Atalji

స్ఫూర్తినిచ్చే రాజనీతిజ్ఞుడు

డిసెంబరు 25.. మనందరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు.. మన ప్రియతమ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శత జయంతిని జరుపుకొంటున్నాం. రాజనీతిజ్ఞుడిగా ఎంతో ఎత్తున నిలిచిన ఆయన అశేష ప్రజానీకానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. దేశాన్ని 21వ శతాబ్దంలోకి ఘనంగా తీసుకెళ్లిన జాతి నిర్మాతకు మనమంతా ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. 1998లో వాజ్‌పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. అంతకుముందు 9 ఏళ్లలో మనం 4 లోక్‌సభ ఎన్నికలను చూశాం. దేశ ప్రజలు ప్రభుత్వాల పట్ల అసహనంతో, విశ్వాసలేమితో ఉండేవారు. అటల్‌జీ వచ్చి దానిని మార్చేశారు. సమర్థ ప్రభుత్వాన్ని అందించారు. అతి సామాన్య మూలాల నుంచి వచ్చిన ఆయన సామాన్యుడి కష్టాలను అర్థం చేసుకున్నారు. ప్రభావశీల పాలనలోని పరివర్తన శక్తిని గుర్తించారు. 

వాజ్‌పేయీ ప్రభుత్వ పనితీరుతో కలిగిన దీర్ఘకాల ప్రయోజన ఫలితాలను మనం ఇప్పుడు అనేక రంగాల్లో చూస్తున్నాం. ఆయన హయాం సమాచార సాంకేతిక పరిజ్ఞానం, టెలికం, కమ్యూనికేషన్ల రంగంలో బ్రహ్మాండమైన ప్రగతిని సాధించింది. ఇది యువశక్తి అధికంగా ఉన్న మనలాంటి దేశానికి ఎంతో ముఖ్యం. అటల్‌ జీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేయడానికి తొలి, గట్టి ప్రయత్నం చేసింది. అదే సమయంలో దేశాన్ని అనుసంధానం చేయడానికి కృషి చేసింది. దానికి నిదర్శనమే ఇప్పటికీ స్వర్ణ చతుర్భుజిని (నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం) చాలా మంది గుర్తు చేసుకోవడం. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన ద్వారా స్థానిక రహదారులను నిర్మించడం కూడా అత్యంత ప్రాధాన్యం కలిగినదే. ప్రపంచ స్థాయిలో నిర్మించిన దిల్లీ మెట్రో ఎన్డీయే ప్రభుత్వ ఘనతే. వాజ్‌పేయీ ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి ఊతమివ్వడమే కాకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ప్రాంతాలను దగ్గరికి చేర్చి సమ్మిళితం చేసింది. అటల్‌ జీ కలలుగన్న భారతావని నిర్మాణంలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వ శిక్ష అభియాన్‌.. దేశంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు, బలహీనవర్గాలకు ఆధునిక విద్యను అందించింది. అదే సమయంలో అమలు చేసిన అనేక ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించాయి.  

‘శక్తి’ని చూపిన పోఖ్రాన్‌

వాజ్‌పేయీ అద్భుత నాయకత్వానికి మరో మచ్చుతునక 1998 మే 11వ తేదీన జరిపిన పోఖ్రాన్‌ అణు పరీక్ష. అధికారం చేపట్టగానే ఆయన ‘ఆపరేషన్‌ శక్తి’ పేరుతో ఈ పరీక్షను నిర్వహించారు. మన శాస్త్రవేత్తల పరాక్రమాన్ని ఇది నిరూపించింది. దీంతో ప్రపంచం నివ్వెరబోయింది. మనపై కోపం ప్రదర్శించింది. మరే ఇతర నేతైనా ప్రపంచం హెచ్చరికలకు భయపడిపోయేవారు. కానీ అటల్‌ జీ భిన్నంగా వ్యవహరించారు. భారత్‌ను దృఢంగా నిలబెట్టేందుకు అదే నెల 13న మరోసారి పరీక్ష జరిపారు. 11న జరిపిన పరీక్ష శాస్త్రీయ శక్తిని చాటితే.. 13వ తేదీ పరీక్ష నిజమైన నాయకత్వాన్ని చూపింది. ఈ పరీక్షలు ప్రపంచ ఒత్తిడులకు, హెచ్చరికలకు భారత్‌ వెరవబోదని సందేశమిచ్చింది. అంతర్జాతీయ ఆంక్షలను తట్టుకుని వాజ్‌పేయీ నాయకత్వంలో దేశం దృఢంగా నిలిచింది. ఒకవైపు ప్రపంచ శాంతికి గట్టి మద్దతుదారుగా ఉంటూనే మరోవైపు దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో తన హక్కును వదులుకోదని భారత్‌ నిరూపించింది.

పార్లమెంటరీ ప్రతిభ

తన రాజకీయ జీవితమంతటా వాజ్‌పేయీ పార్లమెంటరీ ప్రతిభ కనిపిస్తుంది. అతి కొద్ది మంది ఎంపీలు కలిగిన పార్టీకి నాయకత్వం వహించినా శక్తిమంతమైన కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ప్రధానిగా ఉన్నప్పుడూ ప్రతిపక్షాలను తనదైన శైలిలో విషయ పరిజ్ఞానంతో ఎదుర్కొన్నారు. సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉన్నా ఎవరితోనూ ఘర్షణ పడలేదు. చివరకు కాంగ్రెస్‌ తనను ద్రోహిగా అభివర్ణించినా సంయమనం కోల్పోలేదు. వాజ్‌పేయీ అవకాశవాద రాజకీయాలు ఏనాడూ చేయలేదు. 1996లో ప్రధాని పదవికి రాజీనామా చేశారేతప్ప ఎంపీల కొనుగోలు వంటి అక్రమ చర్యలకు పాల్పడలేదు. వికృత రాజకీయాలకు తెరతీయలేదు. 1999లో ఒక్క ఓటు తేడాతో లోక్‌సభలో ఓడిపోయినప్పుడూ రాజీనామా చేశారే తప్ప ప్రతిపక్షాల అనైతిక రాజకీయాలను సవాలు చేయలేదు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నారు. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి అసాధారణ విజయం సాధించారు. భారతీయ సంస్కృతిలో వాజ్‌పేయీ ఎంతలా భాగమయ్యారో తప్పనిసరిగా గుర్తించదగినది. విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి ఆయన చరిత్ర సృష్టించారు. ఇది భారతీయ వారసత్వాన్ని, విలక్షణతను ఇనుమడింపజేసింది. 

రాజ్యాంగ పరిరక్షకుడు

రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడటంలోనూ అటల్‌జీది నిలువెత్తు నిబద్ధత. ఆయన శ్యామాప్రసాద్‌ ముఖర్జీ నుంచి స్ఫూర్తి పొందారు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాలకు ఒక స్తంభంలా నిలిచారు. 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం తమ పార్టీ జనసంఘ్‌ను జనతా పార్టీలో విలీనం చేసేందుకు అంగీకరించారు. అది అటల్‌ జీతోపాటు ఇతరులకు ఎంతో బాధాకరమైన విషయం. అయినా రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమనుకుని పార్టీని విలీనం చేశారు. భారత ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని గుర్తించిన అటల్‌ జీ.. దానిని బలోపేతం చేయాల్సిన అవసరాన్నీ విస్మరించలేదు. భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల అవసరాన్ని గుర్తెరిగి ఎన్డీయేను పునర్నిర్వచించారు. ప్రజలను ఏకం చేసి అభివృద్ధికి చోదకశక్తిగా ఎన్డీయేను తయారు చేశారు. జాతీయ ప్రగతితోపాటు ప్రాంతీయ ఆకాంక్షలకు గౌరవమిచ్చారు.

ఎందరికో స్ఫూర్తి

అటల్‌ జీ వ్యక్తిగత జీవితం ఎంతో ఆకర్షణీయం. సాహిత్యంపై ఆయన ప్రేమ అజరామరం. భావవ్యక్తీకరణలో ఆయన దిట్ట. రచయితగా, కవిగా పదాలతో ఆటలాడుకునేవారు. వాటితో స్ఫూర్తి నింపేవారు. ఆలోచనలను రేకెత్తించేవారు. సాంత్వన కలిగించేవారు. ఆయన కవితలు.. ఆయనలోని అంతర్గత సంఘర్షణలను, దేశం కోసం ఆయన ఆశలను ప్రతిబింబించేవి. వాజ్‌పేయీ లాంటి నేతతో సంభాషించడం, ఆయన నుంచి నేర్చుకోవడం నాలాంటి ఎందరో భాజపా కార్యకర్తలకు దక్కిన గౌరవం. అప్పట్లో పెత్తనం చెలాయిస్తున్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీని తీర్చిదిద్దడంతో వాజ్‌పేయీ, ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషిల కృషి ఎనలేనిది. సిద్ధాంతాలకు, అధికారానికి మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు వాజ్‌పేయీ ఎల్లప్పుడూ సిద్ధాంతాలకే ఓటు వేసేవారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఉందని దేశాన్ని ఒప్పించడంలో ప్రయత్నించి విజయం సాధించారు. వాజ్‌పేయీ శత జయంతి సందర్భంగా ఆయన సిద్ధాంతాలకు, దేశం కోసం ఆయన ఆకాంక్షించిన విజన్‌ను పూర్తి చేసేందుకు పునరంకితమవుదాం. సుపరిపాలన, ఐక్యత, ప్రగతి కోసం ఆయన అనుసరించిన మూలసూత్రాలను ఆలంబనగా చేసుకుని ఘనమైన భారత్‌ను నిర్మిద్దాం.

నరేంద్ర మోదీ,
భారత ప్రధానమంత్రి