Criminal Law

పోలీసు వ్యవస్థ పనితీరును మార్చిన కొత్త నేరచట్టాలు

నూట యాభై ఏళ్లకు పైగా భారతదేశ నేర న్యాయ వ్యవస్థ వలస పాలన నాటి చట్టాల ఆధారంగానే నడిచింది. ప్రజాస్వామ్యం కోసం కాకుండా కేవలం అధికారాన్ని చెలాయించడం కోసమే ఆ చట్టాలను నాటి బ్రిటిష్ పాలకులు రూపొందించారు. ‘1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC), 1898 నాటి కోడ్ నేరస్మృతి (CRPC), 1872 నాటి భారతీయ సాక్ష్యాల చట్టం స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతూనే వచ్చాయి. అయితే జూలై 1, 2024న భారతదేశం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వలస చట్టాల స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ (BNS), ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ (BNSS-కొత్త నేరస్మృతి), ‘భారతీయ సాక్ష్య అధినియమ్’ (BSA-కొత్త సాక్ష్యాల చట్టం)లను తీసుకువచ్చింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది అత్యంత సమూలమైన నేర చట్టాల సంస్కరణ అని చెప్పవచ్చు.

హరియాణా డీజీపీగా ఈ కీలకమైన మార్పును నేను ఒక అధికారిగా మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో నా బృందంతో కలిసి పనిచేసిన అధికారిగా స్వయంగా చూశాను. కొత్త నేర చట్టాల అమలులో హరియాణా ప్రస్తుతం దేశంలోనే అగ్రగామిగా ఉంది. ఈ పరివర్తనలో ప్రతి అడుగును నేను చాలా నిశితంగా గమనించాను. మేము దర్యాప్తు అధికారులకు మళ్లీ శిక్షణ ఇచ్చాము, పని విధానాలను మార్చాం, సరికొత్త సాంకేతికతను స్వీకరించాం. నేర్చుకునే ప్రక్రియ చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఈ సంస్కరణ అత్యంత అవసరమైనది. ఒక్కసారి ఆలోచించండి: ఐపీసీ 420 స్థానంలో బిఎన్ఎస్ 318, ఐపీసీ 302 స్థానంలో బిఎన్ఎస్ 101 వచ్చినప్పుడు… పరిమిత విద్య, శిక్షణ ఉన్న దర్యాప్తు అధికారులు సైతం దశాబ్దాల నాటి పాత పద్ధతులను మర్చిపోయి, దాదాపు రాత్రికి రాత్రే సరికొత్త సెక్షన్లపై పట్టు సాధించాల్సి వచ్చింది. ఈ మార్పు తీవ్రతను అర్థం చేసుకోవాలంటే భారత్ సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లను మనం పరిశీలించాల్సి ఉంటుంది:

అంతులేని ఆలస్యా‌నికి స్వస్తి 

భారతదేశ నేర న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘జాప్యం’. దేశంలో ప్రస్తుతం 5.58 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి కేవలం 21,285 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. దీనివల్ల న్యాయం నత్తనడకన సాగుతోంది, ప్రజల్లో నమ్మకం సడలిపోతోంది. ఒక ప్రసిద్ధ హిందీ సినిమా డైలాగ్ ‘తారీఖ్ పే తారీఖ్’ (వాయిదాల మీద వాయిదాలు) కేవలం సినిమాపరమైన అతిశయోక్తి కాదు. అది వాస్తవానికి అద్దంపడుతోంది. అయితే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టం కచ్చితమైన కాలపరిమితులను విధించడం ద్వారా ఈ ఆలస్యానికి నేరుగా అడ్డుకట్ట వేస్తుంది. మహిళలపై జరిగే లైంగిక నేరాలపై దర్యాప్తును దర్యాప్తు అధికారులు రెండు నెలల్లోగా పూర్తి చేయాలి. అలాగే వాదనలు ముగిసిన తర్వాత నిర్ణీత వ్యవధిలోనే న్యాయమూర్తులు తీర్పులను వెల్లడించాల్సి ఉంటుంది. ఈ చట్టం అనవసరపు వాయిదాలను నియంత్రిస్తుంది. ఒకవేళ దర్యాప్తు ఆలస్యమైతే, నిర్ణీత గడువు ముగిసిన తర్వాత నిందితులకు చట్టబద్ధమైన బెయిల్ ద్వారా ఆటోమేటిక్ హక్కులు లభిస్తాయి. ఈ కాలపరిమితులను మరింత బలోపేతం చేయడానికి సాంకేతికత తోడైంది. ‘ఇ-సాక్ష్య’ వంటి డిజిటల్ సాక్ష్యాల నిర్వహణ వ్యవస్థ ద్వారా నేర స్థలానికి సంబంధించిన రికార్డులను టైమ్-స్టాంప్, జియో-ట్యాగింగ్‌తో భద్రపరుస్తున్నారు. దీనివల్ల సాక్ష్యాల విశ్వసనీయత దెబ్బతినకుండా ఉంటుంది. 

‌విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం

నేరం నిరూపణ కాకుండానే ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోయే పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. భారతదేశంలోని దాదాపు 76 శాతం ఖైదీల వాస్తవ పరిస్థితి ఇదే. వీరంతా న్యాయం కోసం ఎదురుచూస్తూ సుదీర్ఘకాలంగా జైళ్లలోనే బందీలుగా మిగిలిపోతున్నారు. ఈ కొత్త చట్టాల చట్రం కాలపరిమితితో కూడిన దర్యాప్తును నిర్దేశించింది. గడువు తప్పితే దానంతట అదే (డిఫాల్ట్) బెయిల్ ఇచ్చే విధానం అమలులోకి వస్తుంది. రిమాండ్ ప్రక్రియల కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ఇప్పుడు సర్వసాధారణమైంది. ఒక విచారణ ఖైదీ ఆ నేరానికి ఉండే గరిష్ట శిక్షా కాలంలో నిర్ణీత భాగాన్ని ఇప్పటికే అనుభవించి ఉంటే, వారి విడుదలను తప్పకుండా పరిశీలించాలి. ఈ చర్యలు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతాయి.

‌మౌఖిక సాక్ష్యాల నుంచి శాస్త్రీయ ఆధారాల వైపు..

కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు మీ జ్ఞాపకశక్తి లేదా మీ భద్రతపైనే కేసు ఫలితం ఆధారపడి ఉంటుందని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. గతంలో మౌఖిక సాక్ష్యాలపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల కేసులు బలహీనపడేవి. సాక్షులు కొన్నిసార్లు మాటమార్చడం (హోస్టైల్ అవ్వడం) లేదా బెదిరింపులకు గురవడం జరిగేది. కొత్త చట్టాలు ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తున్నాయి. తీవ్రమైన నేరాలకు ఫోరెన్సిక్ దర్యాప్తును ఇప్పుడు తప్పనిసరి చేశారు. డిజిటల్ రికార్డులకు కోర్టుల్లో విస్తృతమైన ఆమోదం లభిస్తోంది. శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులపైనే ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. దీనివల్ల కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడే పరిస్థితి తగ్గి, సాక్ష్యాల పునాది మరింత బలోపేతం అవుతుంది. హరియాణాలో మొబైల్ ఫోరెన్సిక్ బృందాలు నేరుగా నేర స్థలాలకు చేరుకుంటున్నాయి. నేర స్థల నిపుణులు స్వతంత్రంగా సాక్ష్యాలను సేకరిస్తున్నారు. వేలిముద్రలు, డిఎన్‌ఏ, డిజిటల్ ముద్రలు, ఇతర ఆధారాలు నశించిపోకముందే వాటిని భద్రపరుస్తున్నారు. దీంతో సాక్ష్యాల గొలుసు మరింత బలంగా మారుతోంది. కోర్టులో నిజం గెలిచే అవకాశాలు మెరుగవుతున్నాయి.

‌21వ శతాబ్దపు నేరాల గుర్తింపు

వలస కాలం నాటి చట్టాలు సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరస్థ ముఠాలు (ఆర్గనైజ్డ్ సిండికేట్స్) లేదా డిజిటల్ ఆర్థిక నెట్‌వర్క్‌లను ఊహించలేదు. అలాగే ‘మాబ్ లించింగ్’ (గుంపు దాడి చేసి చంపడం) లాంటి ఘోరాలను కూడా అవి అంచనా వేయలేదు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ఈ ముప్పులను స్పష్టంగా నిర్వచించి, శిక్షలను ఖరారు చేసింది. మహిళలకు, పిల్లలకు రక్షణలను మరింత బలోపేతం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి చేయడం, అరెస్టుల విషయంలో రక్షణలు కల్పించడం వంటి సుప్రీంకోర్టు తీర్పుల కీలకమైన మార్గదర్శకాలను కేవలం కోర్టు వ్యాఖ్యానాలుగా ఉంచకుండా, నేరుగా చట్టబద్ధమైన నిబంధనలుగా మార్చారు. దీనివల్ల పౌరులకు చట్టబద్దమైన హక్కులు లభిస్తాయి. కోర్టుల స్పష్టత కోసం వారు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు.

