‘జెన్ జీ’ ఆవేదనపై స్పందించిన మోదీ
కేవలం నాలుగు రోజుల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ యువత ఆందోళనలను ప్రజాస్వామ్య కార్యాచరణ రూపంలోకి అనువదించారు. జూలై 23న పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రంతో జరిగిన చర్చల అనంతరం జూలై 24న సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. జూలై 25న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఆ తర్వాత ఆందోళనకారులు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన 36 రోజుల నిరసనను ముగించారు. పరీక్షల నిర్వహణను విశ్వసనీయంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారితంగా మార్చడంలో సహాయపడటానికి నందన్ నిలేకణి నాయకత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను జూలై 26న మోదీ ప్రకటించారు. జూలై 27న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ కఠినమైన శిక్షలు, గడువుతో కూడిన దర్యాప్తులు, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తుంది. ఈ చర్యలన్నీ కలిసి, ప్రజల ఆందోళనలను ఆలకించి, బాధ్యతను స్వీకరించి, వాటిని శాశ్వత సంస్కరణలుగా మార్చే ప్రయత్నాన్ని మన కళ్ళముందు ఆవిష్కరిస్తున్నాయి. ఇవి ఇష్టం లేని ప్రభుత్వం నుంచి బలవంతంగా రాబట్టిన రాయితీలు కావు; ఇవి బలమైన ప్రజాస్వామ్య నాయకత్వానికి ప్రతీకలు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన పౌరుడి హక్కు. ఆ హక్కు, బాధ్యతాయుతమైన పరిపాలన ఒకదానికొకటి ఎలా బలాన్ని చేకూరుస్తాయో ప్రభుత్వ స్పందన చూపించింది.
చర్చలకు తలుపులు తెరిచి ఉంచడం ద్వారా, నిరసనకారులతో సంప్రదింపులు జరిపి, సంప్రదింపుల నుంచి నిర్ణయాత్మక చర్యల వైపు వేగంగా అడుగులు వేయడం ద్వారా భారతీయ యువత గొంతుకకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉందనే విషయాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత ప్రజాస్వామ్యం విభేదించే హక్కును లేదా సరిదిద్దుకునే సామర్థ్యాన్ని కోల్పోయిందనే విస్తృతమైన విమర్శలను ఈ ఉదంతం తిప్పికొట్టింది. వారాల తరబడి కొనసాగిన ఒక ఉద్యమం, జాతీయ స్థాయిలో చర్చకు దారితీసి, ప్రభుత్వాన్ని చర్చల పట్టిక వద్దకు తీసుకువచ్చి, శాసనపరమైన, నిర్మాణత్మకమైన స్పందనను సాధించింది. విభేదం వ్యవస్థను స్తంభింపజేయాల్సిన అవసరం లేదని, అది చర్చలకు, సంస్కరణలకు మార్గం సుగమం చేయగలదని భారత ప్రజాస్వామ్యం నిరూపించింది. 1974, 1975ల మధ్య జేపీ (జయప్రకాశ్ నారాయణ్) ఉద్యమం తీవ్రరూపం దాల్చింది; జూన్ 25, 1975న రామ్‌లీలా మైదాన్‌లో జేపీ నిర్వహించిన ర్యాలీ జరిగిన కొద్ది గంటలకే ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. పౌర హక్కులను రద్దు చేసింది. పత్రికలపై సెన్సార్‌షిప్ విధించింది, జేపీతో సహా ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టింది. 1990 నాటి మండల్ వ్యతిరేక నిరసనలు పూర్తిగా వేరే సందర్భంలో తలెత్తాయి, కానీ అవి కూడా అలజడికి, హింసాత్మక ఘర్షణలకు దారితీశాయి. ఆ ఉద్యమాలు, ఈ నాటి సంఘటనలు ఒక్కటి కావు. అయితే, ప్రస్తుత సంఘటన ఒక భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది: అణచివేత లేదా సుదీర్ఘమైన నిర్లక్ష్యానికి బదులుగా మోదీ ప్రభుత్వం చర్చలు, బాధ్యత, చట్టబద్ధత, వ్యవస్థాగత సంస్కరణల మార్గాన్ని ఎంచుకుంది. మోదీ స్పందన ఆకాంక్షభరిత భారత్‌తో ఆయన జరుపుతున్న సుదీర్ఘ సంభాషణలో భాగం.
2018 నుంచి ‘పరీక్షా పే చర్చ’ పరీక్షల ఆందోళన, తల్లిదండ్రుల ఒత్తిడి, ఆత్మవిశ్వాసం, సమయ నిర్వహణను ఒక జాతీయ చర్చగా మార్చింది. ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ కూడా దేశ భవిష్యత్తు కోసం ఆలోచనలను అందించడానికి భారతీయ యువతను ఆహ్వానిస్తోంది. మొత్తంగా చూస్తే, ఈ కార్యక్రమాలు విస్తృత అవకాశాలను, బలమైన వ్యవస్థలను మిళితం చేసే ఒక సమగ్ర దృక్పథాన్ని సూచిస్తాయి. గత కొన్ని రోజుల్లో చోటుచేసుకున్న పరిణామాలు మోదీ నాయకత్వపు ఒక విశిష్టతను కూడా వెల్లడించాయి: అదే ‘రాజకీయ ఔదార్యం’. నమ్మకమైన నాయకుడు విమర్శలను స్వీకరించగలడు, ఆందోళనలను గుర్తించగలడు, వ్యక్తిగత ప్రతిష్ట కంటే వ్యవస్థాగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వగలడు. ఒక సహచరుడి రాజీనామాను ఆమోదించడం ద్వారా, చర్చలకు తలుపులు తెరిచి ఉంచడం ద్వారా, వినడం నుంచి చర్యల వైపు అడుగులు వేయడం ద్వారా ప్రధాని మోదీ ఘర్షణ కంటే సయోధ్యనే ఎంచుకున్నారు. నిలేకణి నియామకం ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది: సమష్టి జ్ఞానం జాతీయ సంపద. మాజీ యూఐడీఏఐ ఛైర్మన్‌తో పాటు ఎస్ సోమనాథ్, తపన్ దేకా, వి కామకోటి, అనితా కర్వాల్, అమృత్ లాల్ మీనా ఈ బృందంలో ఉన్నారు. వీరు సాంకేతికత, భద్రత, విద్య, లాజిస్టిక్స్ రంగాలలో నిపుణులు. భద్రపరచిన ప్రశ్నపత్రాల బ్యాంకులు, గోప్యంగా పంపిణీ (ఎన్‌క్రిప్టెడ్ ట్రాన్స్‌మిషన్), ర్యాండమైజేషన్, సమాచార రక్షణ, స్వతంత్ర ఆడిట్‌లు, సరఫరాదారుల (వెండర్స్)పై కఠినమైన పర్యవేక్షణతో పాటు వీలైన చోట కంప్యూటర్ ఆధారిత లేదా భద్రతతో కూడిన ఆన్-సైట్ ముద్రణ సంస్కరణలో భాగం కావాలి. ఒక స్వతంత్ర పరీక్షల-భద్రతా బోర్డు, వార్షిక ఆడిట్‌లు, జాతీయ పరీక్షల క్యాలెండర్ జాతీయ పరీక్షలా సంస్థ (NTA) ని మరింత బలోపేతం చేయగలవు. చివరగా, వేగవంతమైన, ప్రత్యేక దర్యాప్తు ద్వారానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిపాదిత రెండు నెలల దర్యాప్తు వ్యవధి, మూడు నెలల విచారణ చట్రానికి శిక్షణ పొందిన డిజిటల్-ఫోరెన్సిక్స్ బృందాలు, అనుభవజ్ఞులైన ప్రాసిక్యూటర్లు, సాక్షుల రక్షణ, రాష్ట్రాలు, హైకోర్టులతో సమన్వయం తోడ్పడతాయి. ఈ చర్యలు విద్యార్థులకు సుదీర్ఘమైన అనిశ్చితి లేకుండా, పరీక్షల నేరాలను వేగంగా గుర్తించి, నిరూపించి, నిందితులకు శిక్షపడేలా చేస్తాయి. నమ్మదగిన పరీక్షా వ్యవస్థ నాలుగు హామీలపై ఆధారపడి ఉంటుంది: పేపర్ లీక్ లేదా అక్రమాలు చేయడం అత్యంత కష్టతరం కావాలి, వేగంగా గుర్తించాలి, పారదర్శకంగా సరిదిద్దాలి, నమ్మదగిన రీతిలో దోషులకు శిక్షపడాలి. ప్రధాని తీసుకున్న చర్యలు ఇప్పుడు ఈ హామీలను ఒక స్పష్టమైన సంస్కరణల చట్రంలోకి తీసుకువచ్చాయి. మోదీ గత దశాబ్ద కాలంగా భారతీయ యువతతో వారు ‘వికసిత భారత్’లో భాగస్వాములని చెబుతూ వస్తున్నారు. ఇటీవలి సంఘటనలు దానికి ఒక వ్యవస్థాగత రూపాన్ని ఇచ్చాయి.
గౌరవ్ వల్లభ్,
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు

