కాంగ్రెస్ పాలనలో ప్రతి రోజూ రూ.250 కోట్ల అప్పు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రూ.70,000 కోట్లకు పైగా అప్పులు చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తామూ ఆ పార్టీకి ఏమాత్రం తీసిపోమని అన్నట్లుగా అడ్డగోలుగా అప్పులు చేస్తున్నది. రాష్ట్ర ప్రజలపై సగటున ప్రతి రోజూ రూ.250 కోట్ల అప్పుల భారం మోపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 13 నాటికే ఒక్క ఆర్బీఐ నుంచి రూ.42,118 కోట్ల రుణం సేకరించింది. సెప్టెంబర్ 3న రూ.2,500 కోట్లు, 10న రూ.1,500 కోట్లు.. ఇలా వారం రోజుల్లోనే రూ.4,000 కోట్లు రుణం పొందింది. సెప్టెంబర్ 18న మరోసారి రూ.500 కోట్లు అప్పు తీసుకున్నది. ఆర్బీఐ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారమే గత తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.46,618 కోట్ల మేర రుణాలు సేకరించింది. వివిధ కార్పొరేషన్లకు రూ.24,877 కోట్ల గ్యారంటీలు ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలోని 4 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరిపై గత తొమ్మిది నెలల్లోనే రూ.17,873 భారం పడింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఏడాది రూ.52,576 కోట్ల రుణం సమీకరించనున్నట్టు 2023-24 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ ఏడాది అప్పుల లక్ష్యాన్ని రూ.62,012 కోట్లకు పెంచింది. అంటే నిరుటి కన్నా దాదాపు రూ.10 వేల కోట్లు ఎక్కువ. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి లెక్కించినా ఆగస్టు 13 నాటికి బహిరంగ మార్కెట్ నుంచి రూ.27వేల కోట్లు రుణాలు సమీకరించింది. అంటే ఏడాది లక్ష్యంలో దాదాపు సగం కేవలం నాలుగున్నర నెల్లలోనే చేరుకుంది. గ్యారెంటీలు కూడా కలుపుకొంటే ఈ ఏడాది లక్ష్యాన్ని దాటిపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అప్పులు ఏ స్థాయిలో పెరుగుతాయో చెప్పడం కష్టమంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.70,000 కోట్లకు పైగా అప్పులు చేసి ఏం చేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను ఒక ప్రజోపయోగ ప్రాజెక్టు కోసమో, విప్లవాత్మక పథకం కోసమో ఖర్చు చేస్తాయని భావిస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో తెచ్చిన నిధులతో ఏ ప్రాజెక్టు చేపట్టిందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా గ్యారంటీలు ఇస్తున్నది. అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిదిన్నర నెలల్లోనే రూ.25 వేల కోట్ల మేర గ్యారంటీలు ఇచ్చింది. ఈ అప్పులను కార్పొరేషన్లు రెండు విధాలుగా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. మొదటిది.. పన్నులు, చార్జీల రూపంలో ప్రజల నుంచి వసూలు చేయడం, రెండోది.. ప్రభుత్వమే ఈ మొత్తాన్ని చెల్లించడం. ఎలా చూసినా ప్రజలకే నష్టమని స్పష్టం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం అంటూ పెద్ద బృందం వేసుకొని అమెరికాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి డొల్ల కంపెనీల బోగస్ పెట్టుబడులు తెచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటిపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేక పోతున్నది. ఇప్పటికే పలు పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల రియల్ ఎస్టేట్ కుదేలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు మొదటి పది స్థానాల్లో సైతం లేకుండా పోయింది.
కృష్ణ చైతన్య