Indian Constituency

కాల పరీక్షకు నెగ్గిన భారత రాజ్యాంగం

1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం దేశ పరిపాలనకు పునాది వంటి మౌలిక శాసనం. పౌరుల మౌలిక హక్కులు బాధ్యతలను నిర్వహించే ఒక సామాజిక ఒప్పందాన్ని కూడా రాజ్యాంగం మనకు అందించింది. ఈ సామాజిక ఒప్పందం సమ్మిళిత అభివృద్ధి, చట్ట పరిపాలన, సమానత్వం, సమన్యాయాలకు హామీ ఇస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు విదేశీ ఆక్రమణ నుంచి విముక్తి పొంది భవిష్యత్తు వైపు సానుకూల దృక్పథంతో చూస్తున్న జాతికి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలతో కూడిన ఒక అసాధారణ పత్రాన్ని వారసత్వంగా ఇచ్చారు. రాజ్యాంగ సభకు వివిధ రకాల పిటిషన్లు, ప్రతిపాదనలు ద్వారా దేశ భవిష్యత్తును, దాని పరిపాలనా విధానాన్ని రూపొందించడం తమ బాధ్యతగా భావించి ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకున్న వారందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేయడానికి ఈ 75వ రాజ్యాంగ దినోత్సవం ఒక సువర్ణావకాశం. రాజ్యాంగ సభ కొలువుదీరిన సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో విజ్ఞులు, వివేకవంతులు, రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు జరిపిన చర్చలు ఎంత ముఖ్యమైనవో సామాన్య ప్రజల భాగస్వామ్యం కూడా రాజ్యాంగ రూపకల్పనలో అంతే కీలక పాత్ర వహించింది. అందుకే మనం పూజించే రాజ్యాంగం పరమ పవిత్రమైనది. “రాజ్యాంగం కేవలం ఒక న్యాయవాది తయారుచేసిన పత్రం కాదు. సమకాలీన యుగపు స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక జీవన సాధనం,” అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు ఈ పవిత్ర గ్రంథం విశిష్టతను చాటి చెబుతాయి.

నవంబర్ 26ను సంవిధాన దివస్ (రాజ్యాంగ దినోత్సవం) గా నిర్వహించాలని 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగంలో పొందుపరిచిన విశ్వజనీన విలువల పట్ల మన విశ్వాసాన్ని, నిబద్ధతను, అదేవిధంగా ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడటం, వారి సంక్షేమానికి పాటు పడాలన్న మన ఆకాంక్షను పునరుద్ఘాటిస్తుంది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన రాజ్యాంగాలలో ఒకటి. ఇందులో 448 నిబంధనలు, 25 అధ్యాయాలు, 100కు పైగా సవరణలు ఉన్నాయి. మన రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసినప్పటికీ భారతీయుల జ్ఞానం దార్శనికత, స్ఫూర్తి ఇవే మన రాజ్యాంగానికి ప్రధాన మూలాలు. వేల సంవత్సరాలుగా భారతీయుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నిక్షిప్తమై ఉంది. విభిన్నతను కాపాడుకోవడం, గౌరవించడం మన రక్తంలోనే ఉంది.

భిన్నాభిప్రాయాలకు, భావనలకు చోటు కల్పించడం వల్ల మన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది. అందుకే వలస పాలన ముగిసిన తరువాత ప్రపంచంలో అనేక దేశాలు శరవేగంగా మారుతున్న విచ్ఛిన్నకర శక్తుల దాడుల నుంచి బతికి బయటపడలేక పోగా భారత రాజ్యాంగం మాత్రం 75 సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. పరిస్థితులకు అనుగుణంగా సవరించుకునే అవకాశం మన రాజ్యాంగం గొప్ప సుగుణాల్లో ఒకటని చాలామంది అభిప్రాయం. మన రాజ్యాంగకర్తలు రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు సులభంగా సవరించే అవకాశం కల్పించాలా లేక సవరించడానికి ప్రజాభిప్రాయ సేకరణను తప్పనిసరి చేయాలా అన్న మీమాంసను ఎదుర్కొన్నారు. ఈనాడు మనం అనుసరిస్తున్న రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ ప్రదర్శించిన నైపుణ్యాన్ని మనం ఇక్కడ తప్పక కొనియాడాలి. ఆయన కఠిన నిబంధనలకు, సరళమైన సవరణలకు మధ్య చక్కటి సమతౌల్యాన్ని పాటించారు.

