బంగ్లా హిందువులపై దాడులను రాహుల్ ఖండించరా?
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ఘటనల వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆగస్ట్ 15న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అదేవిధంగా దేశ విభజనకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శక్తులు, కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల కుట్రలను ఎండగట్టారు. బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతున్నాయని… అయితే ఆ ఘటనలపై రాహుల్ గాంధీ కనీసం నోరు మెదపకపోవడం, ఖండించకపోవడం దారుణమన్నారు. భారతదేశాన్ని కులాల పేరుతో, మతం పేరుతో విడగొట్టాలని కొన్ని విదేశీ శక్తులతో పాటు, స్వదేశంలోని కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. మమత బెనర్జీ ప్రభుత్వం ఓట్ల కోసం రోహింగ్యాలకు ఆధార్ కార్డులు, ఆశ్రయంతో పాటు సకల సదుపాయాలు కల్పిస్తూ దేశ సంపదను పంచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు, అరబ్బు దేశాలు భారతదేశాన్ని బలహీన పర్చాలని చూస్తున్నాయని… విచ్ఛిన్నకర శక్తుల సవాళ్లను కులాలు, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని డాక్టర్ కె. లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
”నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా సమపాళ్లలో పాలన అందిస్తున్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలతో దేశాన్ని ఆత్మనిర్భర భారత్ గా తీర్చిదిద్దేలా కృషి చేస్తోంది. మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. డిజిటల్ యుగంలో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోంది. రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్ వేస్ వంటి అనేక మౌలిక సదుపాయాల్లో ముందంజలో ఉంది. చదువుకునే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందిస్తోంది. భారతదేశం యూనికార్న్ హబ్ గా మారుతోంది. లక్షకు పైగా స్టార్టప్స్, వందల యూనికార్న్స్ తో ప్రపంచానికే సవాల్ విసిరేలా మారింది. మోదీ పాలనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. రానున్న రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా రూపుదిద్దుకోవడం ఖాయం. సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహ ఉద్యమాలతో బాపూజీ, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, వీర్ సావర్కర్ వంటి వారు దేశ స్వాతంత్ర్యం కోసం అనేకమంది పోరాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంతో నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. వారి త్యాగాన్ని విస్మరించలేం.
భారత్ ఎప్పటికీ ప్రశాంతంగా ఉందరాదని, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలంటూ నాడు జిన్నా ముస్లిం లీగ్ స్థాపించి దేశ విభజనకు కారణమయ్యాడు. మరోసారి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రతో నేడు కొన్ని విదేశీ శక్తులు, స్వదేశంలో కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను కనుమరుగు చేసేలా ప్రయత్నిస్తున్నారు. నెహ్రూ నుంచి మొదలు నేటి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసమే దేశ మహనీయుల త్యాగాలను కనుమరుగు చేసే కుట్రలు చేస్తోంది.” అని డా. కె. లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

