నిజాం వ్యతిరేక పోరాటంలో చిరస్మరణీయ త్యాగాలు
నాడు తెలంగాణ ప్రజలు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, చిరస్మరణీయ త్యాగాలు చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. గత 25 సంవత్సరాలుగా బిజెపి ఆ పోరాట యోధులు స్మరించుకుంటూ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ చర్య చేపట్టకపోతే ఈ ప్రాంతం పాకిస్తాన్లో కలిసి పోవడమో, లేక మరో స్వతంత్ర దేశంగా ఉండడమో జరిగేదన్నారు. సెప్టెంబర్ 17న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ విమోచనం కోసం పోరాడిన అనేకమంది పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్, చంద్రశేఖర్ తివారీ, బిజెపి తమిళనాడు, కర్ణాటక సహ ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. “మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటాం. కానీ నాడు హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్ర్యం రాలేదు. ఆపరేషన్ పోలో ద్వారా నియంత నిజాంకు వ్యతిరేకంగా అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చరిత్రాత్మక పోలీస్ చర్య ద్వారా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైంది. ఈ విజయం వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయి. కాసిం రజ్వీ రజాకార్ల సైన్యం హైదరాబాద్ సంస్థానంలో అనేకమంది అమాయకులను వేధించింది, మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు, అనేకమంది ప్రాణాలు బలితీసుకున్నారు. భైరాన్పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వంటి అనేక ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో అనేకమంది రజాకార్లపై పోరాటం చేశారు. ఈ చరిత్ర మనందరికీ గుర్తుగా నిలిచిపోవాలి. అప్పుడు జరిగిన సంఘటనలు మనం ఎప్పటికీ మరచిపోకూడదు.
పోరాటయోధుల త్యాగాన్ని మర్చిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. కానీ తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబరు 17ను అధికారికంగా జరుపుకోవడానికి నిరాకరించింది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. గత మూడు సంవత్సరాలుగా మన సైనిక, కేంద్ర బలగాలు కూడా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నాయి. సెప్టెంబరు 17 విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరుపుకుంటున్నామంటే.. అది కేవలం బిజెపి నాయకుల వల్లే సాధ్యమైంది.” అని అన్నారు.

