ఆర్థిక క్రమశిక్షణ, ప్రగతిశీల కేంద్ర బడ్జెట్ – రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లే
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ ఏడాది అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్రం మధ్యంతర బడ్జెట్, పూర్తి బడ్జెట్ లు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ మధ్యంతర, పూర్తి బడ్జెట్ లో దాదాపు లక్ష కోట్ల రూపాయల అంచనా పెరుగుదల దేశ ఆర్థిక ప్రగతిని సూచిస్తున్నది. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ ఈ ఏడాది 9 ప్రధాన లక్ష్యాలను ఉటంకించి, కేటాయింపులు జరిపారు.
మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు, మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు, పట్టణ గృహనిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు, విద్య నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్ల కేటాయింపులతో ప్రధాన అంశాలకు సరైన కేటాయింపులు జరిపినట్టయింది. కోటి ఇళ్లకు సోలార్ ప్యానల్ ల ద్వారా ఉచిత విద్యుత్, 5 వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు, ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు, వంద కోట్ల రుణాలిచ్చే కొత్త పథకం, ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడం, దేశంలో చిన్న ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహకం, యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజీ వంటివి దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా ఉన్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంపు, ఇన్ కమ్ టాక్స్ స్లాబుల్లో సముచిత సవరింపు, మధ్యతరగతి, ఇతర వేతన జీవులకు ఊరటనిచ్చింది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, ఇతర దేశాల్లో భారత పెట్టుబడుల విధానాల్లో సరళీకరణ, జన విశ్వాస్ బిల్లు, భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రతి భూకమతానికి భూ ఆధార్ ద్వారా గుర్తింపు, కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక, శాశ్వత, ప్రయోజన విధానాలకు అద్దం పడుతుంది.
తెలంగాణ విషయానికి వస్తే గత పదేళ్లుగా కేసీఆర్ చేస్తున్న మోసాన్నే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఈ బడ్జెట్ చెబుతోంది. హామీల సాలెగూడులో చిక్కుకున్న రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై నీలాపనిందలు వేయడం, కాంగ్రెస్ ప్రభుత్వ పచ్చి అవకాశవాద రాజకీయాలను ప్రతిబింబిస్తోంది. సోనియా భజనతో బడ్జెట్ ఉపన్యాసం మొదలుపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తదనంతరం నెహ్రూ, రాజీవ్ పేర్లతో నెహ్రూ కుటుంబ భజనగా బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. ఏదోవిధంగా ఎన్నికల్లో గెలవాలని అలవి కాని హామీలిచ్చిన కాంగ్రెస్, అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దీనస్థితిలో ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్ర బడ్జెట్ లో ప్రతిబింబించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ ప్రభుత్వంలోని అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ రూ.2.25 లక్షల కోట్లకు మించి ఖర్చు చేయలేదు. అంటే రూ.65వేల కోట్ల అధిక బడ్జెట్ ను గత సంవత్సరం ప్రవేశపెట్టారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ.50వేల కోట్లకుపైగా లేని ఆదాయాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ మోసపూరిత డొల్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ మోసానికి ఉదాహరణ ‘మన ఊరు – మన బడి’కి వేల కోట్ల కేటాయింపు చేసినా, పెట్టిన ఖర్చు సున్నా. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ లో రూ.50వేల కోట్లకుపైగా 6 గ్యారంటీలకు సూచించినా పూర్తి బడ్జెట్ లో మాత్రం 6 గ్యారంటీల ఊసే లేదు. రైతు భరోసాకు కేటాయింపు లేదు. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్ ల పెంపు ముచ్చటే లేదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ విద్యావ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ విద్యాశాఖకు సరైన కేటాయింపులు లేవు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ 1 శాతం, బీసీలకు 5 శాతం లోపు కేటాయింపులు జరపడం ఈ వర్గాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యానికి నిదర్శనం. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.30వేల కోట్లు కేటాయించినప్పటికీ గ్రామ పంచాయితీలకు అవి చేరుతాయన్న నమ్మకం గత ప్రభుత్వాన్ని చూశాక ఇప్పుడు కలగడం లేదు. తెలంగాణలోని గ్రామాల్లో వేసిన సీసీ రోడ్లు, స్మశాన వాటికలు, రైతు వేదికలు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. గ్రామపంచాయితీలకు కూడా కేంద్రమే నిధులు సమకూరుస్తున్నది, రాష్ట్రం మొండిచేయే చూపిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి దేశ రక్షణ స్థాయి వరకు పకడ్బందీ ప్రణాళికతో, ఆర్థిక క్రమశిక్షణతో, ప్రగతిశీల విధానాలతో ప్రణాళికలు, బడ్జెట్ లు రచించి అమలు చేస్తుంటే, గత కేసీఆర్ ప్రభుత్వంలాగే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక ప్రణాళిక లేకుండా, ఆదాయానికి మించి అంచనాలను చూపిస్తూ మోసపూరిత బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ కోవలోనిదే ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ కూడా.

