ఉగ్రవాదానికి మరణ శాసనం ‘ప్రహార్’
ఉగ్రవాదంపై సాగిస్తున్న అవిశ్రాంత పోరాటంలో భారత్ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ‘ప్రాయోజిత ఉగ్రవాదం’, వ్యవస్థీకృత నేరాలు, తప్పుడు సిద్ధాంతాలు, ఇతర ముప్పులను ఎదుర్కొంటూ జాతీయ భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక సమగ్ర వ్యూహాన్ని ప్రకటించింది. ‘ప్రహార్’ పేరుతో రూపొందించిన ఈ విధానం దేశంలోనే మొట్టమొదటి సమగ్ర ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతం. కేవలం సరిహద్దు ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే కాకుండా, సైబర్ నేరాలు, మాల్వేర్ దాడులు, ఆన్లైన్ ఫిషింగ్ వంటి ఆధునిక సాంకేతిక ముప్పులను కూడా ఎదుర్కోవడమే దీని లక్ష్యం. జాతీయ భద్రతను, ప్రపంచ శాంతిని కాపాడేందుకు ఈ సిద్ధాంతం ఒక బహుళ అంచెల వ్యూహాత్మక వ్యవస్థగా పనిచేస్తుంది.
‘ప్రాయోజిత ఉగ్రవాదం’, జిహాదీ అరాచకాలకు చెక్
కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ‘ప్రహార్’ విధానం ప్రకారం… భారత్ ఉగ్రవాదాన్ని ఏ నిర్దిష్ట మతానికో, జాతికో, జాతీయతకో లేదా నాగరికతకో ఆపాదించదు. అయితే, భారత్ సుదీర్ఘ కాలంగా సరిహద్దు అవతలి నుంచి సాగుతున్న ప్రాయోజిత ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉందని ఈ పత్రం పేర్కొంది. తమ అక్రమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ‘జిహాదీ ఉగ్రవాద సంస్థలు, వారి ముసుగు సంస్థలు’ భారత్లో ఉగ్రవాద చర్యలకు కుట్రలు చేస్తూనే ఉన్నాయని ప్రహార్ పునరుద్ఘాటించింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వెలుపల నుంచి నడిచే జిహాదీ ఉగ్రవాద ముఠాలకు వ్యతిరేకంగా భారత్ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. జాతీయ భద్రతను సమీకృతం చేయడం ద్వారా ప్రాంతీయ, ప్రపంచ శాంతికి భరోసా ఇవ్వడం భారత్ లక్ష్యం. ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించాలనే భారత్ సంకల్పానికి ‘ప్రహార్’ వ్యూహం కొత్త దిశను, ఉత్తేజాన్ని ఇస్తుంది.
అల్-ఖైదా, ఐసిస్ ముప్పులపై హెచ్చరిక
ప్రపంచ శాంతికి, సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న ఐసిస్, అల్-ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల వల్ల భారత్ ఎదుర్కొంటున్న ముప్పును ఈ పత్రం వివరించింది. ‘భారత్లో స్లీపర్ సెల్స్ (రహస్య ఉగ్రవాద బృందాల) ద్వారా హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్న అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) వంటి ప్రపంచ ఉగ్రవాద బృందాలకు భారత్ లక్ష్యంగా ఉంది’ అని ప్రహార్ పేర్కొంది. విదేశాల నుంచి పని చేస్తున్న కొన్ని తీవ్రవాద విభాగాలు భారత్ సామాజిక-రాజకీయ నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఈ విధానం వెల్లడించింది. ఉగ్రవాదం, సైబర్ ముప్పుల వంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా భారత్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఈ ముఠాల ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
టెక్నో-టెర్రరిజం: ఉగ్రవాదుల కొత్త ఆయుధం
