Phone Tapping

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నాటకాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారని, అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు బిజెపిని అడ్డుకునేలా కుట్రలు చేస్తున్నాయన్నారు. జూన్ 20న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యశాలలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బిజెపి ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ కార్యశాలలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ అంశాలను తెరపైకి తీసుకొస్తోంది. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి, అక్రమాలను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, హామీలను నెరవేర్చకుండా వైఫల్యం చెందిన విషయాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క రూపాయి అప్పుపుట్టడం లేదంటూ మాట్లాడుతున్నడు. ఇది గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాపమే. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల చేతగానితనం, అసమర్థత కారణంగానే తెలంగాణ అప్పులపాలైంది. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించలేని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రైల్వేలు, విద్యారంగం, జాతీయ రహదారులు, ఆరోగ్య రంగం, గ్రామాల్లో అభివృద్ధి.. ఇలా అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా తెలంగాణలో ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదు. 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

ఇప్పటికే జిల్లాల్లో కొత్త నాయకత్వం చేరింది. నూతన అధ్యక్షులు, యువత, ప్రజల నుంచి వచ్చిన నాయకులు చాలామంది కొత్తవారు పార్టీకి శక్తివంతంగా నిలుస్తున్నారు. వారు అందరూ కలిసికట్టుగా పార్టీకి బలం కల్పించాలి. జిల్లాల్లో అనేక మంది ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమైన నాయకులు కూడా ఈ రోజు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వరుసగా అన్ని జిల్లాల్లో బిజెపిలో చేరికల కోసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర పార్టీ నేతలు స్వయంగా చొరవ చూపి వారిని పార్టీలో చేర్చే దిశగా ముందుకెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి కొత్త నాయకత్వం రావాలి. ఇప్పటికే మనం విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం. మండల కమిటీల్లో వచ్చిన కొత్త రక్తానికి, నూతన నాయకత్వానికి పార్టీ సిద్ధాంతాలపై అవగాహన కల్పించాలి. రానున్న రోజుల్లో మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాలి. ఉద్యమాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజల మద్దతును కూడగట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రానికి సరైన దిశలో పరిష్కారాలు లభిస్తాయి. లేకపోతే తెలంగాణను రక్షించడం సాధ్యం కాదు.’’ అని అన్నారు.