కారులో లుకలుక, కాంగ్రెస్‌లో లకలక

కేసీఆర్ బిడ్డ కవిత తిరుగుబాటుతో కల్వకుంట్ల కుటుంబ పార్టీ బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మాజీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వార్తలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. బీఆర్ఎస్ లో దెయ్యాలున్నాయని, లిల్లీపుట్ లాంటోళ్లు పార్టీని ముంచుతున్నారని జగన్ మీద షర్మిల తిరుగుబాటు మాదిరిగా ఏకంగా కేసీఆర్ కన్న కూతురు కవిత కేటీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసింది. కుటుంబ దోపిడీలో తనకు రావాల్సిన వాటా రాలేదన్న కోపం, పదవులలో కూడా తనకు అన్యాయం జరుగుతుందన్న కినుక, రేపురేపు కేటీఆర్ కొడుకునే అందలం ఎక్కించి తన బిడ్డలను పక్కకుపెడతారన్న భయం కవిత తిరుగుబాటుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. తమ పార్టీలో ఎన్నడూ లేనివిధంగా నెలకొన్న సంక్షోభంపై ప్రజల దృష్టి వెళ్లకుండా బీఆర్ఎస్ డ్రామాలు, నాటకాలతో రకరకాల వేషాలు వేస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆరు నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి గాడిద గుడ్డే రావడం, తర్వాత జరిగిన విద్యావంతుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొనడం, వరుసగా బయటకు వస్తోన్న అవినీతి ప్రకంపనలు, కవిత తిరుగుబాటుతో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం బీఆర్ఎస్ నాయకుల్లో పూర్తిగా సన్నగిల్లుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బిజెపి అని గ్రహించి కల్వకుంట్ల కుటంబానికి తిలోదకాలిచ్చి బిజెపిలో చేరికలను మొదలుపెట్టారు. గువ్వల బాలరాజు చేరిక ఆరంభం మాత్రమే.

క్రమశిక్షణారాహిత్యానికి కాంగ్రెస్ కేరాఫ్ అడ్రస్. మొదటి నుంచీ కాంగ్రెస్ చరిత్ర ఇదే. క్రమశిక్షణారాహిత్యాన్ని కాంగ్రెస్ నాయకులు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలను దగా చేస్తున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల క్రితమే కాంగ్రెస్ నుంచి దేశ ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ తమ పార్టీ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి వ్యతిరేకంగా తన సొంత అభ్యర్థి వీవీ గిరిని నిలబెట్టి, పార్టీ రాష్ట్రపతి అభ్యర్థినే ఓడించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని చీల్చి తన జేబు సంస్థగా మార్చుకుంది. అప్పటి కాలంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డీకే బరువా ‘ఇందిరే ఇండియా – ఇండియానే ఇందిర’ అన్న నినాదం ఇస్తూ కాంగ్రెస్ అంటేనే నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ జేబు సంస్థ అని బాహాటంగా చాటిచెప్పాడు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఎమర్జెన్సీ దురాగతాలు, అవినీతి, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు తిరుగుబాటుగా 1977లో దేశ ప్రజలు ప్రపంచం ఊహించని విధంగా చారిత్రాత్మక తీర్పుతో ఇందిరాను ఓడించి జనతా పార్టీకి సంపూర్ణ మెజారిటీతో అధికారం ఇచ్చారు.

1977 ఓటమి తర్వాత ఇందిరా గాంధీ దురాగతాలు ఒక్కొక్కటి బయటకు వస్తుండడంతో నాటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కాసు బ్రహ్మానంద రెడ్డి ఇందిరా గాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ రెండోసారి చీలి మూడో అవతారం ఎత్తింది. బ్రిటిష్ వారి రక్షణ కోసం (సేఫ్టీవాల్) 1880 దశకంలో అప్పటి గవర్నర్ జనరల్ ఢఫరీన్ సూచనతో బ్రిటిష్ ఐర్లాండ్ పౌరుడు మాజీ సివిల్ సర్వెంట్ ఏ.ఓ.హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ తిరుగుబాటుతో మొదటిసారి 1969లో చీలి కాడెడ్ల గుర్తు నుంచి ఆవుదూడగా మారింది, ఇందిరా గాంధీని కాసు బ్రహ్మానంద రెడ్డి బహిష్కరించడంతో రెండవసారి ఆవుదూడ గుర్తు నుంచి మొండిచేయి గుర్తుగా ఇందిరా కాంగ్రెస్ పేరుతో మూడో అవతారం ఎత్తింది. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో ఎప్పుడో మునిగిపోయింది.

1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం సానుభూతితో వచ్చిన 400 సీట్ల తర్వాత గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నడూ సొంత మెజారిటీ సాధించలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి సొంత మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014 ఎన్నికలు సహా తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ (2014, 2019, 2024) కాంగ్రెస్ మూడంకెల సీట్లు దక్కించుకోలేదు. ఇది రాహుల్ గాంధీ నాయకత్వ వైఫల్యాలకు ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు లోక్ సభలో 543 స్థానాలున్న ప్రాంతంలో 50 లోపు లోక్ సభ స్థానాలున్న మూడు రాష్ట్రాల్లోనే (కర్నాటక 28, తెలంగాణ 17, హిమాచల్ 4) కాంగ్రెస్ అధికారంలో ఉంది.

కేసీఆర్ మీదున్న తీవ్ర వ్యతిరేకత, బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటే అన్న భయంకర విష ప్రచారం, అధికార దాహంతో ఇచ్చిన అసాధ్య హామీలతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గద్దెనెక్కింది. అయితే ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి కేసీఆర్ అవినీతిపై వివిధ రకాల కమిటీలు, కమిషన్లు, ఎంక్వైరీలు వేసి, వాటాలు దొబ్బుతూ, కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరిపై కూడా ఎలాంటి కేసు పెట్టకుండా, శిక్షించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దగా చేస్తోంది. ఈ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో అనాదిగా వస్తున్న కుమ్ములాటలు బయటకు వస్తున్నాయి. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదన్న విశ్వాసం ఆ పార్టీ నాయకులకే కాదు, కార్యకర్తలకు కూడా కలిగింది. అందుకే ఇప్పుడే పదవులు కావాలని తగువులాడుతున్నారు. అందులో వరంగల్ పంచాయితీ, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రభస మాత్రమే బయటపడ్డాయి, లోపల జరుగుతున్నవి ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులను నమ్మలేక, నమ్మించలేక కొన్ని మంత్రి పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులను పెండింగులో పెట్టి, ఆశ పెడుతూ దినదిన గండంగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోంది. కేవలం సోనియా కుటుంబ దయ మీద ఆధారపడ్డ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తుమ్మితే ఊడిపోయే ముక్కుగా రాజకీయ పండితులు అభివర్ణిస్తున్నారు.

బీఆర్ఎస్ లో కవిత తిరుగుబాటు నుంచి కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి తగువులాట వరకు బీఆర్ఎస్ లో లుకలుక కాంగ్రెస్ లో లకలక ప్రజలకు అర్థం అవుతుంది. కుటుంబం పార్టీలతో ప్రయోజనం సున్నా, దోపిడీ పుష్కలమని మొదటి నుంచి బిజెపి ప్రజలకు చెప్తూ వస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిజెపివైపే పూర్తిగాఉండే పరిస్థితి కనిపిస్తోంది.