జమ్మూ కాశ్మీర్లో ‘ఊదా’ విప్లవం
జమ్మూ కాశ్మీర్ వ్యవసాయాధారిత రాష్ట్రం. ఇక్కడి జనాభాలో 65 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా 27 శాతం. తరతరాలుగా ఇక్కడ వ్యవసాయం అనేక సవాళ్ళను ఎదుర్కొంది. కొండలు, గుట్టలతో కూడిన భూమి, కోతుల బెడద, సరైన రవాణా మార్గాలు లేకపోవడం మొదలైన సమస్యలు వ్యవసాయానికి అవరోధాలుగా మారాయి. దీనివల్ల సాగు కార్యకలాపాలు వరి, మొక్కజొన్న, గోధుమ, పప్పు ధాన్యాలు వంటి సంప్రదాయ పంటలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ పంటలు కూడా తరచుగా దెబ్బతింటూ రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించలేకపోతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి లేదా ప్రత్యామ్నాయ పంటల ద్వారా రైతుల పరిస్థితి మెరుగుపరచడానికి జమ్మూ కాశ్మీర్ ఆరోమా (సుగంధ ద్రవ్య) ఆరోగ్య గ్రామం (జాగ్) ప్రాజెక్టును ప్రారంభించింది. ‘ఆరోమా మిషన్’గా సుపరిచితమైన ఈ విప్లవాత్మక కార్యక్రమం అధునాతనమైన సీఎస్ఐఆర్ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఈ ప్రాంతంలో మూలికలు, సుగంధ ద్రవ్యాల మొక్కల పెంపకం, ప్రాసెసింగ్ లను చేపట్టింది. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఊదా (లావెండర్) విప్లవానికి బాట వేసింది. ఈ ప్రాజెక్టు కింద పేర్లు నమోదు చేసుకున్న రైతులకు అర ఎకరం నేలలో నాటడానికి ఉచితంగా అత్యంత నాణ్యమైన విత్తనాలు, మొక్కలు అందజేసి మూలికలు, సుగంధ ద్రవ్యాల సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ లలో శిక్షణ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రైతుల ఆదాయాలను గణనీయంగా పెంచి జమ్మూ కాశ్మీర్లోని గ్రామీణ ప్రాంతాలలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువ పారిశ్రామికవేత్తలు పెద్దయెత్తున లావెండర్ మొక్కల సాగును చేపట్టారు. అనేకమంది యువత ఎక్కువ జీతాలు వచ్చే కార్పొరేట్ ఉద్యోగాలను వదులుకొని మరీ జమ్మూ కాశ్మీర్లో లావెండర్ సాగు చేపడుతున్నారు.
ఈ విజయగాథకు దోడా జిల్లాలోని పర్వతమయమైన మారుమూల పట్టణం బధేర్వాలో బీజాలు పడ్డాయి. ఆ పట్టణంలో లావెండర్ పంట సాగు చేసిన వారు పొందిన లాభాల స్ఫూర్తితో దోడాలోని ఇతర ప్రాంతాల వారు కూడా ఈ పంట సాగును చేపట్టారు. సాగు మొదలుకుని ప్రత్యేక ప్లాంట్లలో పంటను ప్రాసెస్ చేసి వివిధ రకాల ఉత్పత్తులు వేరు చేయడం, వాటిని పరిశ్రమలకు అనుసంధానించటం, మార్కెటింగ్ చేయడం వరకు ఈ రైతులకు సీఐఎస్ఐఆర్ అన్ని రకాల మద్దతునూ అందిస్తోంది. నేడు జమ్మూ కాశ్మీర్లో 1,300కు పైగా హెక్టార్లలో లావెండర్ సాగు అవుతోంది. రైతుల ఆదాయాలను పెంచడానికి లావెండర్ పంట ఎంత ఉపయోగమో తెలియజేసే ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమం సాధించిన విజయాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. రిపబ్లిక్ దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని కర్తవ్య పథంలో నిర్వహించిన కవాతులో బధేర్వా లావెండర్ వ్యవసాయ క్షేత్రాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేగాక ఈ పొలాలకు టూరిస్టుల తాకిడి కూడా పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతోంది. ఈ ఏడాది ఒక దోడా జిల్లాలోనే రైతులు 100 కేజీల తాజా లావెండర్ తైలాన్ని ఉత్పత్తి చేశారు.
ఈ కార్యక్రమం జమ్మూ కాశ్మీర్ రైతుల ఆదాయాలను పెంచడంతోపాటు వ్యవసాయ ఆధారిత స్టార్టప్ లకు కొత్త ద్వారాలు తెరిచింది. విలువ ఆధారిత ఔషధ, సౌందర్య సాధనాల ఉత్పత్తుల రంగంలో అనేక కొత్త అవకాశాలకు తెరతీసింది. పరిశోధన, విద్యాసంస్థలు, పరిశ్రమ, స్థానిక యువ పారిశ్రామికవేత్తలకు మధ్య శక్తిమంతమైన సమన్వయం ఎంతటి ఘనవిజయాలను అందిస్తుందో తెలియజేయడానికి లావెండర్ విజయగాథ ఒక చక్కటి ఉదాహరణ.
డాక్టర్ జితేందర్ సింగ్,
కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన వ్యవహారాల సహాయ మంత్రి