సాంప్రదాయ పద్ధతుల్లో చొరబాట్లతో పాటు ఉగ్రవాదులు ఇప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. దీనిని ‘ప్రహార్’ విధానం ‘టెక్నో-టెర్రరిజం’గా అభివర్ణించింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు, దాడులకు పాల్పడటానికి సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద సమన్వయకర్తలు (హ్యాండ్లర్ర్లు) డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. అలాగే, భారత్లో దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్వర్క్లను వాడుకుంటున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ల ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం, అమాయకులను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడం, నిధుల సేకరణ వంటి చర్యలను ఈ విధానం ఎండగట్టింది. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ (సందేశాలను ఇతరులు చూడటానికి వీల్లేకుండా చేసే సాంకేతికత), డార్క్ వెబ్, క్రిప్టో వ్యాలెట్లు వంటి సాంకేతికతను వాడుకుంటూ భద్రతా సంస్థల కంటపడకుండా ఉగ్రవాదులు తప్పించుకుంటున్నారని పేర్కొంటూ , వీటిని అడ్డుకోవడంపై ప్రహార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి ప్రహార్ పలు పరిష్కారాలను సూచించింది. రసాయనిక, జీవ, రేడియోధార్మిక, అణు, పేలుడు, డిజిటల్ ఆయుధాలు ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా చూడటం అంతర్జాతీయ సమాజం బాధ్యత అని స్పష్టం చేసింది. డ్రోన్లు, రోబోటిక్స్ వంటి సాంకేతికతను విధ్వంసకర పనుల కోసం వాడుకోవడం ఆందోళనకరమని పేర్కొంది.
న్యాయ నిపుణుల పాత్ర
ఉగ్రవాదులకు శిక్ష పడేలా చేయడంలో న్యాయ నిపుణుల పాత్రను ఈ పత్రం నొక్కి చెప్పింది. స్థానిక పోలీసు స్టేషన్ల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, ఉగ్రవాదులను కోర్టుల ముందు ప్రవేశపెట్టి కఠిన శిక్షలు పడేలా చేయడంలో న్యాయ నిపుణులు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది.
అన్నిస్థాయిల్లో సమన్వయం
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రహార్ పిలుపునిచ్చింది. ఉగ్రవాదులు స్థానిక సంస్కృతి, భౌగోళిక పరిస్థితులను వాడుకుంటూ స్థానికులతో సంబంధాలు పెంచుకుంటున్నారని, దీనిని అడ్డుకోవడానికి క్షేత్రస్థాయి సమన్వయం అవసరమని పేర్కొంది. స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, మత పెద్దలు ప్రజల్లో అవగాహన కల్పించి, యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా చూడాలని సూచించింది.
సన్నద్ధత, మౌలిక సదుపాయాల రక్షణ
భారత్ భూఉపరితలం, జల, వాయు మార్గాల నుంచి ఎదురయ్యే ఏ రకమైన ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ప్రహార్ స్పష్టం చేసింది. దేశ ఆర్థిక రంగానికి కీలకమైన విద్యుత్, రైల్వే, రక్షణ సంస్థలు, అణుశక్తి కేంద్రాలు, విమానాశ్రయాలు, రేవులు, అంతరిక్ష రంగాలను కాపాడుకోవడానికి బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. జైళ్లలో ఉన్న ఖైదీలు తీవ్రవాద భావజాలానికి ప్రభావితం కాకుండా ఉండేందుకు వారిని అతివాద భావజాల ప్రభావం నుంచి దూరం చేసే కార్యక్రమాలను కూడా ఈ విధానం ప్రతిపాదించింది. దీర్ఘకాలంలో, దేశవ్యాప్తంగా ఒకే విధమైన, క్రమబద్ధమైన ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను నిర్మించడమే ప్రహార్ లక్ష్యం. రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పని చేసేలా ఒకే రకమైన నిబంధనలను అమలు చేయాలని ఇది ఆకాంక్షిస్తోంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని ధోరణి (జీరో టాలరెన్స్) తో భారత్, జాతీయ భద్రతను కాపాడుకుంటూ ప్రపంచ శాంతి సాధన దిశలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ప్రకృతి కౌండిన్య

