Maheshwar Reddy

అసెంబ్లీలో గళమెత్తిన బిజెపి ఎమ్మెల్యేలు

మూసీ ప్రక్షాళన పెద్ద కుంభకోణమని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మూసీ సుందరీకరణపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్ లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడుకున్నట్లే మూసీని కాంగ్రెస్ సర్కార్ ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఎవరికి కమిషన్లు ఇవ్వడానికి లక్ష కోట్లతో మూసీనదిని అభివృద్ధి చేస్తామంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుట్రలో తమను భాగం కావాలని పిలుస్తున్నారని మండిపడ్డారు. సరైన ప్రతిపాదనలు ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్క దారి పట్టిస్తున్నదని నిప్పులు చెరిగారు.

బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని భావిస్తే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “తెలంగాణకు కేంద్రం అన్యాయం చేయలేదు. విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు. అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్ పథకం కింద కేంద్రం రూ.4500 కోట్లు ఇస్తే రాత్రికి రాత్రే మాయం చేశారు. అవి ఏమయ్యాయో చెప్పండి. కేంద్రం ట్రిపుల్ ఆర్ కు రూ.26వేల కోట్లు ఇచ్చింది. ట్రిపుల్ ఆర్ తో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి” అని అన్నారు.

ధరణి పోర్టల్‌ ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”తెలంగాణ ఏర్పాటు తరువాత 40 శాతం దేవాదాయ, వక్ఫ్‌ బోర్డు భూములు మాయమయ్యాయి. పేదలను బెదిరించి గులాబీ నేతలు ఎసైన్డ్‌ భూములను తమ పేర్లపై రాయించుకున్నారు. భూముల సర్వే అని చెప్పి విలువైన భూములను వారు కాజేశారు. రెవెన్యూ మంత్రిగా కేసీఆర్, ఐటీ మంత్రిగా కేటీఆర్‌ ఉన్న సమయంలోనే భూములు మాయమయ్యాయి. దేశంలోనే అతిపెద్ద అవినీతి ఇది. భూదాన్, ఎసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములు లక్షల ఎకరాల్లో మాయమయ్యాయి. దీనిపై ప్రభుత్వం విచారణ నిర్వహించాలి. ప్రభుత్వం సరేనంటే 24 గంటల్లో కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించేలా మేం సహకరిస్తాం. పేదల భూములను ధరణి పోర్టల్‌ పేరుతో కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు వారి పేర్లపైకి మార్చుకున్నారని ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ చెప్పారు. వారు దోచుకున్న సొమ్మును రికవరీ చేసి ఆరు గ్యారంటీల అమలుకు వినియోగిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆ భూముల లెక్కలు తేల్చారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలి. ధరణి పోర్టల్‌ను నాడు విదేశీ కంపెనీకి అప్పగించారు. ఆ పోర్టల్‌ నిర్వహిస్తున్న వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ధరణిని భూమాతగా మార్చుతారా లేదా? రాష్ట్రంలో భూ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ ఊసేలేదు. రాష్ట్రంలో సమగ్ర సర్వే నిర్వహించాలి. భూముల నిర్వహణను ఎన్‌ఐసీకి అప్పగించాలి. రుణమాఫీకి దాదాపు రూ.40 వేల కోట్లు అవుందని గతంలో సీఎం చెప్పారు. తరవాత రూ.31 వేల కోట్లు కావాలన్నారు. బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లే కేటాయించారు. మొత్తం 70 లక్షల మంది రైతు రుణ ఖాతాలుంటే 44 లక్షల ఖాతాలకు మాఫీ చేస్తామంటున్నారు. అంటే 26 లక్షల మందికి మాఫీ జరగకుండా చేస్తారా? ప్రతి కౌలు రైతుకు రూ.15 వేలు ఇస్తామని చెప్పినందున వారికి రూ.20 వేల కోట్లు కేటాయించాలి. రైతు కూలీకి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్నారు. ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామన్నారు. వీటన్నింటికీ బడ్జెట్‌లో కేటాయింపులు లేవు” అని అన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగుల యువతలో స్కిల్స్ ను డెవలప్ చేయకపోవడంతో తమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం ఉన్న యువత లభించక ప్రైవేటు రంగం ఇబ్బందులు పడుతుందన్నారు. ”దేశంలో సంప్రదాయ యూనివర్శిటీల కన్నా ఇలా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు రావాలన్న ఆలోచన మొదట ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు చేసింది. 2014లోనే మోదీ ప్రభుత్వం కేంద్రంలో తొలిసారిగా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రీనర్షిప్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడమే ఈ మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే గుజరాత్ , హర్యానా, అస్సాం, బెంగాల్, దిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్శిటీలున్నాయి. ఇలాంటి స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయడంలో గత ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రానికి ప్రాధాన్యత రంగాలేవో గుర్తంచడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఆ లోపాన్ని సరిచేస్తూ ప్రస్తుత సర్కారు పూర్తి ప్రభుత్వ రంగ యూనివర్శిటీ కాకపోయినా ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఈ యూనివర్శిటీ ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. మొన్న ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనమిక్ అవుట్ లుక్ నివేదికలో తెలంగాణలో ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడిన వారు 46 శాతం ఉన్నారు. ఉత్పత్తి రంగంపై 21 శాతం, సేవల రంగంపై 33 శాతం ఆధారపడి ఉన్నారు. ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగంపై పడుతున్న భారాన్ని తగ్గించాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుకోవడానికి వీలుంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి అనువైన మార్గం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం. తద్వారా రైతులు పండించిన పంటలు వృథా కాకుండా కాపాడవచ్చు కూడా.

కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో ఆదిలాబాద్, నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ హామీని అమలు చేయడంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్శిటీ శాఖలను కొన్ని కోర్సుల్లో అయినా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పై ఆసక్తి ఉన్న యువత కోసం నెహ్రూ మండల్ యూత్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రూ.12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు అంబేద్కర్ అభయ హస్తం పేరుతో గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధుకు బదులుగా సమగ్రమైన పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాటిచ్చింది. దానికి బడ్జెటులో తగిన నిధులు కేటాయించలేదు. అలాగే కాంగ్రెస్ యూత్ డిక్లరేషనులో కూడా యువతకు స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణసదుపాయం కల్పిస్తామని ఇచ్చిన హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.” అని అన్నారు.

మరో సందర్భంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పలు కోర్టులకు సొంత భవనాలు లేవని, సదుపాయాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని, అన్ని కోర్టులకూ నూతన భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు.

హామీలను ఎలా అమలు చేస్తారు?: పాయల్ శంకర్

‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కనీసం రూ.9 లక్షల కోట్లు కావాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌ హామీలను ఎలా అమలు చేస్తారు’ అని బిజెపి శాసనసభాపక్ష ఉప నేత, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ప్రశ్నించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని పదే పదే అడుగుతున్నారు. బడ్జెట్‌లో తెలంగాణ పేరు చదవలేదని అంటున్నారు. మరి రాష్ట్ర బడ్జెట్‌లో ఎన్ని జిల్లాల పేర్లు చదివారు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానిని కలిసి అడగగానే రక్షణ శాఖ భూముల్ని బదలాయించలేదా? రైల్వే కోచ్‌ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 120 ఎకరాలు కేటాయించాల్సి ఉన్నా ఇంతవరకు చర్యలు చేపట్టకుండా కేంద్రంపై నెపం వేస్తున్నారు. ఇటీవలే పీఎంను పెద్దన్న అని పొగిడి.. ఇప్పుడు తీర్మానాలు చేయడం బాధ కలిగిస్తోంది’ అని పాయల్‌ శంకర్‌ పేర్కొన్నారు. ”గత బీఆర్ఎస్ ప్రభుత్వ బడ్జెట్‌కు, ప్రస్తుత బడ్జెట్‌కు పెద్ద తేడా ఏమీ లేదు. మద్యం ద్వారా ఆదాయాన్ని రూ.7 వేల కోట్లకు పెంచుకోవాలని చూస్తుండటం ఒక్కటే తేడా. మద్యం వల్ల సంభవిస్తున్న మరణాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అధ్యయనాలు చాటుతున్నాయి. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెబుతూనే.. మరోవైపు మద్యం తాగడాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తారా? ఎన్నికలకు ముందు అన్ని పంట ఉత్పత్తులకు బోనస్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న రకం వడ్లకే అని ఎలా అంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లను పట్టించుకోకపోవడంతో వట్టిపోయాయి. నిధులు లేకపోతే కార్పొరేషన్లు ఎందుకు? లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న ఫీజులపై దృష్టి పెట్టాలి. బోధన రుసుముల బకాయిలు చెల్లించాలి. ఆలయాలు నిర్మించుకున్న వారికి ‘కామన్‌ గుడ్‌ ఫండ్‌’ మంజూరు చేయాలి. గత ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు – మన బడి పథకం నిర్మాణాల్లో బిల్లులు రానివారికి నిధులు విడుదల చేయాలి. ఆదిలాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి కేంద్రం రూ.130 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో పూర్తికాలేదు. వైద్యులను కూడా నియమించడం లేదు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు రక్షణ శాఖ ముందుకొచ్చింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. పంటల బీమా పథకానికి ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని పాయల్‌ శంకర్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ : వెంకటరమణా రెడ్డి

రాష్ట్ర బడ్జెట్ అంతా అంకెల గారడీలా ఉందని బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అసెంబ్లీలో ప్రసంగిస్తూ విమర్శించారు. పేదలకు ఉపయుక్తంగా పథకాలను రూపొందించాలని సూచించారు. విద్యుత్ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కొత్త జిల్లాలకు తగ్గట్లు విద్యుత్ డిపోలను ఏర్పాటు చేయలేదని, ట్రాన్స్ ఫార్మర్ల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగల తొలగింపు అన్నది చాలా పెద్ద సమస్యగా ఉందని, తీగలున్న విషయం అన్ని శాఖల అధికారులకు తెలుసని, అయినా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారని అన్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల తీరు ఆదర్శవంతంగా లేదని, హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసుడు సరికాదని వెంకట రమణా రెడ్డి అన్నారు. ఇప్పుడన్నీ ప్రీపెయిడ్లు అయిపోయాయని, ఫోన్ల రీచార్జ్ కూడా ప్రీపెయిడ్ చేసి వాడుకుంటున్నామని చెప్పారు. కరెంట్ స్మార్ట్ మీటర్లు పెట్టుకుంటే ఎంత కావాలో ముందే కొనుక్కునేందుకు అవకాశం ఉంటుందని, ఫలితంగా నష్టాలూ తగ్గుతాయని అన్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదన్నది నిజం కాదని, ఫ్రీ కరెంట్ ఇవ్వొచ్చని అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు హౌస్ కమిటీకి ఒప్పుకుంటున్నందున.. హౌస్ కమిటీని వేసి విద్యుత్ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులకు కావాల్సిన కరెంట్ సామగ్రి అందట్లేదని చెప్పారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారుగానీ, కరెంట్ డిపోలను మాత్రం పెట్టలేదన్నారు. ప్రతి జిల్లాకో కరెంట్ డిపోను ఏర్పాటు చేయాలని కోరారు. ట్రాన్స్ ఫార్మర్ల కోసం రైతులు విజ్ఞప్తి చేసినా ఇచ్చే పరిస్థితి లేకుండాపోయిందన్నారు. ప్రభుత్వ స్థలమా, ప్రైవేటు స్థలమా అన్నది తేల్చకుండానే.. అక్కడ నిర్మాణాలు చేస్తారా చెయ్యరా అనేది తెలుసుకోకుండానే కరెంట్ పోల్స్ వేసి తీగలను వేశారని చెప్పారు. మీటర్ రీడింగ్ తీస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం విడుదల చేయదా?: ధన్‌పాల్‌ 

