కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మోదీ ఘనతే
దశాబ్దాల కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కలను సాకారం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. రూ.500 కోట్లతో ఇక్కడ రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటవుతుందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్ నిర్మిస్తున్నామని తెలిపారు. 2026 నాటికి ఈ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. కాజీపేట రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఇక్కడ రైల్వే కోచ్‌లు, ఇంజిన్లతో పాటు మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా జరుగుతాయన్నారు. బహుళ రకాల రైల్వే తయారీ కార్యకలాపాలు ఇక్కడ నిర్వహిస్తారని అన్నారు. జూలై 19న ఆయన కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్-జోధ్ పూర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన రాజస్థానీయుల కోసం ఈ రైలును ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఇందుకు కృషి చేసిన కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, పీపీ చౌదరిలను కొనియాడారు. రైల్వే వ్యవస్థ విస్తరిస్తున్న తరుణంలో కొత్త ట్రాక్‌లు, కొత్త రైళ్లు రావడం సాధ్యమవుతోందన్నారు. దేశంలో కొత్త రైల్వే స్టేషన్ల అభివృద్ధి వేగంగా జరుగుతోందని వివరించారు.
కాజీపేటలో రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నందుకు వరంగల్ జిల్లా ప్రజల తరఫున, అలాగే తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉంది. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయి. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని, మంజూరు చేశారు. మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేశారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కొనసాగుతోంది. అలాగే రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది. వరంగల్ రింగ్‌రోడ్‌లో 50 శాతం పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. టెక్స్టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసింది. వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించింది. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి పౌర విమానయాన శాఖకు అప్పగిస్తే వరంగల్ ప్రజలకు విమాన సౌకర్యం కలుగుతుంది. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బిజెపి ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు తమ కళ్లు తెరిచి చూడాలి, చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలి.

