కాంగ్రెస్, బీఆర్ఎస్ దగాకోరు సవాళ్లతో ప్రజాసమస్యల పాతర

తెలంగాణలో సోనియా, కేసీఆర్ కుటుంబ పార్టీల కుమ్మక్కు నాటకాలు వెగటు పుట్టిస్తున్నాయి. అసెంబ్లీలోనూ, బయటా ‘‘నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి, ఒకసారి మా వంతు, ఒకసారి మీ వంతు’’ అన్న తరహాలో సాగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓవరాక్షన్ డ్రామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణను ముంచింది కాంగ్రెస్. తెలంగాణను బలవంతంగా ఏపీతో కలిపింది కాంగ్రెస్. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 365 మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది కాంగ్రెస్. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఇరు ప్రాంత ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. మళ్లీ బలవంతంగా కలిపి ఉంచింది కాంగ్రెస్. 2003లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణకు మద్దతు ఇవ్వకుండా దగా చేసింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసి, వెనక్కు తీసుకొని, 1400 మంది యువత బలిదానాలకు కారణమైంది కాంగ్రెస్. పార్లమెంటులో, బయటా బిజెపి ఒత్తిడితోనే అయిష్టంగా ఎన్నో పీటముడులతో తెలంగాణ బిల్లును పెట్టడంతో రాష్ట్రం ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడడానికి కారణమైంది కాంగ్రెస్. అందుకే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని బలిదేవతగా అభివర్ణించారు.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో కేసీఆర్ కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో, అంతకుముందు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన కేసీఆర్ ప్రజల్లో ఉన్న బలమైన సెంటిమెంటును గమనించి రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా వాళ్లెవరూ రాజకీయాల్లోకి రారు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే.. మాట తప్పను మడమ తిప్పను.. అది జరిగితే తల నరుక్కుంటా.. వంటి ఎన్నో దగాకోరు మాటలతో ప్రజలను మభ్యపెట్టారు. ఉద్యమ నాయకుడిగా నటిస్తూ తెలంగాణ అభిమానుల (ఎన్నారైలు) నుంచి వందల కోట్ల సొమ్ము కాజేశారు. ఉద్యమానికి మధ్యమధ్యలో వెన్నుపోటూ పొడిచారు. రకరకాల డ్రామాలతో ప్రజలను మోసం చేసిన పాస్ పోర్ట్ బ్రోకర్ కేసీఆర్. బిజెపి ఒత్తిడి, మద్దతుతో ఏర్పడిన తెలంగాణను తానే సాధించానని ప్రజలను నమ్మించి గద్దెనెక్కారు. అనంతరం ఆయన కుటుంబం తెలంగాణను దోచుకుంది.

2008లో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రధాన డ్యాం కోసం పక్క రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకోకుండా, అక్కడ తట్టెడు మట్టి పోయకుండా, చేవెళ్లలో కాంట్రాక్టర్ల కోసం 650 మీటర్ల ఎత్తులో టన్నెల్లు తవ్వించింది. ఒక్క చుక్క నీరు కూడా రాని ప్రాజెక్టు ప్రాణహిత-చేవెళ్ల. ప్రత్యామ్నాయం పేరుతో కేసీఆర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో నిర్మించిన కాళేశ్వరం కూలేశ్వరంలా మారిపోయింది. కేసీఆర్ మానస పుత్రికగా పేరు గాంచిన ఈ ప్రాజెక్టు కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మరో 50వేల కోట్ల మేరకు పనులు మిగిల్చి, కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు దోచుకుంది.

శ్రీశైలం నీటిని 800 ఫీట్ల నుంచి ఎత్తిపోసేవిధంగా సంగమేశ్వర లిఫ్టు కోసం జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక రచించినప్పుడు, ఆయనతో కుమ్మక్కైన కేసీఆర్ వైసీపీ నాయకులతో రాయలసీమకు వెళ్లి, రాయలసీమను కృష్ణా జలాలతో రతనాల సీమ చేయిస్తానని (కన్నతల్లికి పట్టెడన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు..) దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలు చేసారు. ప్రజా ఉద్యమానికి లోనైన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2006లో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను అక్కమహాదేవి గుహల నుంచి కాకుండా దోమలపెంట నుంచి మొదలుపెట్టి, అనవసరంగా 11 కి.మీ పొడవు పెంచి ఆ ప్రాజెక్టుకు మొదటి పీటముడి పడేలా చేసింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిగులు జలాల పేరుతో నికర జలాలను దోపిడీ చేసేందుకు 834 ఫీట్ల వద్ద నడిపించాల్సిన శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని 870 ఫీట్ల వరకు నడిపించకపోగా, దానికి అనూహ్య వరదలు తోడై ఎస్ఎల్బీసీ టన్నెల్ ను ముంచెత్తడంతో మరో పీటముడి పడింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పేరుతో కాంగ్రెస్ మొదట దగా చేస్తే.. 10ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టు పాతర పడేటట్టు చేసారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అజాగ్రత్తగా టన్నెల్ పనులు ప్రారంభించడంతో 8 ప్రాణాలు పోయాయి, ఆ టన్నెల్ పరిష్కారం లేని సమస్యలా మిగిలిపోయింది.

కృష్ణా నదిలో తెలంగాణ వాటాగా 299 టీఎంసీలకు ఆమోదించి, ఈ నదిపై ఒక్క నీటి నిల్వ ప్రాజెక్టు కట్టకుండా, నీరు పుష్కలంగా లభించినప్పటికీ 255 టీఎంసీలు కూడా రైతులకు అందించలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ మరో దగా చేసారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాల్లో కాంగ్రెస్ ముంచితే.. కేసీఆర్ నూతనంగా ఏర్పడిన తెలంగాణను దగా చేసారు. తెలంగాణ ప్రజలను మరోసారి మరింతగా దగా చేసేందుకు ఈ రెండు పార్టీలు సవాళ్లు, ప్రతిసవాళ్ల కుమ్మక్కు డ్రామాలతో కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. గత 11 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనపై యావత్ దేశంతో పాటు విశ్వాసం పెంచుకున్న తెలంగాణ బిజెపిని ఆదరిస్తుండడంతో ఓర్వలేని ఈ రెండు పార్టీలు డ్రామాలకు మరింత పదును పెడుతున్నాయి. బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.