అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల వినూత్న నిరసన
రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన డిసెంబర్ 9న బిజెపి ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రుణమాఫీ, రైతుభరోసా వంటి హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని, ఇప్పటికీ లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపిస్తూ తలపాగాలు ధరించి ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ స్వయంగా ట్రాక్టర్ నడపగా, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్ చెరో పక్క కూర్చున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారు నేరుగా అసెంబ్లీ వద్దకు చేరుకోగా, మెయిన్ గేటు వద్ద ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణా రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వారితో జత కలిశారు.
తమ నియోజకవర్గాల్లో తమను పట్టించుకోకుండా అధికారులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బిజెపి ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, వెంకటరమణా రెడ్డి శాసనసభలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు నిరసనగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి కూర్చొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ ‘‘నాకు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరితే ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే అనే పదానికి జరుగుతున్న అవమానమిది. ఈరోజు ఇక్కడ(ప్రతిపక్షంలో) ఉన్నవారు రేపు అక్కడ(అధికారంలో) ఉండవచ్చు. 8 నెలల క్రితం కలెక్టర్ చేసిన పనిపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు’’ అని తెలిపారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవమానాలను సభలో తప్ప ఇంకెక్కడ చెప్పగలమని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు విషయంలో సభలోని అన్నిపక్షాల అభిప్రాయాలు తీసుకొని ఉండాల్సిందని అన్నారు. తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుండేదని అభిప్రాయబడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 317 జీఓ తలనొప్పిగా మారిందని, వీలైనంత త్వరగా దాన్ని రద్దు చేయాలని సూచించారు.
‘‘స్వాతంత్య్రం రాకముందు భారతమాత విగ్రహానికి కిరీటం లేదు. ఆ తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ కిరీటం తీసుకొచ్చారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు, విగ్రహాలు మారిస్తే ఎలా? టీఎస్‌ని టీజీగా చేస్తే ప్రక్షాళన చేసినట్లేనా? సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినంగా ఎందుకు మార్చడం లేదు?’’ అని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ‘‘తెలంగాణ ప్రజల రాతలు మార్చాలి కానీ.. విగ్రహాలను మార్చడమెందుకు? తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్లీ విగ్రహం మారుస్తామంటే ఏం చేస్తారు? విగ్రహంలో హస్తం ముద్ర లేకుండా బతుకమ్మను పెడితే బాగుండేది.’’ అని పైడి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకోకపోవడం దురదృష్టకరం అని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ అన్నారు. సోనియా గాంధీ ఒక్కరి వల్లే తెలంగాణ వచ్చింది అనడాన్ని తప్పుబట్టారు.