‌‌ఎఫ్ఐఆర్ నుంచే న్యాయం

ఫిర్యాదు ఎక్కడ చేయాలో తెలియని గందరగోళం కారణంగా మీలో ఎవరైనా లేదా మీకు తెలిసిన వారు ఎప్పుడైనా నేరంపై ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేశారా? తరతరాలుగా ఇలాంటి చట్ట పరిధి వివాదాల వల్ల చాలామంది నిశ్శబ్దంగా ఉండిపోయారు, న్యాయానికి దూరమయ్యారు. ఇప్పుడు వచ్చిన ‘జీరో ఎఫ్‌ఐఆర్’ విధానం వల్ల నేరం ఎక్కడ జరిగినా సరే, ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ‘ఎలక్ట్రానిక్ ఎఫ్‌ఐఆర్’ ద్వారా ప్రజలు డిజిటల్‌గా ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు. సాక్షుల రక్షణ, వీడియో-లింక్ ద్వారా సాక్ష్యాల నమోదు, సాక్షుల వివరాలను గోప్యంగా ఉంచే చర్యలు ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. చిన్న తరహా నేరాలను నేరాల జాబితా నుండి తొలగించడం కూడా ఈ లక్ష్యాలకు తోడ్పడుతుంది. సమాజ సేవ శిక్షలను ప్రవేశపెట్టడం వల్ల జైళ్లలో రద్దీ తగ్గుతుంది, చిన్న తప్పులకే నేరస్థులుగా ముద్రపడే పరిస్థితి తప్పుతుంది. ఈ చర్యలన్నీ మరింత మానవీయ, ఆధునిక న్యాయ చట్రాన్ని సూచిస్తాయి. ఉదాహరణకు హరియాణాలో క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్లు, బలమైన సాక్షుల రక్షణ, డిజిటల్ సాధనాలు ఇప్పుడు నేరుగా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ పురోగతి కేవలం పోలీసింగ్‌కే పరిమితం కాలేదు. ఎలక్ట్రానిక్ సమన్లు, డిజిటల్ కేసుల నిర్వహణ, వీడియో కాన్ఫరెన్సింగ్ ల వల్ల డబ్బు, మానవ వనరులు, సమయం భారీగా ఆదా అవుతున్నాయి. 

ఈ సాధనాలు సమర్థతను, పారదర్శకతను పెంచుతున్నాయి. హరియాణా ‘ఇ-చలాన్’ వ్యవస్థ కేవలం నాలుగు నెలల్లోనే 8,165 కిలోల కార్బన్ ఉద్గారాలను తగ్గించింది. ఇ-సమన్లు, వీడియో కాన్ఫరెన్స్ విచారణల వల్ల ఆరు నుంచి ఏడు నెలల వ్యవధిలోనే రూ 26 కోట్లు ఆదా అయ్యాయి. దీనివల్ల మిగిలిన పని గంటలను ఇప్పుడు దర్యాప్తు, గస్తీ కోసం వినియోగిస్తున్నారు. ఖైదీలను కోర్టులకు తీసుకెళ్లడం లేదా కాగితపు ఫైళ్లను నిర్వహించే భారం పోలీసులపై తగ్గింది.

పోలీసు వ్యవస్థలో శాస్త్రీయ ఆలోచన, ఆధారాల-ఆధారిత పనితీరు పెరిగాయి. పోలీసులమైన మాకు, ఈ మార్పులో మా పాత్ర కేవలం పరిపాలనాపరమైనది మాత్రమే కాదు, అది ఒక నైతిక బాధ్యత కూడా. మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్లను ఉపయోగించడం ద్వారా బాధితులకు మేము ఇచ్చే సందేశం ఒక్కటే: “మీ పక్షాన ఉన్న నిజం మాకు ముఖ్యం”. ఇ-సమన్లు జారీ చేయడం ద్వారా సాక్షుల సమయానికి మేము గౌరవం ఇస్తున్నాము. డిఎన్‌ఏ, వాయిస్ నమూనాలు, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ నివేదికల మద్దతుతో కూడిన డిజిటల్ ఛార్జ్‌షీట్‌తో కేసును ముగించడం ద్వారా పోలీసులు సౌలభ్యం కంటే నిజానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని మేం కోర్టుకు నిరూపిస్తున్నాము.

కొత్త నేర చట్టాలు మనకు శక్తిమంతమైన సాధనాలను అందించాయి. అయితే భాగస్వామి— పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ ల్యాబ్, న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, ప్రజలు — వీటిని పూర్తి నిబద్ధతతో, పారదర్శకతతో, వేగంతో ఉపయోగించడం చాలా ముఖ్యం. వేగంతో పాటు నిష్పాక్షికత ఉండే ఒక నమ్మకమైన న్యాయ వ్యవస్థను సాధించడమే కదా మన నిజమైన లక్ష్యం. అంతిమంగా, మనకు కావలసింది కేవలం వేగవంతమైన విచారణలు మాత్రమే కాదు, సార్వభౌమ దేశ పౌరులకు తగినట్లుగా గౌరవప్రదమైన న్యాయం లభించడం. ప్రజలు న్యాయం కోసం భయంతో కాదు, పూర్తి నమ్మకంతో అడుగులు వేయాలి.

అజయ్ సింఘాల్,
హరియాణా డీజీపీ