వాణిజ్య ఒప్పందంపై రాహుల్ చౌకబారు విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో కుదిరిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సరైన ప్రశ్నలను లేవనెత్తే పూర్తి హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అయితే, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేయాల్సింది పోయి, పార్లమెంటును స్తంభింపజేయడానికే వారు మొగ్గు చూపారు. ప్రభుత్వ అధినేతపై విచ్చలవిడిగా ఆరోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపించింది. ప్రభుత్వం సైతం ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని పార్లమెంటు లోపల, వెలుపల పదేపదే స్పష్టం చేసింది.
రెండు దశాబ్దాల క్రితం యూపీఏ-1 హయాంలో ద్వైపాక్షిక ఒప్పందంపై ఇటువంటి దుమారం రేగింది. 2005 తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు పార్లమెంటులో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆ ఒప్పందం 2008 అక్టోబర్‌లో ఒక కొలిక్కి రావడానికి పూర్తిస్థాయిలో మూడేళ్లు పట్టింది. ఆనాటి ఉద్వేగభరిత చర్చల్లో కేవలం ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి మాత్రమే కాకుండా, ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్షాలు కూడా కొన్ని నిబంధనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అవి చివరికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆనాటి అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విజ్ఞులైన వీక్షకులకు ఒక విందులా ఉండేవి. పార్లమెంటు లోపల, వెలుపల నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయి. కేవలం ప్రజాప్రతినిధులే కాకుండా ఏఎన్ ప్రసాద్, పి కె అయ్యంగార్ వంటి ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా జోక్యం చేసుకుని, హైడ్ చట్టం, భవిష్యత్ అణు పరీక్షలపై రాబోయే ఆంక్షల గురించి సూటిగా తమ ఆందోళనలను వెలిబుచ్చారు. నేడు పార్లమెంటులో అటువంటి నిర్మాణాత్మక చర్చలు కరువయ్యాయి.
ఈసారి ప్రతిపక్షాల తీరు నిర్మాణాత్మకంగా కంటే గందరగోళంగా ఉంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒప్పందంపై నిర్దిష్టమైన అభ్యంతరాలు లేవనెత్తడానికి బదులు, ప్రభుత్వంపై వ్యక్తిగత దాడులు, నీచమైన ఆరోపణలకు దిగారు. పార్లమెంటులో ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి “భారతదేశాన్ని అమ్మేయడానికి మీకు సిగ్గుగా లేదా? మీరు మన మాతృభూమిని, భారత మాతను అమ్మేశారు” అంటూ నాటకీయంగా మాట్లాడారు. ఎప్ స్టీన్ ఫైళ్ళు, అంబానీ, అదానీ వంటి అసంబద్ధ అంశాలను ప్రస్తావిస్తూ మోదీ “ఒత్తిడిలో ఉన్నారని”, “రాజీ పడ్డారని”, “లొంగిపోయారని” దూషించారు. “వారు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.. అలాంటప్పుడు కళ్లలో భయం కనిపిస్తుంది, అది ప్రధాని కళ్ళల్లో కనిపిస్తోంది,” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనం.
భారత్, అమెరికాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం అసాధారణ అంతర్జాతీయ పరిస్థితుల మధ్య జరుగుతోందని పలువురు నిపుణులు గుర్తు చేశారు. గతంలో ఇటువంటి ఒప్పందాలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి బహుళపక్ష సంస్థల ఆధ్వర్యంలో జరిగేవి. కానీ ఇప్పుడు మనం అస్తవ్యస్తమైన ప్రపంచంలో ఉన్నాం. ట్రంప్ ఈ అస్థిరతకు మూలకర్త మాత్రమే కాదు, దానిని తనకు అనుకూలంగా వాడుకునే వ్యక్తి కూడా. అనేక దేశాలు ఆయన విచిత్రమైన డిమాండ్లకు తలొగ్గినప్పటికీ, భారత్ దాదాపు ఏడాది కాలం పాటు పట్టుదలతో నిలబడి, పరస్పర ప్రయోజనకరమైన నిబంధనలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందుకే ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ దీనిని అమెరికా వెనక్కి తగ్గడంగా అభివర్ణించారు. “మోదీ అద్భుతమైన పని చేశారు. ఆయన సంయమనంతో ఉంటూ పరిస్థితిని తెలివిగా ఎదుర్కొన్నారు,” అని ప్రశంసించారు.
ఏ ఒప్పందమైనా ఏకపక్షంగా ఉండదు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఉన్న పరిస్థితుల్లో భారత్ ఉత్తమమైన ఒప్పందాన్ని సాధించిందని స్పష్టమవుతోంది. ప్రతిపక్షాల ప్రచారానికి విరుద్ధంగా భారత ప్రతినిధి వర్గం వ్యవసాయ రంగానికి పకడ్బందీ రక్షణ కల్పించింది. కేవలం అమెరికాతోనే కాకుండా ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్‌లతో జరిగిన ఒప్పందాల్లో కూడా పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, పాడి ఉత్పత్తులు, మాంసం, నూనెగింజలు వంటి ప్రధాన ఉత్పత్తులన్నింటికీ పూర్తి రక్షణ కల్పించారు. కొన్ని పశుగ్రాసాలపై సుంకాలను తగ్గించడం పశుగ్రాస పరిశ్రమపై కొంత ప్రభావం చూపినప్పటికీ, అది కోళ్ళు, ఇతర పశువుల పెంపకందారులకు మేలు చేస్తుంది.
ఒప్పందం ఆలస్యం కావడాన్ని ప్రతిపక్షాలు అమెరికా ఒత్తిడిగా తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ ఒప్పందంలో అధిక భాగం కొన్ని నెలల క్రితమే భారత, అమెరికా వాణిజ్య శాఖల అధికారుల మధ్య ఖరారైంది. అయితే ట్రంప్ వాణిజ్యాన్ని అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపెట్టడం, భారత్-పాక్ వివాదాన్ని పదేపదే ప్రస్తావించడం వల్లే ఒప్పందం ఆలస్యమైంది. అలా ముడిపెట్టడం కొనసాగినంత కాలం ఒప్పందం కుదరదని భారత అధికారులు కచ్చితంగా చెప్పారు. ఆ అధ్యాయం ముగిసిన తర్వాతే ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు, వెంటనే ఒప్పందంపై ప్రకటన వెలువడింది.
వాణిజ్యాన్ని అంతర్జాతీయ రాజకీయాలతో, నోబెల్ బహుమతితో ముడిపెట్టడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం చివరికి భారత్ కు కలిసివచ్చింది. అమెరికా బెదిరింపులు భారత్ దగ్గర సాగలేదు. రాహుల్ గాంధీ ఈ ఒప్పందాన్ని ప్రధానిని వ్యక్తిగతంగా దూషించడానికి వాడుకోవాలని చూస్తున్నారు. కానీ ఆయన చేసిన “పిరికివాడు”, “ఓట్ల దొంగ”, “లొంగిపోయాడు” వంటి వ్యాఖ్యలను ఎవరూ తీవ్రంగా పరిగణించడం లేదు. ఈ ఉదంతం ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయకపోగా, ప్రతిపక్ష నేత బాధ్యతారాహిత్యాన్ని, అనుచిత ప్రవర్తనను మరోసారి బయటపెట్టింది.
రామ్ మాధవ్,
బిజెపి సీనియర్ నాయకుడు