వివిధ పథకాలు, మున్సిపాలిటీలకు కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదని బిజెపి ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా ప్రశ్నించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ… ”తెలంగాణలో పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. చిన్న మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలి. పట్టణాల్లో సరిపడా కార్మికులు లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో ప్రజలపై పన్నుల భారం పడటం తప్ప ఒరిగిందేమీ లేదు. రాష్ట్ర అభివృద్ధికి గేమ్‌ఛేంజర్‌లా ఉపకరించే ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌)కి నిధులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో తీర్మానం చేయాలి. నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్‌) కింద నిధులు విడుదల చేయడం లేదు. కొడంగల్‌కు ఇస్తున్న నిధుల్లో 10 శాతమైనా మా నియోజకవర్గాలకిస్తే చాలు. నిజామాబాద్‌లోని ఐటీ హబ్‌ చాలా వరకు ఖాళీగా ఉంది. అక్కడికి ఎక్కువ పరిశ్రమలను వచ్చేలా ప్రభుత్వం చూడాలి. నిజామాబాద్‌లో గత ప్రభుత్వం మూడేళ్ల కిందట నిర్మించిన 400 రెండు పడక గదుల ఇళ్లను పేదలకు ఇవ్వాలి” అని కోరారు. 

వివక్ష వీడండి.. లేదంటే మహారాష్ట్రలో కలపండి: పాల్వాయి హరీశ్‌బాబు

సాగునీటి రంగం, సివిల్ సప్లైస్ పై జరిగిన పద్దుల చర్చ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు నిధులు కేటాయించని పక్షంలో పక్కనే ఉన్న మహారాష్ట్రలో కలిపేయమని డిమాండ్ చేశారు. తమ ఆవేదనను సభ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నామని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం శాసనసభ కమిటీ వేయాలని, వెనకబాటుతనంపై అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు సూచించాలని కోరారు. అలాగే తుమ్మిడి హెట్టి వద్ద డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, ఆడ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పిపిరావు ప్రాజెక్టు పూడిక తీసి 11 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం కేవలం దక్షిణ తెలంగాణకు నీళ్లు తరలించి ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని, వాటిని సవరించాలని కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు రోడ్ల నిర్మాణం కోసం రూ.12 కోట్ల నిధులు అటవీ శాఖకు చెల్లించాలని కోరారు.

మరో సందర్భంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఇప్పటివరకు కుక్కకాట్ల వల్ల 15 మంది చనిపోయారని, ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. కుక్కల వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల గురించి ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించారు. రాబోయే 35 ఏళ్లలో హైదరాబాద్‌ జనాభా రెట్టింపు కాబోతోందని, దీనికి తగ్గట్టుగా నగరంలో మౌలిక వసతులు పెంచాలని కోరారు.

అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలి : పైడి రాకేష్ రెడ్డి

అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలని బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ… “పేదలకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేని వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు. ఆర్మూర్ నియోజకవర్గంలో గత పదేళ్లలో 88 ఇళ్లు మాత్రమే ఇచ్చారు. పార్టీలకతీతంగా ప్రతి నియోజకవర్గానికి ఇళ్లను మంజూరు చేయాలి. స్థలాలున్న వారికి ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలి. లేని వారికి స్థలాలిచ్చి, నిర్మాణానికి నిధులివ్వాలి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలి. అక్కడి జైళ్లలో ఉన్న వారిని విడిపించాలి. ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని గౌరవించాలి. ఓడిపోయిన వారికి ప్రొటోకాల్ ఇచ్చి ప్రజాస్వామ్యానికి మచ్చ తేవద్దు” అని సూచించారు.

జూలై 24 నుంచి ఆగస్ట్ 3 వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యేలు అనేక అంశాలను లేవనెత్తారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేశారు.