రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆస్థాన గుత్తేదారులకు వేల కోట్లు ఇస్తూ… రుణమాఫీకి మాత్రం నిధులు లేవని, రుణమాఫీకి ఇంకా నిధులు కావాలని మంత్రులు చెప్పటం సిగ్గుచేటని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీకి రూ.42వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన ప్రభుత్వమే… తర్వాత రూ.26 వేల కోట్లని చెప్పి… కేవలం రూ.17500 కోట్లు మాత్రమే ఇచ్చి… ఇంకా రూ.9500 కోట్లు కావాలని చెప్పడం ఏంటని నిప్పులు చెరిగారు. అధికారం కోసం దొంగ హామీలతో అన్నదాతలను మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసిస్తూ, రైతులకు అండగా బిజెపి 24 గంటల దీక్ష చేపట్టింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్‌లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘రైతు హామీల సాధన దీక్ష’ పేరిట బిజెపి నాయకులు, కార్యకర్తలు 24 గంటల పాటు దీక్ష చేపట్టారు. సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష మరునాడు అక్టోబర్ 1 ఉదయం 11 గంటల వరకు సాగింది. బిజెపి రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జ్ అభయ్ పాటిల్ నిమ్మరసం ఇచ్చి మహేశ్వర్ రెడ్డి సహా బిజెపి నేతలతో దీక్ష విరమింపచేశారు. 24 గంటల పాటు జరిగిన ఈ దీక్ష కార్యక్రమంలో బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, బిజెపి జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా నాయకులు, బిజెపి కార్యకర్తలు, వేలాదిగా తరలివచ్చిన అన్నదాతలు పాల్గొన్నారు.
దీక్ష చేపట్టిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి గజినీలా ఇచ్చిన హామీలు మర్చిపోతున్నారని అన్నారు. ఇక్కడ డబ్బులు వసూలు చేసి దిల్లీకి కప్పం కడుతున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా 8 నుంచి 9శాతం ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. ‘‘బిజెపి రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు అన్నదాతలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూనే ఉంది. అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎనిమిదిన్నర నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురిచేశారు. చేస్తామని చెప్పిన హామీలను నెరవేర్చలేదు. పైగా అన్నీ చేసినట్లు అబద్ధాలు చెబుతూ… దగా చేస్తున్న ఈ పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రజా సమస్యలను పక్కన పెట్టి, దిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొడుతున్నారు. పేదల ఇండ్లను కూలుస్తూ… పెద్దల ఇండ్లతో బేరాలు చేసుకుంటూ వారి నుంచి వసూళ్లు చేస్తున్న డబ్బులను దిల్లీతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అందిస్తున్నారా? గతంలో ఈ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా బీట్యాక్స్ పేరు మీద ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దోచుకుంటున్న డబ్బంతా దిల్లీకి కప్పం కడుతున్నారా… లేదా వారే జేబులు నింపుకొంటున్నారా…? ప్రజా ధనాన్ని దోపిడి చేస్తుంటే బిజెపి చూస్తూ ఊరుకోదు, ప్రతీ అవినీతిని శాసనసభా వేదికగా, ప్రజా క్షేత్రంలోనూ ఆధారాలతో సహా ఎండగడతూ ప్రశ్నిస్తూనే ఉంటుంది. కోట్లాది రూపాయలను దోపిడి చేస్తున్న ప్రభుత్వానికి రైతులకు రుణమాఫీ చేయడానికి మాత్రం నిధులు కరువయ్యాయా…? రుణమాఫీకి నిధులు లేవంటున్న సర్కార్, మూసీ ప్రక్షాళనకు మాత్రం రూ.50వేల కోట్లు ఉన్న అంచనాలను రూ.లక్షన్నర కోట్లకు పెంచుకుంది. ఆస్థాన గుత్తేదారులకు దోచిపెట్టేందుకే మూసీ అంచనాలను పెంచారు.’’ అని అన్నారు.
ఇక హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్న రేవంత్ సర్కార్ పేదలను సాకుగా చూపి పెద్దల నుంచి వసూళ్ల దందా నడిపిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి పెట్టకుండా కమీషన్లు, కలెక్షన్ల మీదనే ఫోకస్ చేస్తున్నారని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ, సోనియా గాంధీ బలి దేవత అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 2జీ స్కాం, కోల్ స్కాం, కామన్‌వెల్త్ గేమ్స్… ఇలా ఎన్నో స్కాములు చేసింది కాంగ్రెసేనని చెప్పిన రేవంత్ రెడ్డి అదే స్కీములు, స్కాములకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలను అసెంబ్లీ వేదికగా, ప్రజా క్షేత్రంలోనూ ఎండగట్టామని, సివిల్ సప్లై కుంభకోణం, యూ ట్యాక్స్, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, ఆర్ ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్, ఎగ్జిమ్ బ్యాంక్ గోల్‌మాల్, సుంకిశాల నిర్లక్ష్యం, అమృత్ నిధులను ఆగం చేయడం, ఇలా ఎన్నో అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదని, ఎందుకంటే వారి దగ్గర తప్పు చేయలేదని చెప్పేందుకు ఆధారాలు లేవన్నారు.
‘‘కేబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైన అంశాలపై చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం… ఇచ్చిన హామీలపైగాని, ప్రజా సమస్యలపై చర్చ జరిగిన సందర్భం కనిపించడం లేదు, ఎవరి కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వాలి, కలెక్షన్లు, కమీషన్లు వచ్చే పనులు ఏమున్నాయనే వాటి మీదనే చర్చిస్తున్నారు, ఇది బాధాకరం.’’ అని అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలిచిన బిజెపి రాష్ట్ర సర్కార్‌పై పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తుందని తెలిపారు.
చేసింది కొంత.. చెప్పేది కొండంత: డి.కె. అరుణ
మహబూబ్‌నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బ్యాంకులకు వెళ్లి అప్పు తెచ్చుకోమని రైతులకు చెప్పి ఇప్పుడు ఎందుకు మాఫీ చేయడం లేదు? రుణమాఫీ చేసింది కొంత చెప్పేది మాత్రం కొండంత. బీఆర్ఎస్ రైతు బంధు అంటే కాంగ్రెస్ రైతు భరోసా అని 15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? గొల్ల కుర్మలకు ఇచ్చిన హామీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఒక్కరికైనా ఇచ్చావా? 18 ఏండ్లు నిండిన చదువుకునే యువతులకు స్కూటీ ఇస్తామన్నారు.. ఏమైంది? హైడ్రా పేదల పాలిట హైడ్రోజన్ బాంబులా మారింది. పేదల కన్నీళ్లు చూస్తే బాధగా లేదా? మీకు కుటుంబాలు ఉన్నాయి కదా? వాళ్లకు ఇలాంటి ఇబ్బంది ఎదురైతే ఇలాగే ఉంటారా? ఇండ్లు కూలగొట్టేందుకేనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు సోయి లేదా? మీకు ఎవరిపైన అయినా కక్ష ఉంటే వారిపైనే తీసుకోండి. పేదలను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఆగదు.’’ అని అన్నారు.
సంజయ్ గాంధీ వారసుడు రేవంత్: ఈటల
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘రేవంత్ రెడ్డి అధికారం నెత్తికెక్కి ఎవరినీ లెక్క చేయని స్థాయికి ఎదిగిండు. మోసానికి దగాకు మారుపేరు రేవంత్. హైడ్రా బూచి చూపి బిల్డర్ల దగ్గర డబ్బులు వసూలు చేసి హైకమాండ్ కి డబ్బులు పంపించడానికి, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లలో వచ్చే కమీషన్ కోసం డ్రామాలాడుతున్నాడు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొనే ముందు ప్రజాప్రతినిధులను సంప్రదించావా? క్యాబినెట్‌లో చర్చించావా? ఎమ్మెల్యేలకు చెప్పావా? ఈయన్ను చూస్తే పేదల ఇళ్లను కూల్చి పేదల ఉసురు పోసుకున్న సంజయ్ గాంధీ గుర్తుకు వచ్చాడు. ఆయన వారసుడు ఈయన. మా ఇల్లు గుంజుకోవడానికి నువ్వు ఎవరు? హుస్సేన్ సాగర్ వద్ద జలవిహార్, ప్రసాద్ ఐమాక్స్, ప్యారడైజ్ ఎవరు కట్టారు? అవి వదిలిపెట్టి పేదల కొంపలు కూల్చే అధికారం నీకు ఎవరిచ్చారు? మూసీ, హైడ్రా బాధితులకు మేము అండగా ఉంటాం. బిజెపి మాట ఇస్తే తప్పదు. ఎరువుల కోసం లైన్లు కట్టే దౌర్భాగ్య స్థితి లేకుండా… కాంగ్రెస్ మూసేసిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6300 కోట్లతో ప్రారంభించి తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా చేసిన మహనీయుడు మోదీ. దేశవ్యాప్తంగా రైతులకు రూ.6 వేలు ఇస్తున్న ప్రభుత్వం బిజెపి. కాంగ్రెస్ హామీల మీద రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ అయ్యిందో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. రుణమాఫీ చేయకుంటే నీ భరతం పట్టుడు ఖాయం. బేషరతుగా రూ.2 లక్షలు రైతుల అకౌంట్‌లో జమ వేయాలి. లేదంటే నమ్మిన రైతులే ఈ ప్రభుత్వాన్ని బొందపెడతారు. పేదల కన్నీళ్ళలో కాంగ్రెస్ కొట్టుకుపోతుంది. బీ కేర్ ఫుల్.’’ అని అన్నారు.
నాడు హామీలు.. నేడు గారడీలు: పొంగులేటి
బిజెపి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక హామీలిచ్చి, నేడు గారడీలు చేస్తోంది. రైతు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలి. రైతులకు రుణమాఫీ కాకపోవడంతో, వడ్డీలు చెల్లించాలని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయి. అన్నం పెట్టే రైతులే నేడు అన్నమో రామచంద్ర అనే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. రైతుల సమస్యలను పక్కదారి పట్టించేలా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి ఇండ్లను కూల్చివేస్తోంది. ఇటీవల కురిసిన అతిభారీ వర్షాలతో ఖమ్మం, నల్గొండతో పాటు అనేక జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ప్రభుత్వం ఆదుకోలేదు.’’ అని అన్నారు.
బీఆర్ఎస్ రాచరికం… కాంగ్రెస్ అరాచకం: అర్వింద్
నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ రైతులను, మహిళలను, యువతను, ఎన్నారైలను మోసం చేస్తోంది. హైడ్రా పేరుతో పేదప్రజల ఇండ్లను కూలుస్తున్నది. రాష్ట్రంలో ఎవరి ఇల్లు ఎప్పుడు కూలిపోతదో తెలువదు. నోటీసులు లేవు, సమయం ఇచ్చేది లేదు. ముస్లింలకు ఒక న్యాయం.. హిందువులకు ఒక న్యాయం. చుట్టాలకు ఒక న్యాయం… సామాన్యుడికి ఒక న్యాయం. పాతబస్తీ దిక్కు చూసేదే లేదు.. పాతబస్తీలో ప్రతీ రెండో భవనం ఇల్లీగలే. రాష్ట్రంలో గత 9 సంవత్సరాలు ప్రజాకంటక పాలన చూసినం. బీఆర్ఎస్ పాలన అంటే రాచరికం…కాంగ్రెస్ పాలన అరాచకం. రాష్ట్రంలో కేవలం 20శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి 80శాతం మంది రైతులను మోసం చేశారు. పంటకు బోనస్ ముచ్చటే లేదు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతుకు ఇంతవరకు సాయం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10నెలలు గడిచిపోయినా కేసీఆర్ సర్కారు విధానాలనే కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో రైతు రాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. తక్షణమే రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలి.’’ అని అన్నారు.
సిట్టింగ్ జడ్జి దొరకలేదా?: రఘునందన్

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ‘‘10 ఏండ్లలో బీఆర్ఎస్ ఎంత అపఖ్యాతి మూటగట్టుకుందో 10 నెలల్లో కాంగ్రెస్ అంతే అపఖ్యాతి మూటగట్టుకుంది. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు… సిట్టింగ్ జడ్జి దొరకలేదా? రిటైర్ అయిన జడ్జితో సిట్ వేశారు. రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట కొత్త డ్రామా మొదలు పెట్టారు. తెలంగాణలో రైతుల సమస్యలు తీర్చడం బిజెపికే సాధ్యం. కాంగ్రెస్ ఒక 420 అనే విషయం అందరికీ తెలుసు.’’ అని అన్నారు.
కేసీఆర్ అడుగుజాడల్లో కాంగ్రెస్: కొండా విశ్వేశ్వర్
చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తోంది. కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రుణమాఫీ కోసం రూ.40వేల కోట్లు అవసరమని చెప్పి చివరికి రూ.17వేల కోట్లతో చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు కుమ్మక్కయ్యాయి. గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో ఏడో గ్యారంటీతో ప్రజల్ని మళ్లీ మోసం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పక్కకుపెట్టి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తోంది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ మరచిపోయిందేమో కానీ రైతులు, బిజెపి మరచిపోలేదు.’’ అని అన్నారు.
రుణమాఫీ అయ్యేవరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టం: పైడి రాకేష్ రెడ్డి
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి షరతులు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలతో పేపర్‌లో ప్రకటన వచ్చింది. వ్యాపార సంస్థల ప్రకటనల్లో కింద షరతులు వర్తిస్తాయని చూస్తాం. వ్యాపారం వేరు, రాజకీయం వేరని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. నైతిక విలువలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే జరిగే పరిణామం ఇదే. ఎవరైనా రుణాలు తీసుకోకపోతే వెంటనే బ్యాంకుకు వెళ్లి రూ.2లక్షల రుణాలు తీసుకోవాలని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. షరతులు వర్తిస్తాయని ఆ రోజే చెప్పాలిగా రేవంత్ రెడ్డి. పూర్తిస్థాయిలో రూ.2లక్షల రుణమాఫీ చేసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదిలేదు.’’ అని అన్నారు.
42వేల కోట్లన్నారు… 17వేల కోట్లు చేశారు: ధన్‌పాల్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 412 హామీలతో అధికారంలోకి వచ్చింది. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రాహుల్ బాబా ఆలియాస్ రాహుల్ ఖాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో ఎటువంటి షరతు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న చేస్తామని, తర్వాత 100 రోజుల్లో అమలు చేస్తామని, ఆ తర్వాత అగస్టు 15న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రూ.42వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కేవలం రూ.17వేల కోట్లతో రుణమాఫీ చేశారు. ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో రూ.13వేల కోట్లు మాత్రమే జమ అయ్యాయి.’’ అని అన్నారు.

