అబద్ధపు ప్రచారం చేసిన రేవంత్ కు కోర్టు నోటీసులు
బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ బిజెపిపై దుష్ప్రచారం చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరువు నష్టం కేసులో కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 25న వ్యక్తిగతంగా కానీ, ప్లీడర్ తో కానీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల పల్స్ చూసి బిజెపి విజయం ఖాయమని గ్రహించి, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతుందని భయపడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా, దురుద్దేశపూరితంగా బిజెపిపై భయంకరమైన దుష్ప్రచారానికి తెగబడ్డారు. బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మారుస్తుందని ఒక అబద్ధాన్ని సృష్టించి విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాన స్రవంతి మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సహా అన్ని రకాలుగా ప్రచారం చేశారు. ఇది పూర్తిగా అవాస్తవమని, బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చదని, రిజర్వేషన్లు రద్దు చేయదని, ఎవరైనా రద్దు చేసే ప్రయత్నం చేసినా అడ్డుకుంటుందని ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బిజెపి నాయకులు పదేపదే స్పష్టం చేసినా కాంగ్రెస్ దుష్ర్పచారాన్ని ఆపలేదు. కుట్రపూరితంగా బిజెపిపై బురద జల్లుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలో బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు పరువునష్టం కేసు దాఖలు చేశారు. మే 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి బిజెపిపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని కాసం పిటిషన్ లో పేర్కొన్నారు. 50వేల కంటే ఎక్కువ మంది ఉన్న సభలో రేవంత్ రెచ్చగొట్టే ఆరోపణలు చేశారని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చారని పేర్కొన్నారు. కాసం ఫిర్యాదు మేరకు రేవంత్ పై సెక్షన్ 153, 171, 171, 499, 505 5 సెక్షన్ 125 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదైంది. దీనిపై ఆగస్ట్ 21న విచారణ చేపట్టిన నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సెప్టెంబర్ 25న వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు ఇవ్వడాన్ని కాసం వెంకటేశ్వర్లు స్వాగతించారు. దీనిని మొట్టమొదటి విజయంగా అభివర్ణించారు. కోర్టు నోటీసులతోనే సంతృప్తి చెందమని, తప్పుడు ఆరోపణలు, అబద్ధపు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డికి తగిన శిక్ష పడేవరకు న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