1973లో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం సూత్రాన్ని నిర్దేశించినప్పటికీ చాలావరకు మన రాజ్యాంగం అవసరమైన మార్పులకు అవకాశం కల్పిస్తుంది. గత అనేక సంవత్సరాలలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం అనేక కీలకమైన సవరణలు చేసుకుంటూ వచ్చాం. ఇటీవల కాలంలో ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపగల రాజ్యాంగ సంస్కరణలో 103వ సవరణ (2019), 104వ సవరణ (2020) ఉన్నాయి. 103వ సవరణ ఆర్థికంగా వెనకబడిన బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు, విద్యలో 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. 104వ సవరణ షెడ్యూల్డ్ కులాలు, తరగతులు వారికి రిజర్వేషన్లను పొడిగించింది. అలాగే 2023లో చేసిన 106వ సవరణ చట్టసభల్లో మహిళలకు మూడో వంతు సీట్లు కేటాయించింది దీన్ని ‘నారీశక్తి వందన్ అధినియమ్’ అని కూడా పిలుస్తున్నారు.

మన రాజ్యాంగంలో అంతర్భాగమైన ఆధునిక దృక్పథం ఆధారంగా వలస పాలన నాటి చట్టాలను తొలగించి వాటి స్థానంలో సమకాలీన అవసరాలకు అనుగుణమైన ఆధునిక చట్టాలను తీసుకురావడానికి ఇటీవల కాలంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వలస కాలం నాటి చట్టాలకు ప్రబలమైన ఉదాహరణ 19వ శతాబ్దంలో అమలులోకి వచ్చిన నేరస్మృతి, భారతీయ శిక్షాస్మృతి, భారతీయ సాక్ష్యాల చట్టం. పార్లమెంటు 2023లో ఈ మూడు చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కీలకమైన మూడు ఆధునిక నేర న్యాయ చట్టాలను ఆమోదించింది. అవి భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్. కాలానికి అనుగుణమైన చట్టాలను తీసుకురావడానికి పార్లమెంటు నిరంతరం కృషి చేస్తోంది. డిజిటల్ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు 2023, ముస్లిం మహిళలు వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2019, వినియోగదారుల రక్షణ బిల్లు 2019 దీనికి కొన్ని చక్కటి ఉదాహరణలు. 21వ శతాబ్దపు ప్రపంచానికి అనుగుణంగా పార్లమెంట్ కూడా అవసరమైన ఇంకెన్నో చట్టాలను ఆమోదిస్తోంది. రాజ్యాంగ ఆదేశాన్ని అమలు చేయడానికి, దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి పార్లమెంటు నిరంతరం కృషి చేస్తోంది. ప్రజల సార్వభౌమాధికార సంకల్పానికి వ్యక్తీకరణ అయిన పార్లమెంటు దేశ రాజ్యాంగ చట్టంలోను, పాలనా వ్యవస్థలోనూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది.

ఈ ఏడున్నర దశాబ్దాలలో జరిగిన 18 సార్వత్రిక ఎన్నికలు, డజన్ల కొద్దీ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వందల కొద్ది పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, వీటిల్లో ప్రజల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యం… ఇవన్నీ భారత రాజ్యాంగం నిర్దేశించిన, పరిరక్షించిన స్ఫూర్తికి, ఆశయాలకు, అవి దేశానికి అందించిన పాలనా వ్యవస్థకు లభించిన ఆమోదం. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం నిర్దేశించిన సమున్నతమైన విలువలకు మన నిబద్ధతను మరొకసారి ప్రకటిద్దాం.

ఓం బిర్లా,
లోక్ సభ స్పీకర్