మోదీ ప్రసంగం.. భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం
ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి వరుసగా 12వసారి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. 103 నిమిషాల ఈ ప్రసంగం ఇప్పటివరకు భారత ప్రధానుల ప్రసంగాల్లో అత్యంత సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం ద్వారా ప్రధానమంత్రి ఈ ఉత్సవాన్ని ఒక వ్యూహ ప్రకటనగా మార్చారు, 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించాలనే లక్ష్యానికి ఒక ప్రణాళికను అందించారు. మోదీ ప్రసంగం వెనుక ఉన్న ఆలోచన జాతీయవాదం, ఆర్థిక ఆధునికీకరణల సమ్మేళనం. బిజెపి చిరకాల సిద్ధాంతాలు అయిన ఆత్మనిర్భరత, సాంస్కృతిక ఆత్మగౌరవం, బలమైన, ఆత్మవిశ్వాసం గల దేశం అనే నినాదాలు దీనికి పునాదులు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఆత్మనిర్భర భారత్’ కేవలం ఆర్థికపరమైనది కాదు, తాత్వికమైనది కూడా. ఇది విదేశీ శక్తులపై ఆధారపడటాన్ని వలసవాదానికి అవశేషంగా లేదా వర్ధమాన దేశాలపై నయా-వలస పెత్తనాన్ని రుద్దే ప్రయత్నంగా భావించి తిరస్కరిస్తుంది.
‘ఆపరేషన్ సింధూర్’, ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్‌లు, అణుశక్తి విస్తరణ వంటి విషయాలను ప్రస్తావిస్తూ, రక్షణ, సాంకేతికత, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి ఆవశ్యకతను మోదీ నొక్కి చెప్పారు. ఇది భారతదేశం అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త దశను సూచిస్తుంది, ఇందులో రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు ఆర్థిక, సాంకేతిక, డిజిటల్ సార్వభౌమత్వాన్ని కూడా స్వాతంత్ర్యంగా నిర్వచించారు. ఒక దేశం స్వయంసమృద్ధి సాధించినప్పుడు మాత్రమే అది తన జాతీయ ప్రయోజనాలను ఎలాంటి రాజీ లేకుండా సాధించగలదు. స్వదేశీ ఆయుధాలతో భారతదేశం నిర్ణయాత్మకంగా వ్యవహరించగలదని ఆపరేషన్ సిందూర్‌ను ఉదాహరణగా చూపుతూ మోదీ, కొత్త లక్ష్యాలను సాధించాలని దేశానికి పిలుపునిచ్చారు. ఇందులో మొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ చిప్ తయారీ, జెట్ ఇంజన్ల అభివృద్ధి, భారతదేశం వృద్ధికి అవసరమైన స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించడానికి అణుశక్తికి గణనీయమైన ప్రోత్సాహం వంటివి ఉన్నాయి. జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం, జాతీయ సముద్ర పరిశోధన కార్యక్రమం దేశ పారిశ్రామిక, రక్షణ, ఇంధన అవసరాలు దేశీయంగానే తీర్చేందుకు కీలకమైన చర్యలు.
ఔషధ రంగంలో, కోవిడ్ సమయంలో దేశం సాధించిన ఆవిష్కరణలను కొనసాగిస్తూ, చౌకగా ప్రాణ రక్షక ఔషధాలు, వ్యాక్సిన్‌ల తయారీలో భారతదేశం అగ్రగామిగా ఉండటానికి దేశీయ పరిశోధనను, అభివృద్ధిని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని కొనసాగిస్తూ, అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం వేగంగా పురోగమిస్తోందని, స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయని మోదీ అన్నారు. ‘గగన్‌యాన్ మిషన్’ విజయాలు దీనికి ఊతమిచ్చాయని పేర్కొన్నారు. 300కి పైగా స్వదేశీ స్టార్టప్‌లు ఉపగ్రహ సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో ఆవిష్కరణలను ముందుకు తీసుకు వెళ్తున్నాయని ఆయన తెలిపారు.
జాతీయ ఆకాంక్షను, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ప్రతిబింబించే స్వదేశీ పరిష్కారాలతో హై-టెక్నాలజీ రంగాల్లో నాయకత్వం వహించాలన్న భారతదేశ సంకల్పాన్ని ఇవి వివరిస్తాయి. ప్రపంచ ఆహార సంస్థల నుంచి ఎదురయ్యే అసమాన పోటీ, వాణిజ్య చర్చల్లో అనవసర ఒత్తిడి నుంచి మన రైతులను, వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే భారతదేశం సంకల్పాన్ని కూడా మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ‘ఆపరేషన్ సింధూర్’, సింధు జలాల ఒప్పందం ప్రస్తావనలు పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పట్ల రాజీలేని వైఖరిని ప్రతిబింబిస్తాయి. అణు బెదిరింపులకు భారతదేశం తలవంచదని చెప్పడం, కఠినమైన విదేశాంగ విధానం సైనిక సిద్ధాంతంలో మార్పును స్పష్టం చేస్తుంది. నిష్క్రియాత్మక తక్షణ విధానాల నుంచి ముప్పులను ముందుగానే పసికట్టి ముందస్తు దాడులు చేసే వైఖరిని వెల్లడిస్తుంది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవనే సింధుజలాల ఒప్పందంపై స్పష్టమైన వైఖరి భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారు భారీ మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించింది. అక్రమ చొరబాట్ల వల్ల కలిగే తీవ్రమైన, నిరంతర ప్రమాదాలను కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటువంటి అక్రమ చొరబాట్లు మన సరిహద్దులకు మాత్రమే కాకుండా, మన పౌరుల జీవనోపాధికి కూడా, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదమని మోదీ గుర్తు చేశారు. భారత్ తన జనాభా సమతుల్యతను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలను అనుమతించదని జాతీయ సమగ్రత విషయంలో రాజీ పడదని ప్రధాని ప్రకటించారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి, ఆయన ఉన్నత స్థాయి జనాభా కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇది దేశ ఐక్యత, భద్రతలను కాపాడటానికి చేపట్టిన ఒక నిర్ణయాత్మక చర్య. తద్వారా భారతదేశం భవిష్యత్తు దాని పౌరుల సంకల్పం ద్వారా నిర్ణయమవుతుంది తప్ప లోపల నుంచి దానిని బలహీనపరచడానికి ప్రయత్నించే శక్తుల ద్వారా కాదని స్పష్టం చేశారు.
ఈ ప్రసంగం యువత, పారిశ్రామికవేత్తలకు కృత్రిమ మేధ, డీప్-టెక్, స్వచ్ఛమైన ఇంధనం, తయారీ రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చింది. కొత్త తరం సంస్కరణలను వేగవంతం చేయడానికి, పాలనను సులభతరం చేయడానికి, ఆర్థిక వృద్ధిని పెంచడానికి సంస్కరణల టాస్క్ ఫోర్స్ ను ను ప్రకటించారు. ఈ సంస్కరణలలో మొదటిది, ‘తదుపరి విడత జీఎస్టీ’. దీపావళికి దీనిని ప్రకటిస్తారు. వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, తరహా మధ్యతరహా పరిశ్రమలకుల మేలు చేయడానికి దీనిని రూపొందించారు. మోదీ ఉపాధి కల్పనను ‘స్వతంత్ర భారత్’ (స్వతంత్ర భారతదేశం) నుంచి ‘సమృద్ధ భారత్’ (సంపన్న భారతదేశం) వైపు సాగే ప్రయాణంలో ఒక కీలకమైన భాగమని పేర్కొన్నారు. మోదీ రూ.1 లక్ష కోట్ల విలువైన ఒక ప్రధాన ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. దీని కింద కొత్తగా ఉద్యోగం పొందిన యువతకు రూ.15,000 లభిస్తుంది. ఈ పథకం ద్వారా 3 కోట్ల మంది యువ భారతీయులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మోదీ ప్రసంగాన్ని 2025లో నెలకొని ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఇది భౌగోళిక రాజకీయ అస్థిరత, ఆర్థిక అనిశ్చితులు, మారుతున్న సంబంధాల నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ పథాన్ని ఆవిష్కరించారు. సెమీకండక్టర్లు, రక్షణ, ఇంధనం వంటి కీలక రంగాలలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టడం అనేది ప్రపంచ సరఫరా గొలుసులలో అస్థిరత, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవటానికి ఉద్దేశించిన ఒక క్రియాశీలమైన చర్య. స్వదేశీ సెమీకండక్టర్ తయారీ, జెట్ ఇంజన్, దేశ అణుశక్తి సామర్థ్యాలను విస్తరించడం గురించి నొక్కి చెప్పడం ద్వారా భారత్ ప్రపంచంలోనే అగ్ర దేశాలతో సమానంగా నిలబడాలనే లక్ష్యాన్ని ఈ ప్రసంగం వ్యక్తీకరించింది. అధిక నాణ్యతతో కూడిన, సరసమైన వస్తువులను ఉత్పత్తి చేయాలనే సందేశం భారతదేశం తన జనాభా ప్రయోజనాలను, ప్రజాస్వామ్య పునాదులను ఉపయోగించుకొని ప్రపంచ మార్కెట్లో ఒక శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యాన్ని నొక్కి చెప్పింది. మోదీ ప్రసంగం ఆకాంక్షను వాస్తవిక వ్యూహంతో మేళవించే కళకు ఒక ఉదాహరణ. ఇది 140 కోట్ల మంది పౌరులను జాతీయ స్వయంసమృద్ధి, ‘వికసిత్ భారత్’ అనే దార్శనికతల వెనుక సమీకృతం చేసింది. యువతను, మహిళలను, రైతులను ‘వికసిత్ భారత్’కు మూలస్తంభాలుగా చేయడం ద్వారా ఈ సందేశం సమ్మిళతత్వం, సాహసాల సందేశాన్ని ప్రజల్లోకి పంపింది. స్వదేశీ సాంకేతికత, బలమైన రక్షణ సామర్థ్యంపై నరేంద్ర మోదీ సంకల్పం అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత్ బలంగా నిలబడవలసిన అవసరాన్ని ఉద్ఘాటిస్తుంది.
అభినవ్ ప్రకాష్,
బిజెపి యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు

