అక్కసుతోనే భారత్‌పై అమెరికా టారిఫ్‌లు
భారత్ విశ్వగురువుగా మారుతుందనే అక్కసుతో అమెరికా లాంటి దేశాలు భారత్‌పై టారిఫ్‌లు పెంచుతున్నాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు భారత్ భయపడదని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక సంస్కరణలు, చట్టాలు అమలులోకి వచ్చాయని, రానున్న రోజుల్లో భారత్ ప్రపంచంలో విశ్వగురువుగా మారడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను, పోరాట యోధులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సంకినేని వెంకటేశ్వర రావు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘దేశంలో పాలించే హక్కు మా కుటుంబానిదే అనుకునే పరిస్థితిలో, ఒక చాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధాన మంత్రిగా అవతరించి, ఎర్రకోటపై 12వ సారి జాతీయ జెండా ఎగురవేయడం సామాన్యుడికి గర్వకారణం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అవతరించిన తరువాత, భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి కాలంలో ప్రోఖ్రాన్ అణు పరీక్షలు జరిగినప్పుడు ప్రపంచ దేశాలు అనేక ఆర్థిక ఆంక్షలు విధించాయి. భారత్‌కు ఆర్థిక సహాయం నిరాకరించాయి. అయినప్పటికీ, అటల్ బిహారీ వాజ్‌పేయి దేశ సమగ్రత, భద్రత కోసం ప్రోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించారు. ఆంక్షలు ఎదుర్కొన్నప్పటికీ, ఆనాడు ఎన్డీయే ప్రభుత్వం భారతదేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించింది.
స్వాతంత్ర్య ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. నేడు మళ్లీ చరిత్రను తిరగరాయాలి. అందుకే స్వదేశీ వస్తువులను, ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకుని, పర్యావరణ పరిరక్షణలో మనమందరం భాగస్వామ్యం కావాలి. గత 11 సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అద్భుతమైన పురోగతి, ప్రగతి సాధించింది. దేశ రహదారుల పొడవు భారీగా పెరిగింది. గ్రామీణ కనెక్టివిటీ పూర్తయింది. కొత్త రహదారులు, ఆర్థిక కారిడార్లు, ఎక్స్ ప్రెస్ వేలు నిర్మాణమయ్యాయి. కొత్త రైల్వేలైన్లు, రైల్వే ట్రాక్ లకు విద్యుదీకరణ పూర్తయింది. అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల కింద వేలాది రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేశారు. మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి చెందుతోంది. దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు దేశ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. రైతులు, యువత ప్రయోజనాలకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థపై మన విశ్వాసం ఉంది. దేశాన్ని అవమానించే వారిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను.’’ అని అన్నారు.

