భారత్‌ను బలోపేతం చేసిన 11 సంవత్సరాలు
కాంగ్రెస్ నేత పి చిదంబరం (’11 సంవత్సరాలు: ఒక విమర్శ’) శీర్షికతో ఒక వ్యాసం రాశారు. “భారతదేశం 2014 కంటే నేడు మెరుగైన, బలమైన లేదా న్యాయమైన దేశం కాదు” అని ఆయన అందులో వాదించారు. ఈ వాదన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన పురోగతిని వక్రీకరిస్తుంది. ఆయన విమర్శ గణనీయమైన వ్యవస్థాగత సంస్కరణలను, సంక్షేమ కార్యక్రమాలను, అంతర్జాతీయంగా పెరిగిన భారతదేశం స్థాయిని విస్మరిస్తుంది. ప్రజాస్వామ్యంలో పాలనపై విమర్శలు తప్పనిసరి అయినప్పటికీ, సైద్ధాంతిక పక్షపాతం కారణంగా మొత్తం జాతీయ పురోగతిని తోసిపుచ్చడం ఎంతమాత్రం నిర్మాణాత్మక విమర్శ కాదు.
భిన్నాభిప్రాయాలను మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని చిదంబరం ఆరోపించారు. ఏదేమైనా, భారతదేశం చురుకైన మీడియా, న్యాయవ్యవస్థ, ప్రతిపక్షంతో శక్తిమంతమైన ప్రజాస్వామ్యంగా ఉంది. జూన్ 25న ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. వరుసగా మూడు జాతీయ ఎన్నికలలో ఎన్డీయే విజయం మోదీ పాలన పట్ల ప్రజల విశ్వాసాన్ని వెల్లడిస్తుందే తప్ప నియంతృత్వాన్ని కాదు. ప్రత్యామ్నాయ అభిప్రాయాలను గౌరవించడం అంటే తప్పుడు సమాచారం లేదా జాతీయ భద్రతకు ప్రమాదాలను అనుమతించడం కాదు. ఐక్యతను దెబ్బతీసే అపరిమిత స్వేచ్ఛను ఏ ప్రజాస్వామ్యమూ అనుమతించదు.
ఆర్థిక వృద్ధి, సంస్కరణలు: సమగ్ర చిత్రం
కోవిడ్-19 మహమ్మారి, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంక్షోభాల వంటి భారతదేశం ఎదుర్కొన్న స్థూల ఆర్థిక సంక్షోభాలను విస్మరిస్తూ ఈ వ్యాసంలో చిదంబరం జీడీపీ వృద్ధి గణాంకాలను తనకు నచ్చిన విధంగా ఎంపిక చేసి పోల్చారు. ఈ షాక్ లు, సంక్షోభాలు కేవలం భారత్‌పైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వృద్ధి మొత్తం పైనే ప్రభావం చూపాయి. 2014 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు (కోవిడ్ ఆర్థిక సంవత్సరం 2021(ప్రతికూల వృద్ధి), ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోన్న సంవత్సరం 2022 మినహా) భారతదేశం సగటున 7.1 శాతం వృద్ధిని సాధించింది. 2004-14లో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది. 2014లో రూ.112.3 లక్షల కోట్ల జీడీపీతో భారత్ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. రూ.330.7 లక్షల కోట్ల జీడీపీతో 2021లో ఐదో అతిపెద్దదిగా, 2025లో నాలుగో అతిపెద్దదిగా నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజా అంచనాల ప్రకారం 2025 నాటికి 10 అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో జీడీపీలో 100 శాతానికి పైగా వృద్ధిని సాధించి అత్యధిక వృద్ధి సాధించిన దేశంగా నిలిచింది. ప్రస్తుత వృద్ధి రేటు అంచనాల ప్రకారం 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
ఎస్బీఐ నివేదిక ప్రకారం 2014 ఆర్థిక సంవత్సరం నుంచి తలసరి జీడీపీ 2.6 రెట్లు పెరిగింది. ప్రస్తుత ధరల వద్ద తలసరి జీడీపీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.2.35 లక్షలుగా ఉంది, దశాబ్ద సీఏజీఆర్ (సంచిత) వృద్ధి 9.1 శాతం. యూపీఏ పదేళ్ళ పాలనలో 7.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం కూడా గత 11 సంవత్సరాలలో సగటున 4.6 శాతంగా ఉంది. జీడీపీలో మూలధన వ్యయం (కాపెక్స్) గత 11 ఏళ్లలో 50 శాతం పెరిగింది. యూపీఏ (2004-14) హయాంలో కాపెక్స్ జీడీపీలో 2 శాతంగా ఉండేది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 3.1 శాతానికి పెరిగింది. ఇది వ్యయాల విషయంలో ప్రభుత్వ నాణ్యతలో మెరుగుదలను ప్రతిబింబిస్తుంది. కాబట్టి, గత 11 సంవత్సరాలలో అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, భవిష్యత్తుకు సంబంధించి మెరుగైన అంచనాలతో భారత్ అందరికీ మేలుచేసిందని చెప్పవచ్చు.
న్యాయం, సమానత్వం
2014 నుంచి భారత్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రజలకు ప్రాధాన్యమిచ్చే విధానాలు, సంస్థాగత సంస్కరణలు, డిజిటల్ ఆవిష్కరణల కారణంగా స్థితిస్థాపకత కలిగిన ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా రూపాంతరం చెందింది. ఈ మార్పులో కీలక అంశం పన్నుల విధానం. ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 2014లో రూ.2.5 లక్షల నుంచి 2025 నాటికి రూ.12 లక్షలకు పెంచారు. 2015లో అనుత్పాదక సంపద పన్నును రద్దు చేయడం, 2017లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ప్రవేశపెట్టడం పరోక్ష పన్నులను క్రమబద్ధీకరించింది, సామర్థ్యాన్ని పెంచింది, అధికారిక ఆర్థిక వ్యవస్థను విస్తరించింది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి, జీఎస్టీ వసూళ్లు రూ.16.75 లక్షల కోట్లు దాటాయి. ఇది పన్ను-జీడీపీ నిష్పత్తి 11.7 శాతానికి చేరుకోడానికి దోహదం చేసింది. ఇది పన్నుల వ్యవస్థను దశాబ్దం క్రితం కంటే సరళంగా, వేగంగా, నిష్పాక్షికంగా మార్చింది.
2014లో 91,287 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల పొడవు 2025 నాటికి 1,46,204 కిలోమీటర్లకు పెరిగింది. అటల్ టన్నెల్, చీనాబ్ బ్రిడ్జి వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రైలు మార్గాల పొడవు 14,000 కి.మీ (2004-14) నుండి రెట్టింపు కన్నా ఎక్కువగా 31,000 కి.మీ (2014-25) అయింది. 2004-2014 మధ్య 21 వేల కిమీ మేర విద్యుదీకరణ జరగ్గా 2014 నుంచి 41,000 కి.మీలకు పెరిగింది. ఓడరేవుల్లో నౌకలు తమ పని పూర్తి చేసుకోడానికి పట్టే సమయం (టర్నరౌండ్) 0.9 రోజులకు మెరుగుపడింది. ఇది సింగపూర్, అమెరికాలను అధిగమించింది. 2014 నుంచి 2023 వరకు ప్రపంచ బ్యాంకు లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ సూచీలో భారత్ 16 స్థానాలు పైకి చేరింది. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సామాజిక పథకాలు ప్రజల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేశాయి.
ఆయుష్మాన్ భారత్ 50 కోట్ల మంది పౌరులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమాను అందిస్తుంది. జల్ జీవన్ మిషన్ 2019లో 3.23 కోట్ల గ్రామీణ గృహాల నుండి 2025 నాటికి 15.6 కోట్లకు నల్లాల ద్వారా నీటి సరఫరాను విస్తరించింది. స్వచ్ఛ భారత్ 10 కోట్ల మరుగుదొడ్లు నిర్మించగా, ఉజ్వల యోజన 9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను అందించింది. ఈ సంస్కరణలు గణనీయమైన ఆర్థిక ఫలితాలకు దారితీశాయి. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గిందని, దీంతో 26.9 కోట్ల మంది పౌరులు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2005-06లో 53.8 శాతంగా ఉన్న బహుముఖ పేదరిక సూచీ 2022-23 నాటికి 15.5 శాతానికి పడిపోయింది. అంతకుముందు దశాబ్దంలో 2.9 కోట్లతో పోలిస్తే 2014 నుంచి 2024 వరకు భారత్ 17.19 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగా, నిరుద్యోగ రేటు 2017-18లో 6 శాతం నుంచి 2023-24 నాటికి 3.2 శాతానికి తగ్గింది. 2013లో 33.95 శాతం యువత ఉద్యోగ నైపుణ్యాలను కలిగివుండగా ఆ శాతం 2024 నాటికి 54.81కు పెరిగింది.
శక్తిమంతమైన భారత్: ఉగ్రవాదంపై ఉక్కుపాదం
2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు, 2025లో ఆపరేషన్ సిందూర్ సహా ఉగ్రవాదాన్ని సహించేది లేదని (జీరో టాలరెన్స్) ప్రకటించేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది. గత 11 సంవత్సరాలుగా అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధంలో ప్రభుత్వం దృఢమైన, స్పష్టమైన విధానం అనుసరిస్తూ అన్నింటికంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చింది. జీ-20 సదస్సు అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ అధ్యక్ష పదవి కాలంలో భారత్ వర్ధమాన దేశాల గొంతుకగా నిలిచింది, అంతర్జాతీయ వేదికలపై ఆ దేశాల ఆందోళనలను సమర్థంగా వ్యక్తీకరించింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గత 25 ఏళ్లలో కంటే గత ఐదేళ్లలో ఎక్కువ రోడ్లు, వంతెనలు నిర్మించడంతో సరిహద్దు మౌలిక సదుపాయాలు వేగంగా పెరిగాయి. పొరుగు దేశాలు రాజకీయ అనిశ్చితికి లోనవుతుంటే, బిమ్ స్టెక్, ఐపీఈఎఫ్, క్వాడ్, షాంఘై సహకార సంస్థ వంటి కార్యకలాపాల ద్వారా పలు దేశాలతో ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ విజయవంతంగా కొనసాగించింది.
ఏదేమైనా, భారతదేశం ఆర్థిక రంగంలో ఇంకా గణనీయమైన పురోగతిని సాధించాల్సి ఉందని గుర్తించడం ముఖ్యం. గడచిన 11 ఏళ్లలో ‘అవినీతి సౌలభ్యం’ (ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్) నుంచి వాణిజ్య సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వైపు అడుగులు వేశాం. సవాళ్లు అలాగే ఉన్నాయి, భారతదేశం వంటి సువిశాల దేశంలో, ఒక సమస్య పరిష్కరిస్తే అది తరచుగా మరొక చోట ఘర్షణకు దారితీస్తుంది. ఏదేమైనా, స్పష్టమైన దార్శనికత, సమర్థమైన విధానం, బలమైన లక్ష్యాలతో సంస్కరణలు అమలు చేస్తే ఎన్ని విజయాలు సాధించవచ్చో గత 11 సంవత్సరాలు చూపించాయి.
గోవింద్ వల్లభ్,
ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి పార్ట్ టైమ్ సభ్యుడు, ఫైనాన్స్ ప్రొఫెసర్

