CP Radhakrishnan Nomination

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్

హారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా ఆగస్ట్ 20న నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, రాజ్యసభ కార్యదర్శి జనరల్‌ పీసీ మోడీకి రాధాకృష్ణన్‌ తరఫున ప్రధాని మోదీ నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. రాధాకృష్ణన్‌ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, జేడీ(యూ) నేత రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అంతకుముందు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ప్రేరణ స్థల్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి రాధాకృష్ణన్‌ నివాళులర్పించారు. 

ఆగస్ట్ 17న దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. అంతకుముందు ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. దక్షిణ భారత బిజెపి నేతల్లో సీపీ రాధాకృష్ణన్‌ అత్యంత సీనియర్‌. ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్‌ ఓబీసీ నేత, తమిళనాడులో బలమైన గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ‘తమిళనాడు మోదీ’గా పార్టీలో ఆయనకు పేరుంది. పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడు. వివాదరహితుడు.

1957 అక్టోబరు 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌ 16వ ఏట నుంచి ఆరెస్సెస్, జన్‌సంఘ్‌లతో కలిసి పనిచేశారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి 1998, 1999 ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో 93 రోజుల పాటు తమిళనాడులోని ప్రతి నియోజకవర్గాన్ని చుడుతూ 19వేల కిలోమీటర్లమేర రథయాత్ర నిర్వహించి నదుల అనుసంధానం, అంటరానితనం, ఉగ్రవాదం నిర్మూలన గురించి ప్రచారం చేపట్టారు. 2023 ఫిబ్రవరి 12న తొలిసారి ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2024 మార్చి 19న అప్పటి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజీనామాతో ఆ మరుసటిరోజు నుంచి తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 జులై 27న మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయి ప్రస్తుతం అక్కడే సేవలందిస్తున్నారు. 2016-20 మధ్యకాలంలో కాయిర్‌ (కొబ్బరి పీచు) బోర్డు ఛైర్మన్‌గా సేవలందించారు. 2004లో ఐక్యరాజ్యసమితికి వెళ్లిన భారత పార్లమెంటరీ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీ 58వ సమావేశంలో ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబరు 9న జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్‌ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది.

తుదిశ్వాస వరకూ దేశసేవలోనే..

‘‘నన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీ, బిజెపి, ఎన్డీయే పక్షాలకు ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకం, దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించడం నన్ను కదిలించింది. మాటల్లో చెప్పనలవికాని భావోద్వేగానికి గురయ్యాను. నా తుదిశ్వాస వరకూ దేశం కోసం పనిచేస్తా.’’

-సీపీ రాధాకృష్ణన్‌, ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి