తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం!
ఎస్సీ వర్గీకరణకు 2011 నాటి జనాభా లెక్కలనే ప్రామాణికంగా స్వీకరించాలని ఏకసభ్య కమిషన్ సిఫార్సును తెలంగాణ ప్రభుత్వం స్వీకరిస్తుండటం పట్ల దళిత వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకం అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా వచ్చిన వేలాది వినతిపత్రాలను కమిషన్ పట్టించుకోలేదని విమర్శలు చెలరేగుతున్నాయి. 90 శాతంకు పైగా దళిత వర్గాలు ప్రస్తుత జనాభా ప్రాతిపాదికగా ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, ఎస్సీ ఉపకులాల వారీగా వర్గీకరణ జరగాలని కోరాయి. కానీ ఏకసభ్య కమిషన్, మంత్రివర్గ ఉపసంఘం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించాయి. 2011 నాటి జనాభా ఆధారంగా తెలంగాణలో 52. 17 లక్షల ఎస్సీ జనాభా ఉన్నట్లు తేల్చారు. గత నవంబర్, డిసెంబర్ లలో నిర్వహించిన ఇంటింటి సర్వే ప్రకారం ఎస్సీల జనాభా సుమారు 62 లక్షల వరకు ఉంది. 2014 నాటి సకల జనుల సర్వే ప్రకారం 64 లక్షల వరకు ఉంది. తాజా గణాంకాలు అందుబాటులో ఉండగా, 14 ఏళ్ళ క్రితం నాటి జనాభా ప్రాతిపదికను పరిగణలోకి తీసుకోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్‌ల వాటాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. వర్గీకరణలో తమకు న్యాయంగా 11 శాతం దక్కాల్సిన వాటా 9 శాతంగా నిర్ణయించడం సరికాదని స్పష్టం చేశారు. జనాభాపరంగా కాని, వెనకబాటుతనంపరంగా కాని ఎలా చూసినా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ దక్కాలని తేల్చి చెప్పారు. 15 లక్షలు ఉన్న మాలలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే, 32 లక్షలకు పైగా ఉన్న మాదిగలకు 11 శాతం రావాల్సిందేనని తేల్చి చెప్పారు.
తమిళనాడు, పంజాబ్, హర్యానాలలో కేవలం రెండు గ్రూపులుగా ఎస్సీలను చేయగా తెలంగాణలో మూడు గ్రూపులుగా చేయడం విస్మయానికి గురిచేస్తుంది. ఆ విధంగా చేయాల్సి వస్తే నాలుగు గ్రూపులుగా చేయాలనే డిమాండ్ బయలుదేరుతుంది. కాగా, వర్గీకరణకు షమీమ్ అఖ్తర్ కమిషన్ క్రిమిలేయర్‌కు చేసిన సిఫార్సును ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలేమని గ్రహించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాలలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తూ, మాదిగలకు అన్యాయం జరిగే విధంగా కుట్ర పన్నారని కృష్ణ మాదిగ ఆరోపించారు. అత్యంత వెనుకబడిన ఎస్సీ ఏ గ్రూప్ లో పంబాల కులాన్ని ఏవిధంగా చేర్చారని ఆయన ప్రశ్నించారు. ఆ కులంలో 1000 మంది జనాభా అంటే 100 మంది వరకు ఉద్యోగస్తులు ఉండగా, అదే గ్రూప్ లోని తక్కల కులంలో 2558 మంది ఉంటే ఒక్కరైనా ఉద్యోగం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ వర్గీకరణ అమలు విషయంలో సైతం పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి న్యాయ కమిషన్ ప్రాధాన్యత నమూనాను ప్రతిపాదించింది. దీని అర్థం గ్రూప్-1లో నోటిఫై చేసిన తర్వాత భర్తీ చేయని ఖాళీలను గ్రూప్-2 అభ్యర్థులతో భర్తీ చేయాలి. గ్రూప్-2 ద్వారా భర్తీ చేయని వాటిని గ్రూప్-3 ద్వారా భర్తీ చేయాలి. “అన్ని గ్రూపులలో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, ఖాళీలను ముందుకు తీసుకెళ్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. పరోక్షంగా వర్గీకరణను నిర్వీర్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ లో షెడ్యూల్డ్ కులాల వారిని నాలుగు గ్రూపులుగా వర్గీకరిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు కేవలం మూడు గ్రూపులుగా వర్గీకరించడం విమర్శలకు తావిస్తున్నది. కనీసం ఈ విషయమై దళిత సంఘాలతో, లక్షల పక్షాలతో లేదా కనీసం అసెంబ్లీలో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేయలేదు. చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీల రిజర్వేషన్లను 18 శాతానికి పెంచుతామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడా ప్రస్తావనే తేవడం లేదు. ఇలా ఉండగా, వర్గీకరణ విషయంలో మాదిగలకు అన్యాయం జరిగినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇద్దరు మాదిగ నేతల వద్ద ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది. అంటే ముఖ్యమంత్రి అభీష్టాన్ని సైతం ఖాతరు చేయకుండా కాంగ్రెస్ హై కమాండ్ వద్ద పలుకుబడి గల నేతలు తమ ఇష్టానుసారం చేయించుకున్నారా? అనే అనుమానం కలుగుతుంది.
ప్రవీణ్

