఒక నిబంధనను తీసుకురావచ్చు. ఈ స్మృతికి కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించే వారికి మాత్రమే ఇది వర్తించేలా ప్రారంభించవచ్చు. తద్వారా ప్రారంభ దశలో దీని వర్తింపు పూర్తిగా స్వచ్ఛందంగా ఉంటుంది,” అని ఆయన చెప్పారు. అంబేద్కర్‌ వాదనలతో ఏకీభవించిన రాజ్యాంగ పరిషత్తు, సవరణలను తిరస్కరించి UCCని రాజ్యాంగంలో చేర్చింది.

మతం, సామాజిక చట్టం మధ్య సరిహద్దు

డిసెంబర్ 2, 1948న ఖాజీ సయ్యద్ కరీముద్దీన్ ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతూ, UCC మత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తుందని వాదించారు. దీనికి సమాధానంగా, మతానికి, సివిల్/సామాజిక చట్టానికి మధ్య స్పష్టమైన సరిహద్దు ఉండాలని అంబేద్కర్ కోరారు. “ఈ దేశంలో మతపరమైన భావనలు పుట్టుక నుండి చావు వరకు జీవితంలోని ప్రతి అంశానికి వర్తిస్తాయి. మతం కానిది ఏదీ లేదు అన్నట్టుగా ఉంది. ఒకవేళ వ్యక్తిగత మత చట్టాలను అలాగే వదిలేస్తే, సామాజిక విషయాల్లో మనం ముందుకు కదలకుండా నిలిచిపోతాం. జీవితమంతటినీ ఆవరించేలా మతానికి ఇంత విస్తృతమైన పరిధిని ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. చట్టసభ ఆ రంగంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం సరికాదు. అసలు మనం ఈ స్వేచ్ఛను దేని కోసం పొందుతున్నాం?” అని ఆయన ప్రశ్నించారు. ముస్లిం సమాజానికి భరోసా ఇస్తూ, ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించే అధికారం రాజ్యానికి ఉన్నంత మాత్రాన, సామాజిక పర్యవసానాలను పట్టించుకోకుండా దానిని తక్షణమే రుద్దుతారని అర్థం కాదని ఆయన అన్నారు. “ఏ ప్రభుత్వమూ ముస్లిం సమాజాన్ని తిరుగుబాటుకు ప్రేరేపించే విధంగా తన అధికారాన్ని చెలాయించదు. అది అధికారాన్ని వినియోగించే పద్ధతికి సంబంధించిన విషయమే తప్ప, అధికారం ఉందా లేదా అనే దానికి సంబంధించింది కాదు,” అని అంబేద్కర్ ముగించారు. అంటే కొంతకాలం గడిచిన తర్వాత UCC ని అమలు చేసే అధికారం ప్రభుతానికి ఉందన్న విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు.

వికాస్ పాఠక్