slbc

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అవసరమైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌ కుప్పకూలి అందులో 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకుపోవడంతో వారి భద్రత గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఎలాగైనా క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కూలి 8 మంది ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నా అదేమీ పట్టనట్టు ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉండిపోయారు. కేవలం ఇద్దరు మంత్రులకు బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకొన్నారని, తూతూ మంత్రపు ప్రకటనలు, సమీక్షలు చేసి ఇతర కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ ‘అసలు రాష్ట్రంలో టన్నెల్‌ కూలిన ఘటన ఒకటి జరిగిందా?’ అన్న రీతిలో ముఖ్యమంత్రి వ్యవహరించినట్లు స్పష్టం అవుతుంది. 

అసలు ఈ పనులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఈ ప్రమాదానికి దారి తీసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఎలాంటి పరీక్షలు, అధ్యయనాలు చేయకుండానే పనులు హడావుడిగా ప్రారంభించినట్టు అర్థమవుతున్నది. కేవలం నిర్మాణ కంపెనీ అనామతు పరీక్షలతోనే పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తున్నది. అందువల్లే ప్రమాదం జరిగిందని కార్మిక వర్గాలు, ఇంజినీర్లు, జియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. డేంజర్‌ జోన్‌లో చేపట్టాల్సిన రక్షణ చర్యలను కూడా ప్రభుత్వం, అధికారులు చేపట్టలేదని చెబుతున్నారు. పూర్తిగా కంపెనీ చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించడంతోనే ఈ దుస్థితి వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ టన్నెల్‌లో ప్రస్తుతం పనులు కొనసాగుతున్న 14 కిలోమీటర్ల ప్రాంతం సున్నితమైందని, అత్యంత ప్రమాదకరమైందని ఇంజినీర్లు చెప్తున్నారు. దాదాపు 8 మీటర్ల మేరకు షియర్‌జోన్‌ ఉందని చెప్తున్నారు. భూమి పొరల్లో భౌతిక ఒత్తిళ్లకు గురై, రాళ్ల భాగాలు తేలికగా సర్దుబాటవడం, రాతి ఆకృతులు మారిపోవడం, చీలికలు ఏర్పడి పూర్తిగా పటుత్వాన్ని కోల్పోయే ప్రాంతాన్ని షియర్‌జోన్‌ అంటారని తెలిపారు. ఫలితంగా భూమి ప్రకంపనలకు గురవుతుంటుందని వివరించారు. సొరంగ నిర్మాణాల వైఫల్యాలకు ప్రధానంగా ఇలాంటి జోన్లే కారణంగా నిలుస్తాయని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆ జోన్‌ ఉందని తెలుస్తున్నది. అలాంటి జోన్లలో సొరంగ నిర్మాణాలను చేపట్టే సమయంలోనే చాలా రకాలుగా అధ్యయనాలు చేయాల్సి ఉంటుందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో షియర్‌జోన్‌కు సంబంధించిన అధ్యయనాలు చేయలేదని స్థానిక సైట్‌ ఇంజినీర్లు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. నిర్మాణ కంపెనీ పరీక్షలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్టు చెప్తున్నారు. 

నామమాత్రంగా జియాలజికల్‌ సర్వే మాత్రమే నిర్వహించారని తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన చోటు నుంచి భారీగా సీపేజీ వస్తున్నది. అందుకు అనుగుణంగా డీవాటరింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయలేదని స్పష్టమైంది. భూమిపొరల్లో నీటి ఒత్తిడిని నివారించేందుకు సీపేజీ పరిమాణాన్ని బట్టి డ్రైనేజీ రంధ్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అది చేయలేదు. అదీగాక చేసిన డ్రైనేజీ రంధ్రాలు కూడా పూడుకుపోకుండా కేసింగ్‌ వేయాల్సి ఉంటుంది. ఆ పని కూడా చేయలేదని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. షీయర్‌జోన్‌కు అనుకూలమైన రీతిలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన విధానంలో గ్రౌటింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఆయా పరీక్షలు, నిపుణుల ఆధ్వర్యంలో లోతైన అధ్యయనాలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని, ఆ ఖర్చును తప్పించుకునేందుకు కంపెనీ నామమాత్రపు పరీక్షలను నిర్వహించి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కార్మికులు, ఇంజినీర్లు విమర్శిస్తున్నారు. పటిష్ట రక్షణ చర్యలు, గ్రౌటింగ్‌ నిర్వహించకుండా పనులు చేయడం వల్లే మట్టి, సిమెంట్‌ కుప్పులు కూలిపోయాయని వివరిస్తున్నారు. నిర్మాణ వైఫల్యానికి, ప్రస్తుత ప్రమాదానికి ప్రధానంగా కనీస పరీక్షలు, అధ్యయనం చేయకుండా పనులను చేపట్టడమే కారణమని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఆర్భాటంగా చేపట్టిన సొరంగ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిపుణులను ఏర్పాటు చేయలేదని, పూర్తిగా కంపెనీకే వదిలేసిందని వివరిస్తున్నారు. సంక్లిష్ట సొరంగ నిర్మాణ పనులకు సంబంధించి నిపుణులను నియమించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదికాదని భావిస్తున్నారు.

ప్రవీణ్