Contracers Dharna

20 శాతం కమిషన్ ఇవ్వలేమంటూ భట్టి ఛాంబర్ ముందు సివిల్ కాంట్రాక్టర్ల ధర్నా

రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి వ్యవహారాలు రచ్చకెక్కుతున్నాయి. బిల్లుల చెల్లింపునకు భారీ కమిషన్లు ఇవ్వలేమంటూ స్వయంగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోనే నిరసన వ్యక్తం చేయడం సంచలనం సృష్టిస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం ఆందోళనలు చేయడం చూసాము. కానీ నేరుగా సచివాలయంలో, పైగా ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ వద్దనే బైఠాయించడం కలకలం రేపుతోంది. కేవలం పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం డిమాండ్ చేయడమే కాకుండా, అవి చెల్లించాలంటే 20 శాతం కమిషన్లు చెల్లించామని వత్తిడి తెస్తున్నారని, అంత మొత్తం చెల్లించలేమంటూ వారు బహిరంగంగా ఆరోపణలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఈ ఆరోపణలపై మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ సమాధానం చెప్పే ధైర్యం కూడా చేయడం లేదు. ఇదేనా ప్రజా ప్రభుత్వం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తమకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా దాటవేస్తూ ఉండడంతో తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు సివిల్ కాంట్రాక్టర్లు భట్టి విక్రమార్క ఛాంబర్ కు వచ్చారు. అయితే, వారు వస్తున్నారని తెలుసుకున్న ఆయన అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. వారిని ఎదుర్కొనే ధైర్యం చేయలేక పోయారు. దాంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్లు అక్కడే బైఠాయించారు, భద్రతా అధికారులు వచ్చి వారిని అక్కడి నుండి ఖాళీ చేయించారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని, వాటికి వడ్డీలు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న తమను 20 శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది ప్రజాప్రభుత్వం కాదని, 20 శాతం కమీషన్‌ సర్కార్‌ అని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి గానీ తమకు ఇవ్వడానికి లేవా? అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా33 జిల్లాల నుంచి సుమారు 200 మంది చిన్న సివిల్‌ కాంట్రాక్టర్లు మార్చ్ 7న సచివాలయంలోని మల్లు భట్టివిక్రమార్క చాంబర్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ. 10,000 కోట్ల బకాయిలను చెల్లించామని అంతకుముందు భట్టి విక్రమార్క పేర్కొనడం గమనార్హం. సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 14 నెలల కాలంలో కొన్ని బకాయిలు జమ చేశామని తెలిపారు. పాత, కొత్త పెండింగ్‌ బిల్లులు రూ.10వేల కోట్లు తమ ప్రభుత్వం క్లియర్‌ చేసిందని తెలిపారు. మరో రూ.8,000 కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి ప్రాధాన్య క్రమంలో ప్రతినెలా రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, పెండింగ్‌ బిల్లుల కోసం మంత్రులను కలిస్తే, ఆ ఒక్క విషయం మాట్లాడొద్దని చెప్తున్నారని సివిల్‌ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దర్శనాల శంకరయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లి, భార్య మెడలో ఉన్న బంగారం కుదువపెట్టి కాంట్రాక్టు పనులు చేశామని, బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్‌ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లతో సహా కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంట్రాక్టర్ల ఘోష ప్రభుత్వానికి కనబడటం లేదా? అని ప్రశ్నించారు. తమకు అపాయింట్‌మెంట్‌ కూడా దొరికే పరిస్థితి లేదని వాపోయారు. అసోసియేషన్‌ సలహాదారు అజయ్‌ మాట్లాడుతూ ఆర్‌అండ్‌బీ, పీఆర్‌డబ్ల్యూఎస్‌, మున్సిపల్‌, ఎస్‌డబ్ల్యూ తదితర శాఖల్లో రూ.10 లక్షలలోపు పనులు చేసిన కాంట్రాక్టర్లు సుమారు ఆరు వేల మంది ఉన్నారని, తమకు చెల్లించాల్సిన బిల్లులు సుమారు రూ.500 కోట్లు ఉన్నాయని వివరించారు.