Ashwini Vaishnav

బుల్లెట్ రైళ్ల హబ్‌గా హైదరాబాద్

Ashwini Vaishnav at Hyderabadదేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనున్నట్లు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పుణె, చెన్నై, బెంగళూరుకు మూడు బుల్లెట్ రైలు కారిడార్లను అభివృద్ధి చేసే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు. జూలై 11న హైదరాబాద్‌లో జరిగిన ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలు వ్యవస్థ నిర్మాణం అత్యంత అధునాతన సాంకేతికతతో కూడుకున్నదని పేర్కొన్నారు. ముంబై–అహ్మదాబాద్ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు వేగంగా సాగుతోందని, వచ్చే ఏడాది సూరత్–బిలిమోరా మధ్య తొలి దశ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న ‘వికసిత్ భారత్–2047’ సాధనలో సాంకేతిక రంగం కీలక పాత్ర పోషిస్తోందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సాఫ్ట్‌వేర్ సేవల ఆధారిత నమూనా నుంచి ‘ఏఐ యాజ్ ఏ సర్వీస్’ దిశగా పరిశ్రమ అడుగులు వేయాలని సూచించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పని చేస్తే కృత్రిమ మేధ (AI) రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వాన్ని సాధించగలదని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ఏఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వ భాగస్వామ్యంతో నాస్కామ్ సమగ్ర పాఠ్య ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో దాదాపు 10 లక్షల మంది నిపుణుల కొరత ఉందని, భారత యువతకు ఇది గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 12 సెమీకండక్టర్ ప్లాంట్లు వివిధ దశల్లో ఉండగా, వాటిలో మూడు ఇప్పటికే జపాన్, యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు చిప్‌లను ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. ప్రతిభావంతుల తయారీ కోసం 315 విశ్వవిద్యాలయాలకు అధునాతన సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణలో 104 ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సహకరించిందని, నాలుగు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో రూ.880 కోట్లు మాత్రమే కేటాయించేవారని, ప్రస్తుతం తెలంగాణకే రూ.5,454 కోట్లు కేటాయిస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో పునర్నిర్మిస్తున్నామని, హైదరాబాద్ (నాంపల్లి), బేగంపేట, హైటెక్ సిటీ, వరంగల్, కరీంనగర్ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, తెలంగాణకు ఇప్పటికే ఐదు వందే భారత్ రైళ్లు అందించగా, భవిష్యత్తులో మరిన్ని రానున్నాయని వెల్లడించారు.

సమావేశం అనంతరం అశ్వినీ వైష్ణవ్ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లోని మేధా సర్వో డ్రైవ్స్ రైల్వే కోచ్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. రైల్వే కోచ్‌లు, ఇంజిన్ల తయారీ ప్రక్రియను పరిశీలించి, సంస్థ ప్రతినిధుల నుంచి సాంకేతిక వివరాలు తెలుసుకున్నారు. పర్యటన ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్న చాట్ స్టాల్ వద్ద అశ్వినీ వైష్ణవ్ పానీపూరీ రుచి చూశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుతో కలిసి పానీపూరీ తీసుకున్న ఆయన, బిల్లును డిజిటల్ విధానంలో స్కాన్ చేసి చెల్లించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.