SEM

6 గ్యారంటీలు, 66 వాగ్దానాల అమలు కోసం ఉద్యమం

State Exucutive Meeting(జూలై 12న రంగారెడ్డి రూరల్ జిల్లా శంషాబాద్ లో జరిగిన బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమోదం పొందిన రాజకీయ తీర్మానం)

దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ పదేళ్ల కేసీఆర్‌ అహంకారపూరిత పాలనలో పూర్తిగా ధ్వంసమైంది. బీఆర్‌ఎస్‌ నియంతృత్వ పాలనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ప్రజలకు 6 గ్యారంటీల పేరుతో అలవికాని హామీలు గుప్పించడంతో పాటు బిజెపి, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని పెద్ద ఎత్తున విష ప్రచారం చేసిన కాంగ్రెస్‌ గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగింది. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని వాగ్దానం చేసి, ఓట్లు దండుకుని తెలంగాణ ప్రజలను మోసం చేసింది. రేవంత్‌ రెడ్డికి ప్రజల సమస్యలను పరిష్కరించడం కన్నా సీఎం కుర్చీని కాపాడుకోవడమే ముఖ్యమైన పనిగా మారింది. అటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని ఆశిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మంత్రులు సైతం తమకు అనుకూలంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతర్గత పోరులో పైచేయి సాధించాలన్న ప్రభుత్వ పెద్దల తాపత్రయం కారణంగా పాలన పూర్తిగా పడకేయడంతో ప్రజల పరిస్థితి పెంక మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు నమ్మి వంచనకు గురైన మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్లు సహా యావత్‌ తెలంగాణ ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేయాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నది.

రుణమాఫీ వాయిదా

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9న సోనియా గాంధీ జన్మదిన కానుకగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసింది. పార్లమెంట్‌ ఎన్నికలొచ్చేసరికి ఆగస్ట్‌ 15లోపల రుణమాఫీ చేస్తామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. దేవుడిపై ఒట్టు పెడుతూ సాకులు చెప్తున్నారే కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయడం లేదు. దీంతో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకు రుణం మాఫీ కాక, ప్రైవేటులో తెచ్చే అధిక వడ్డీలు కట్టలేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

రైతు భరోసా ఏది..?

‘రైతు భరోసా’ కింద ఏడాదికి ఎకరాకు రూ. 15 వేలు చొప్పున రైతులకు మరియు కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థికసాయం చేస్తామని కాంగ్రెస్‌ గ్యారెంటీ గారడిగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా ‘రైతు భరోసా’ అమలు దిశగా ముందడుగు పడలేదు. ఈ వానకాలమైనా పెట్టుబడి సాయం అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. అర్హుల ఎంపిక పేరిట కమిటీ వేసి కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌ సర్కారు ‘రైతు భరోసా’ను అటకెక్కించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులతోపాటు కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

రాష్ట్రంలో వడ్లకు ఎంఎస్పీపై క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్యారంటీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటూ మెలిక పెడుతోంది. ఇది ముమ్మాటికి రైతులను వంచించడమే. కాంగ్రెస్‌ గ్యారంటి మేరకు అన్ని రకాల వడ్లకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పై రూ.500 బోనస్‌ ఇవ్వాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మిగతా పంటలకు కూడా బోనస్‌ ప్రకటించాలని బిజెపి డిమాండ్‌ చేస్తోంది.

విద్యార్థులకు ఇచ్చిన యువ వికాసం గ్యారెంటీ

‘యువ వికాసం’ కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఇంతవరకు దాని ఊసే మరచిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆశలు అడియాసలే అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్న కాంగ్రెస్‌ హామీ నీటి మీది రాతగానే మిగిలిపోయింది. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.4 వేల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి భ్రాంతిగానే మారిపోయింది. హామీ మేరకు తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటించి, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

క్షీణించిన శాంతి భద్రతలు

రాష్ట్రంలో శాంతి భద్రతల అమలులో కాంగ్రెస్‌ సర్కారు ఘోర వైఫల్యం చెందింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాటలోనే నడుస్తూన్న కాంగ్రెస్‌ ఆదాయం కోసం మద్యం అమ్మకాల పైన ఆధారపడింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చి, అమలును విస్మరించింది. తెలంగాణ అంతటా రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోయాయి. తెలంగాణలో మైనర్‌ బాలికలపై అత్యాచారాలు, పసికందుల అక్రమ రవాణా, మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. కరీంనగర్‌, హైదరాబాద్‌, నాగర్‌ కర్నూలు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. హైదరాబాద్‌ పాతనగరంలో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యక్ష దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ విద్యార్థులు, మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాలను అడ్డుకునేందుకే పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప.. శాంతిభద్రతలను కాపాడటంలో ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతాంశంగా శాంతిభద్రతలపై సమీక్షించి, వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది బెల్ట్‌ షాపుల మూసివేతతో పాటు మహిళలకు భద్రత కల్పించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

గ్రామ పంచాయతీలకు గ్రహణం

కాంగ్రెస్‌ పాలనలోనూ పంచాయతీరాజ్‌ వ్యవస్థ కుప్పకూలింది. సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరిలో, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం జూలైలో పూర్తయింది. రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారంలో సకాలంలో ఎన్నికలు జరపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలకే పరిమితమవుతుంది తప్ప, ఎన్నికల నిర్వహణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నిధులు ఇవ్వక, చేసిన పనులకు బిల్లులు చెల్లించక సర్పంచులను అరిగోస పెట్టింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులును సైతం పక్కదారి పట్టించడంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నెలకొంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పేరుకుపోయిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

ధరణి ప్రక్షాళన ఎప్పుడు?

భూరికార్డుల ప్రక్షాళన పేరుతో ధరణి పోర్టల్‌ ప్రవేశపెట్టిన గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లక్షలాది మంది రైతులు తమ భూమిపై హక్కులు కోల్పోయేలా చేసింది. శాసనసభ ఎన్నికల వేళ ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌ ను తీసుకొస్తామని, ధరణిలో ఉన్న 6 లక్షలకు ఉన్న ఫిర్యాదులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పటివరకు కమిటీల పేరుతో కాలయాపన చేసింది తప్ప కార్యాచరణలో ఒక్క అడుగూ ముందుకు వేయలేదు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆక్రమణలకు పాల్పడ్డవారిని జైలుకు పంపిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ధరణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ధరణిని అడ్డుపెట్టుకుని కబ్జాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది. 

పునాది పడని ఇందిరమ్మ ఇళ్లు

గత 10 సంవత్సరాలుగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పేరుతో అనేకసార్లు ఓట్లు వేయించుకుని అధికారం వెలగబెట్టిన బీఆర్‌ఎస్‌ బాటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్నది. ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఒక్క ఇంటికి కూడా పునాది వేయలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను పూర్తిచేసి, లబ్ధిదారులకు పంపిణీ విషయంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటతప్పింది. తెలంగాణ ప్రజలకు ఇండ్లు ఇస్తారా? ఎప్పుడిస్తారు? ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాలకు సంబంధించిన చర్యల్లో ఏమాత్రం కదలిక లేదు. ఇండ్ల విషయంలో పేదల పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని అద్దం పడుతోంది. గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించి, కొత్తగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలంతో పాటు, రూ.5 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన విధివిధానాలను వెంటనే ప్రకటించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.  

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరిట భారీ ఎత్తున అవినీతికి పాల్పడిరది. లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని కమిషన్ల రూపేణా తమ ఖజానా నింపుకొంది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్ల అప్పు తీసుకుంది. ఇందులో రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చూపినా అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయం అనడానికి ఇటీవల మేడిగడ్డ బ్యారేజీలో కూలిన పిల్లర్లే సాక్ష్యం. పంప్‌ హౌజ్‌ మునిగిపోవడం, బ్యారేజీల లీకేజీలు, సీపేజీలు, బుంగలు ఏర్పడడం వంటివి సర్వసాధారణంగా మారింది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ ను నియమించింది. ఈ కమిషన్‌ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అవినీతికి పాల్పడ్డ వారిని ఇంతవరకు గుర్తించనే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక సహకారం ఉన్నందున సమగ్ర దర్యాప్తు జరిపి అవినీతి నిగ్గు తేల్చి, దోషులును గుర్తించాలంటే సీబీఐ దర్యాప్తు ద్వారానే సాధ్యమవుతుంది. అందుకోసం జ్యుడిషియల్‌ కమిషన్‌ తో పాటు, ప్రాజెక్టులో అవినీతి నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేయించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

ఫోన్‌ ట్యాపింగ్‌ అక్రమాలు

సంచలనం సృష్టించిన టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే 11 మందికి పైగా పోలీసు అధికారులు అరెస్టయ్యారు. బీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగం చేసి ఈ ఫోన్‌ ట్యాపింగ్‌లను తమ రాజకీయ అస్త్రంగా వాడుకున్నది. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, సినీరంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో హైకోర్టు జడ్జిలు, ప్రభుత్వ అధికారులు కూడా బాధితులు కావడం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార వ్యవస్థలను ఎంత దుర్వినియోగం చేసిందో అర్థమవుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా వ్యక్తిగత జీవితంలోకి, చివరకు బెడ్‌ రూమ్‌ లోకి చొచ్చుకెళ్లి వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా తూట్లు పొడిచింది. ఇంతటి తీవ్రమైన అంశాన్ని నీరుగారుస్తూ దీనిని రాజకీయ బేరసారాల కోసం వాడుకోవడం కాంగ్రెస్‌ కుత్సిత బుద్ధికి పరాకాష్ట. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల ఉల్లంఘనకు చెందిన అంశం కాబట్టి దీనిపై వెంటనే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని, ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వెనక ఉన్న వ్యక్తులను, శక్తులను గుర్తించి, తగిన శిక్ష పడేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కాలంలో జరిగిన విద్యుత్‌ కొనుగోళ్లలో, విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అవకతవకలపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జితో వేసిన కమిషన్‌ దర్యాప్తును వేగవంతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేస్తోంది. ఇందులో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రమోయం ఉన్నందున జ్యుడిషియల్‌ కమిషన్‌ దర్యాప్తును వేగవంతం చేయించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది. 

ధాన్యం కుంభకోణం

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నాయకుల అండదండలతో చెలరేగిన కొంతమంది రైస్‌ మిల్లర్ల రూ.వేలకోట్ల అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎఫ్‌.సి.ఐ. కోసం సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఇవ్వడంలో రైస్‌ మిల్లర్లు పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. దీంతో పాటు గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద కేంద్రం ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్‌ చేస్తూ అక్రమాలకు తెరదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. వడ్ల సేకరణ నుంచి బియ్యం పంపిణీ వరకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి దోషులను వెంటనే శిక్షించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది. 

గొర్రెల పంపిణీ స్కాం

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అని చెప్పుకున్న గొర్రెల పంపిణీ పథకం పెద్ద మోసం. కేంద్రప్రభుత్వ ఎన్సీడీసీ నిధులను పెద్దఎత్తున దుర్వినియోగం చేసింది. గొర్రెల కొనుగోళ్లలోజరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గొర్రెలు కొనకుండానే కొన్నట్టు, లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే చేసినట్టు కాగితాలపై లెక్కలు చూపి పెద్దఎత్తున అక్రమాలకు తెరతీశారు. గొర్రెల రీసైక్లింగ్‌ ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్టు కాగ్‌ నివేదిక తేల్చింది. 2017 నుంచి అమలవుతున్న ఈ పథకం అక్రమాల్లో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు, ఉద్యోగులు భాగస్వాములుగా ఉన్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అక్రమాలు చోటుచేసుకున్న  గొర్రెల పంపిణీ స్కాంలో అవినీతిని పూర్తిస్థాయిలో వెలికితీసి, అక్రమార్కులకు తగిన శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది. 

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన మైనింగ్‌ మాఫియా, డ్రగ్స్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా, ల్యాండ్‌, సాండ్‌ మాఫియా, గ్రనైట్‌ మాఫియా వంటి అనేక అంశాలలో బాధ్యులైన ప్రభుత్వంలోని పెద్దలను, అధికారులను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ వాగ్ధానం మేరకు అన్ని స్కాంలపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

రేషన్‌ కార్డులు

బీఆర్‌ఎస్‌ పదేండ్ల కాలంలో తెలంగాణలోని నిరుదపేదలకు కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వకుండా దగా చేసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడంలో తీవ్రమైన జాప్యం చేస్తోంది. కొత్త రేషన్‌ కార్డులు లేనందున నిరుపేదలు గ్యాస్‌ కనెక్షన్‌, ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం ఆవాస్‌ యోజన వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత పొందలేకపోతున్నారు. ఇప్పటికే పెండిరగ్‌ లో ఉన్న 22 లక్షలకు పైగా కొత్త రేషన్‌ కార్డుల కోసం ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులైన వారికి రేషన్‌ కార్డులు ఇవ్వాల్సిందిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

ఆయుష్మాన్‌ భారత్‌

తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ పథకాన్ని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించనందున ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ రోగులకు ట్రీట్‌ మెంట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్య శ్రీని రూ. 10 లక్షలకు పెంచినప్పటికీ బకాయిలు చెల్లించకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదని బిజెపి రాష్ట్ర కార్యవర్గం భావిస్తూ, వెంటనే పెండిరగ్‌ బకాయిలు చెల్లించి, ఆయుష్మాన్‌ భారత్‌ తో పాటు ఆరోగ్య శ్రీని పూర్తిస్థాయిలో పేదలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేస్తోంది.

ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ బకాయిలు

తెలంగాణలో గత పదేండ్లుగా విద్యావ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లించకుండా నాటి బిఆర్‌ఎస్‌ మోసం చేస్తే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే పంథాను అవలంభిస్తూ విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేస్తోంది. సకాలంలో ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు, విద్యా సంస్థలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయెంబర్స్‌మెంట్‌ వెంటనే చెల్లించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది.

జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల అభివృద్ధి పనుల నత్తనడక నడుస్తున్నాయి. జిహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి దాపురించింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండిరగ్‌ బిల్లులతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు, వాటికి అనుబంధంగా ప్రకటించిన 66 వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌ చేస్తోంది. హామీల అమలులో వైఫల్యం చెందిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మెడలు వంచేలా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బిజెపి రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై తెలంగాణ ప్రజలు కూడా ముందుకువచ్చి కాంగ్రెస్‌ పార్టీని నిలదీయాలని  ప్రజలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేస్తోంది.